భవిష్యత్తు కార్యాచరణపై చర్చ
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం వెలుగులోకొచ్చాక దీనికి కౌంటర్‌గా ఏపీలో నమోదైన కేసుల్ని దర్యాప్తు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) శనివారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో భేటీఅయింది. సిట్ సారథి డీఐజీ మహ్మద్ ఇక్బాల్‌తోపాటు సభ్యులుగా ఉన్న చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఏఎస్పీ దామోదర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్రాథమికంగా 13 జిల్లాల్లో నమోదై, తమకు బదిలీ అయిన 88 కేసుల స్వరూపస్వభావాలను చర్చించారు. దర్యాప్తు ఏ కోణంలో ప్రారంభించాలి, నోలీసుల్ని ఏ ఏ నేరాలకింద, ఎవరెవరికి జారీచేయాలి అనేది ఖరారు చేయడానికి న్యాయనిపుణులతోనూ సిట్ సంప్రదింపులు జరుపుతోంది. సోమవారం నుంచి పూర్తి స్థాయి కార్యాచరణ ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.
మరోవైపు విజయవాడ సత్యనారాయణపురం పోలీసుస్టేషన్ నుంచి బదిలీ అయిన ‘మత్తయ్య కేసు’ దర్యాప్తునూ సీఐడీ అధికారులు ముమ్మరం చేశారు. ఇందులో టీఆర్‌ఎస్, హైదరాబాద్ ఏసీబీ పేర్లతో వచ్చిన ఫోన్ బెదిరింపులు ప్రధాన ఆరోపణ కావడంతో ఆయా సర్వీస్ ప్రొవైడర్ల నుంచి మత్తయ్యతోపాటు మరికొందరి కాల్ డేటాలను అధికారికంగా తీసుకున్న దర్యాప్తు అధికారి విశ్లేషించడం ప్రారంభించారు.సోమవారం నుంచి నోటీసుల జారీతోపాటు ఇతర చర్యలు మొదలుపెడతారని తెలుస్తోంది.
12 మంది సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఫోన్‌గానీ ఇతర మంత్రుల ఫోన్లుగానీ ట్యాప్ అయ్యాయా? లేదా? అనే విషయాన్ని తెలియజేయాలంటూ 12 మంది సర్వీస్ ప్రొవైడర్లకు సిట్ శనివారం నోటీసులు జారీ చేసింది. ఓటుకు కోట్లు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో సీఎం చంద్రబాబు ఫోన్ ఆడియో సంభాషణల టేపులు బయటపడిన సంగతి తెలిసిందే.
డీజీపీ కార్యాలయంలో ‘సిట్’ భేటీ
Published Sun, Jun 21 2015 2:38 AM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM
Advertisement