డీజిల్ సరఫరాలో చిల్లరబాగోతం!
Published Tue, Feb 25 2014 2:16 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM
డీజిల్ ధర పెరుగుదల, బల్క్‌లో సరఫరా చేసేందుకు ఆయిల్ కంపెనీలు నిరాసక్తత చూపడం ఆర్టీసీ అధికారులకు ఓ అవకాశంగా మారింది. స్థానిక బంకులద్వారా డీజిల్ కొనుగోలు చేసుకోవాలని వారు సూచించడంతో అధికారులు ‘చిల్లర’ పనులకు తెరలేపారు. డీజిల్‌లో యథేచ్ఛగా కల్తీ చేస్తున్నారు. దీంతో ఇంజిన్లలో లోపాలు ఏర్పడి బస్సులు అకస్మాతుగా రోడ్లపై నిలిచిపోతున్నాయి. ప్రయాణికులు అవస్థలకు గురవుతున్నారు. ఇవేమీ పట్టించుకోని అధికారులు తమ జేబులు నింపుకొంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : గతంలో డిపో గ్యారేజీలో ఉన్న బంకుల ద్వారా ఆర్టీసీ బస్సులకు డీజిల్ పోసేవారు. కానీ ఆయిల్ కంపెనీలు తమకొచ్చే నష్టాల దృష్ట్యా బల్క్‌లో గ్యారేజీ బంకులకు డీజిల్ సరఫరా చేయలేమని, కావాలనుకుంటే ప్రత్యేక రేటుకిస్తామని కండిషన్ పెట్టాయి. అలాగైతే భరించలేమని ఆర్టీసీ యాజమాన్యం చెప్పేయడంతో స్థానికంగా ఉన్న బంకుల్లో చిల్లరగా కొనుగోలు చేసుకోవాలని ఆయిల్ కంపెనీలు సూచించాయి. దీంతో స్థానిక బంకుల నుంచి కొటేషన్ తీసుకుని, గిట్టుబాటు అయ్యే విధంగా ముందుకొచ్చే పెట్రోల్ బంకుల వద్ద చిల్లరగా కొనుగోలు చేసుకోవాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశించారు. అలాగని ఎక్కడబడితే అక్కడ కాకుండా డిపో పరిధిలోని త్రిసభ్య కమిటీ పరిశీలనలో గుర్తించిన మెరుగైన పెట్రోలు బంకులోనే కొనుగోలు చేయాలని, నిర్ధేశిత బంకు నుంచి ఒకసారి 2,500 లీటర్ల డీజిల్‌ను మాత్రమే తీసుకెళ్లాలని,
అప్పుడు కూడా కమిటీ సభ్యులైన మెకానికల్, అడ్మిన్, సెక్యూరిటీ విభాగ అధికారులు తనిఖీ చేసి గ్యారేజీ బంకుకు తరలించాలని స్పష్టంగా పేర్కొన్నారు. సింటెక్స్ తదితర డ్రమ్ముల్లో మాత్రమే ఆ డీజిల్ తరలించాలని, ఆయిల్ ట్యాంకుతో ఎట్టి పరిస్థితుల్లో సరఫరా చేయకూడదని ఆంక్షలు కూడా పెట్టారు. అనుకున్నట్టే జిల్లాలోని ఆర్టీసీ డిపోల అధికారులు తక్కువ మొత్తంలో కొటేషన్ ఇచ్చే పెట్రోలు బంకులతో ఒప్పందాలు చేసుకున్నారు. కానీ ఈ ఒప్పందాల ముసుగులో కొన్ని డిపోల్లో సంబంధిత పెట్రోలు బంకుల ద్వారా కాకుండా పక్క జిల్లాల నుంచి నేరుగా ట్యాంకర్ల ద్వారా ఆయిల్‌ను గ్యారేజీ డిపోలకు తీసుకొచ్చి, అక్కడున్న బంకులో అన్‌లోడ్(పంపింగ్) చేసేస్తున్నారు.
ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. కార్పొరేషన్ మార్గదర్శకాల ప్రకారం ఆయిల్ కంపెనీల నుంచి నేరుగా గ్యారేజీకి రవాణా చేయకూడదు. పెట్రోలు బంకు నుంచి మాత్రమే రవాణా చేయాలి. త్రిసభ్య కమిటీ తనిఖీల తర్వాతనే పెట్రోలు బంకు నుంచి గ్యారేజీకి డ్రమ్ముల ద్వారా సరఫరా చేయాలి. అది కూడా ఒక పర్యాయం 2,500లీటర్లకు మించకూడదు. కానీ జిల్లాలో అందుకు భిన్నంగా నేరుగా ట్యాంకర్ల ద్వారా ఒకేసారి 15 నుంచి 20వేల లీటర్ల డీజిల్‌ను తనిఖీలు చేయకుండానే రవాణా చేసేస్తున్నట్టు తెలుస్తోంది. నిబంధనలకు నీళ్లొదిలి నిర్భయంగా గ్యారేజీలోకి ప్రవేశించి బంకుల్లో పంపింగ్ చేసేస్తున్నట్టు సమాచారం.
ఈక్రమంలోనే డీజిల్‌లో కల్తీ జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా బస్సుల ఇంజిన్లు పాడైపోతున్నాయని విమర్శలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇటీవల విజయనగరం మయూరి జంక్షన్‌లో ఒక బస్సు, రాజాపులోవ జాతీయ రహదారిపై ఒక బస్సు అకారణంగా అకస్మాత్తుగా నిలిచిపోయాయి. గతంలో విజయనగరం డిపో గ్యారేజీలో ప్రవేశిస్తుండగా ఒక ఆయిల్ ట్యాంకర్‌ను అధికారులు పట్టుకున్నారు. అప్పట్లో ఇది పెద్ద వివాదమైంది. తాజాగా పార్వతీపురం డిపోలోకి అదే తరహాలో ఈనెల 18,20వ తేదీల్లో నేరుగా ఆయిల్ ట్యాంకర్ల ద్వారా డీజిల్ సరఫరా జరిగినట్టు తెలిసింది.
18వ తేదీన 20వ తేదీన ట్యాంకర్‌లతో ఆ డిపోకి డీజిల్ సరఫరా చేసినట్టు సమాచారం. ఈ భాగోతంపై నిఘా పెట్టిన పలువురు వీడియో కూడా తీశారు. వీరు ఆ వీడియో క్లిప్పింగ్‌లను పత్రికా కార్యాలయాలకు పంపించారు. ఇదే విషయమై ఇప్పటికే పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా దారుల జిల్లా సంఘం ప్రతినిధులు జి.నాగిరెడ్డి, నారాయణరెడ్డి తదితరులు బాహాటంగానే ఆరోపణలు చేశారు. ఫిర్యాదులు కూడా ఇచ్చారు. ఇదే తరహాలో ఎస్‌కోట, సాలూరు డిపోల్లో కూడా అప్పుడప్పుడు ట్యాంకర్ల ద్వారా రవాణా జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
Advertisement
Advertisement