'బాబు కక్షపూరిత వైఖరి మార్చుకోవాలి'
హైదరాబాద్: రాష్ట్రంలో పారిశ్రమలు స్థాపించే వారిపై చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ఇకనైనా ఆ వైఖరిని విడనాడాలని ఆయన చంద్రబాబు సర్కార్కు ఆయన శుక్రవారం హైదరాబాద్లో హితవు పలికారు. సరస్వతి పవర్ మైనింగ్ లీజులు ఏపీ సర్కార్ రద్దు చేయడానికి గల కారణాలు సహేతుకంగా లేవని ఆయన అన్నారు. మీ తర్వాత ప్రభుత్వాలు కూడా ఇలాంటి కార్యక్రమాలే చేస్తే మీ పరిస్థితి ఏమిటని టీడీపీ ప్రభుత్వాన్ని ధర్మాన ప్రసాదరావు నిలదీశారు. ఓ వైపు ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా పరిశ్రమలు స్థాపించాలని కోరుతుంటే ... రాష్ట్రంలో టీడీపీ సర్కార్ ఇలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమన్నారు.
మీ ఆలోచన రాష్ట్ర శ్రేయస్సును కాంక్షించేలా లేదని చంద్రబాబుకు సూచించారు. చట్టాలు అందరికి సమానంగా ఉండాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన మిగతా కంపెనీల అనుమతులు ఎందుకు రద్దు చేయలేదని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. సరస్వతి భూములు ప్రభుత్వ భూములేం కాదు... పూర్తిగా నగదు చెల్లించి కొనుగోలు చేసిన భూములేని ధర్మాన స్పష్టం చేశారు. అలాంటి భూములను ఆక్రమించుకోవాలని రైతులకు పిలుపు నివ్వడం న్యాయమా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలను ప్రోత్సహించకూడదని చంద్రబాబు ప్రభుత్వానికి హితవు పలికారు.