సాక్షి, అరసవల్లి(శ్రీకాకుళం) : సచివాలయ ఉద్యోగాల నియామకాలన్నీ అత్యంత పారదర్శకంగా జరిగాయని, సీఎం జగన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులంతా ప్రభు త్వ లక్ష్యాన్ని చాటిచెప్పేలా పనిచేశారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ కొనియాడారు. సోమవారం ఆయన పలువురు అభ్యర్థులకు సచివాలయ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పన చేపట్టలేదని, అది కూడా అత్యంత పారదర్శకంగా, ఎలాంటి సిఫార్సులకు, ఒత్తిళ్లకు తలొగ్గకుం డా ఉద్యోగాలను భర్తీ చేయడం ఓ చరిత్ర అని అన్నారు. ‘సాక్షాత్తు నా కొడుక్కయినా అడ్డదారిలో ఈ ఉద్యోగం వచ్చే అవకాశమే లేద’ని సభాముఖంగా చెప్పారు. ఉద్యోగాలు సాధించిన ప్రతి అభ్యర్థికి శుభాకాంక్షలు తెలియజేస్తూ... ‘మీకిప్పుడు సమాజంలో గౌరవంతోపాటు కొత్తగా బాధ్యతలు పెరిగాయని, అవినీతికి దూరంగా నిజాయితీగా పనిచేయాల’ని సూచించారు.
సచివాలయాల వ్యవస్థతో క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు సద్వినియోగమవుతాయని, ఇందుకోసం ఉద్యోగులంతా కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని సూచించారు. ‘మనం పాలకులం కాదు... సేవకులమని...’ ముఖ్య మంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు తమతో అంటుంటారని, వయస్సులో చిన్నవాడైనా... అతనిలో కార్యదక్షత, నిజాయితీ, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం వంటి లక్షణాలు ఎంతో ఆదర్శ నీయమైనవన్నారు. రైతుల కోసం రైతు భరోసా, మహిళల కోసం 50 శాతం రిజర్వేషన్లు, నిరుద్యోగుల కోసం స్థానికులకు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగావకాశాలు, అమ్మఒడి, వెయ్యి రూపాయలు ఖర్చు దాటిన ప్రతి రోగానికి ఆరోగ్యశ్రీ వర్తింపు.. దశలవారీగా మద్యపాన నిషేధం ఇలా అన్ని వర్గాల ప్రజలకు వర్తించేలా ఎన్నో పథకాలను ఈ కొద్ది రోజుల్లోనే అమలు చేశారని గుర్తు చేశారు. సచివాలయ ఉద్యోగాలను సాధించిన వారిలో.. 80 శాతం మందికి పైగా సామాన్య, మధ్యతరగతి స్థాయి కుటుంబాలకు చెందినవారేనని, నీతినిజాయితీలతో పనిచేస్తే వెలకట్టలేని గుర్తింపు వస్తుందని సూచించారు. ఇలా పనిచేయడమే సీఎం జగన్‌కు కృతజ్ఞతతో మీరిచ్చే గిఫ్ట్ అని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు.
ఎక్కడి సమస్యకు అక్కడే పరిష్కారం
జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ భారీ ఉద్యోగాల నియామక ప్రక్రియను జిల్లా ఎంపిక కమిటీ సభ్యులంతా చాలా కష్టపడి రాత్రి పగలు అన్న తేడా లేకుండా పూర్తి చేశారని, పూర్తిగా మెరిట్ బేసిస్‌తోనే జాబితాలను తయారు చేశామని స్పష్టం చేశారు. సచివాలయాల వ్యవస్థతో స్థానిక సంస్థలు బాగా బలోపేతమవుతాయని, ఎక్కడి సమస్యకు అక్కడే పరిష్కారం దొరుకుతుందన్నారు.
సొంత మండలాల్లో ఉద్యోగాలు దొరకడం అద్భుతమైన అవకాశమని, దీన్ని కొత్త ఉద్యోగులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో జి.చక్రధరరావు, డీఆర్‌డీఏ పీడీ కళ్యాణ్ చక్రవర్తి, డీపీవో రవికుమార్, ఆర్డీవో ఎం.వి.రమణ, డీపీఆర్వో ఎల్.రమేష్, నగర కార్పొరేషన్ కమిషనర్ ఎం.గీతాదేవి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, మున్సిపల్ మాజీ చైర్మన్ అంధవరపు వరాహ నర్సింహం, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, వ్యవసాయ శాఖ జేడీ ప్రసాద్, తహశీల్దార్ ఐ.టి.కుమార్ తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ ఎ.ఎస్.చక్రవర్తి ఆధ్వర్యంలో సీఐలు లలిత, సాకేటి శంకరరావులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment