దుమ్ముగూడెం, న్యూస్‌లైన్: ముక్కోటి ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్ స్థానిక సిబ్బందిని ఆదేశించారు. భద్రాచల అనుబంధ ఆలయమైన పర్ణశాల రామాలయాన్ని ఆయన ఆదివారం సందర్శించారు. స్నానఘట్టాలను పరిశీలించిన ఆయన ఆయా ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. నదిలో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాళ్లను సిద్ధం చేయాలని అన్నారు. అనంతరం రామాలయ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. రామాలయంలో అర్చకులు వేదమంత్రాలతో కలెక్టర్‌కు స్వాగతం పలికారు. రామయ్యను దర్శించుకున్న కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించి పరిసర ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముక్కోటి ఉత్సవాలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అన్నారు. అదేవిధంగా బాపు ఏర్పాటు చేసిన కుటీరం, విగ్రహాల వద్ద ‘ఇందిరమ్మ పచ్చ తోరణం’ పథకం ద్వారా మొక్కలను పెంచాలని సూచించారు. దీనికి అవసరమైన నిధులను సమకూర్చాని ఐటీడీఏ పీఓ వీరపాండియన్‌కు సూచించారు.
హైడల్ ప్రాజెక్టు పరిశీలన: దుమ్ముగూడెం గోదావరి నదీ బ్రాంచ్ ఆనకట్ట వద్ద నిర్మించిన విద్యుత్ మినీ హైడల్ ప్రాజెక్టును కలెక్టర్ పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను మేనేజర్ శ్రీనివాసరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు అన్నీ పూర్తి అయ్యాయని త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.
కలెక్టర్ వెంట జేసీ సురేంద్రమోహన్, జెడ్పీసీఈఓ జయప్రకాష్, ఆర్డీఓ వెంకటేశ్వరరావు, స్థానిక తహశీల్దార్ జి.వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విశ్వనాథసుబ్రహ్మణ్యం, ఎస్సై సత్యనారాయణ, ఈఓఆర్డీ నాగేశ్వరరావు, కార్యదర్శి బొగ్గా నారాయణ, విద్యుత్, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలి
Published Mon, Jan 6 2014 4:28 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
Advertisement