సాక్షి, హైదరాబాద్ : కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన జి.వి.దేవేంద్రరెడ్డి వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దేవేంద్రరెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితులుగా దేవేంద్రరెడ్డి ఉన్నారు. ఇంతకుముందు పార్టీ ఏపీ ఐటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ఈ సందర్భంగా దేవేంద్రరెడ్డి మాట్లాడుతూ.. మీడియా కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు అందించినందుకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌కు, పార్టీ పెద్దలు రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, దివ్యారెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు.
రాబోయే రోజుల్లో అన్ని స్థాయిలలో పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. సోషల్ మీడియా ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న దుర్మార్గాలను, అరాచకాలను లేవనెత్తుతూ ప్రజాస్వామ్యయుతంగా పోస్టులు పెట్టే పార్టీ వాలంటీర్లకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటానన్నారు. అన్ని జిల్లాల్లో పర్యటించి సోషల్ మీడియా వాలంటీర్లను కలిసి వారిలో స్ఫూర్తినింపుతానని దేవేంద్రరెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment