
తీర్థవాదికి పోటెత్తిన భక్తులు
రామతీర్థం(విడవలూరు): శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం అత్యంత కీలక ఘట్టంమైన తీర్థవాది భక్తులతో పోటెత్తింది. సుమారు లక్ష మంది భక్తులు తీర్థవాది(సముద్ర స్నానం)లో పాల్గొన్నారు. సోమవారం రాత్రి శ్రీ కామాక్షి సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం అనంతరం నూతన దంపతులు మంగళవారం వేకువన వసంతోత్సవంలో పాల్గొన్నారు.
సీతాన్వేషణలో భాగంగా రాముడు తూర్పు తీరానికి వెళుతూ శివపూజకు వేళ కావ డంతో రామతీర్థం వద్ద స్పటిక శింగలింగాన్ని ఏర్పాటు చేసుకుని పూజలు చేసి అనంతరం ఇక్కడ సముద్రస్నానం చేశారని భక్తుల విశ్వాసం. రామతీర్ధం నుంచి సముద్రం ఒడ్డుకు వెళ్లే దారి పొడువునా భక్తులతో కిక్కిరిసిపోయింది. వేలాది మంది భక్తుల హరనామ స్మరణలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.