నిర్లక్ష్యం’ ఖరీదు నిండు ప్రాణం
బాసర ట్రిపుల్ ఐటీ కళాశాల అధికారుల నిర్లక్ష్యం ఓ విద్యార్థి ప్రాణం బలి తీసుకుంది. కళాశాలలో ఈ-4 చదువుతున్న నల్గొండ జిల్లా కనగరి మండలం గౌరారం గ్రామానికి చెందిన నాగరాజు ఆదివారం ఉదయం ఏడు గంటలకు బీహెచ్-1 భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గమనించిన విద్యార్థులు ట్రిపుల్ ఐటీ అధికారులకు సమాచారం అందించారు. మరికొందరు ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి ఆస్పత్రికి వెళ్లగా అక్కడ వైద్యులు, సిబ్బంది, అంబులెన్సు అందుబాటులో లేక విద్యార్థులు వెనుదిరిగారు. ఆలస్యంగా స్పందించిన అధికారులు 40 నిమిషాల తర్వాత ఓమిని వ్యానును పంపించారు. వ్యానులో తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాగరాజును ఆస్పత్రికి తరలించే క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది తమకు అధికారులు చెప్పలేదని నిలువరించారు. అధికారుల సమాచారం వచ్చాకే బయటకు తీసుకువెళ్లాలని తేల్చి చెప్పారు. ఎట్టకేలకు అధికారులు స్పందించడంతో విద్యార్థిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో వైద్య సేవలు అందిస్తున్న క్రమంలోనే నాగరాజు ప్రాణాలు వదిలాడు.
అధికారుల నిర్లక్ష్యం
తమతోపాటు చదువుకునే విద్యార్థి నాగరాజును రక్షించుకోలేక పోయామని అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని ట్రిపుల్ ఐటీలో చదివుతున్న ఆరు వేల మంది విద్యార్థులు రోడ్డుపైకి వచ్చారు. భైంసా-బాసర ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు రోడ్డుపైనే ఆందోళన నిర్వహించారు. ట్రిపుల్ ఐటీ కళాశాల డెరైక్టర్ రాజేంద్రసాహూ, ఓఎస్‌డీ నారాయణ, సీఎస్‌వో వజీరోద్ధిన్, సెక్యూరిటీ సూపర్‌వైజర్ స్వామి, సాయినాథ్, శివప్రసాద్‌లను తక్షణమే విధుల్లో నుంచి తొలగించాలని విద్యార్థులు పట్టుబట్టారు. భైంసా డీఎస్పీ గిరిధర్ ట్రిపుల్ ఐటీకి చేరుకుని కళాశాల అధికారులను పిలిపించి విద్యార్థుల డిమాండ్లపై చర్చించారు. కళాశాల అధికారుల దాటవేత ధోరణితో మరోసారి విద్యార్థులు మధ్యాహ్నం రెండోసారి రోడ్డుపై బైఠాయించారు. అధికారులను తొలగించనిది ఆందోళన విరమించమని రాత్రి వరకు కూడా రోడ్డుపైనే బైఠాయించారు.
దిగొచ్చిన అధికారులు
ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఉదయం నుంచి ఆందోళన నిర్వహిస్తుండటం, రాత్రి వరకు కూడా విరమించకపోవడంతో ఆర్‌జీయూకేటీ రిజిస్ట్రార్ సోమయ్య బాసరకు వచ్చారు. విద్యార్థుల డిమాండ్లపై వారితో చర్చించారు. ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ రాజేంద్రసాహూ, ఓఎస్‌డీ నారాయణ, డీఈ రాజేశ్వర్, సీఎస్‌వో వాజొద్దీన్, కార్యాలయ అధికారి బద్రిలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పది గంటలపాటు ఆందోళన చేసిన విద్యార్థులు రిజిస్ట్రార్ సోమయ్య నచ్చజెప్పడంతో శాంతించారు. గతంలో ఇటువంటి పరిణామాలు చోటుచేసుకున్నా సస్పెండ్ చేసి మళ్లీ కొనసాగించారని విద్యార్థులు పేర్కొన్నారు. సస్పెండ్ అయిన అధికారులు మళ్లీ కొనసాగితే ఇదే పరిస్థితి పునరావృతం అవుతుందని విద్యార్థులు హెచ్చరించారు.
సమస్యలతో సహవాసం
ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. నిద్రలేవగానే నీటి కష్టాలతో వారి అవస్థలు మొదలవుతాయి. స్నానాలు చేయకుండానే విద్యార్థులు తరగతి గదులకు వెళ్తున్నారు. ఆడ పిల్లలయితే నీటి కోసం వేకువజామునే నిద్రలేచి బారులు తీరాల్సిన పరిస్థితి. ఇక మెస్‌కు వెళ్తె అక్కడ సరైన భోజన సౌకర్యం ఉండదు. ఈ విషయం తెలిసిన ట్రిపుల్ ఐటీ అధికారులు స్పందించరు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు. అర్ధాకలితో విద్యార్థులు అలమటిస్తున్నారు. అంతా తామై వ్యవహరిస్తున్న ఇక్కడి అధికారుల తీరుపై ప్రజా ప్రతినిధులకు విద్యార్థులు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదు. రాత్రి సమయంలో విద్యార్థుల గదుల్లో కరెంటు సరఫరాలోనూ తీవ్ర అంతరాయం తప్పదు. చీకటి గదుల్లో చదవలేక ఆరు బయట మహారాష్ట్ర ప్రాంతంలోని ఆల్కాహాల్ ఫ్యాక్టరీ దుర్గంధం భరించలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక్కడి వాతావరణంతో విద్యార్థులు అనారోగ్యం భారిన పడుతున్నారు. సౌకర్యాలు లేకపోవడం అనారోగ్య సమస్యలతో బాధపడడంతో విద్యార్థులు చదువుపై దృష్టి సారించలేక పోతున్నారు. ఫలితంగా కళాశాలలో చదివే విద్యార్థులు మనస్తాపానికి గురై ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కళాశాలను ప్రారంభం నుంచి ఇప్పటివరకు నడిపిస్తున్న అధికారులను తప్పిస్తేనే శాశ్వత పరిష్కారం దొరుకుతుందంటూ విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దర్యాప్తు చేస్తున్నాం..
- నాగరాజు పింగళి, బాసర ఎస్సై
ఈ విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నాం. ఉద్యోగం రాకపోవడమా, అనారోగ్య కారణమా మరే ఇతర కారణాలు ఉన్నాయో అనే కోణంలోనూ పరిశీలిస్తాం. నాగరాజు ఆత్మహత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నాం.