
సాక్షి, విజయవాడ : విజయవాడ తూర్పు నియోజకవర్గం మూడవ డివిజన్‌లో బుధవారం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్, డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ప్రవల్లిక, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించి 2, 3, 5, 6, 7 డివిజన్ల కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల ప్రచారంలో అన్ని డివిజన్ల అభ్యర్థులు ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు. సీట్ల కేటాయింపుల్లో యువకులకు, విద్యావంతులకు పెద్ద పీఠవేశామని తెలిపారు.
చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే వాయిదాకు కుట్ర పన్నారని విమర్శించారు. కరోనాను సాకుగా చూపి ఎన్నికల కమిషన్‌ను మేనేజ్ చేసిన వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. బాబు ఎన్ని కుట్రలు పన్నినా విజయవాడ మేయర్ సీటును కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గంలో ఉన్న 21 కార్పొరేషన్ స్థానాలు వైసీపీనే కైవసం చేసుకోనుందని వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు పరిష్కరించడానికి రూ. 135 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. పేదలకు త్వరలోనే 25 వేల ఇళ్లపట్టాలను ఇవ్వనున్నామని, అమ్మ ఒడి పథకం ద్వారా నియోజకవర్గంలోని మహిళలకు లబ్ధి చేకూరుతుందన్నారు.