అద్భుతం...సాహో లోకేష్‌ | Reaserch And Devolopment Employee Find New Fuel | Sakshi
Sakshi News home page

అద్భుతం...సాహో లోకేష్‌

Published Fri, Mar 1 2019 8:38 AM | Last Updated on Fri, Mar 1 2019 9:09 AM

Reaserch And Devolopment Employee Find New Fuel - Sakshi

ఆయనో చిరుద్యోగి. వెన్ను తట్టి ప్రోత్సహించే తల్లిదండ్రులు కానీ... గాడ్‌ ఫాదర్‌లు కానీ లేరు. కానీ స్వయంశక్తితో అద్భుతమైన ఇంధనాన్ని కనుగొన్నాడు. బొబ్బిలిలోని గ్రోత్‌ సెంటర్‌లో ఓ కంపెనీలో పని చేస్తున్న లోకేష్‌ జగిలింకి అన్ని వాహనాలకూ పనికి వచ్చే డీజిల్, పెట్రోల్‌ అన్న తేడా లేకుండా వినియోగించే ఇంధనాన్ని కనుగొని విజయం సాధించాడు. ప్రస్తుతం పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసే పనిలో ఉన్న అతనికి ప్రదర్శనకు పిలుపురావడమే తరువాయి.  

విజయనగరం, బొబ్బిలి: లోకేష్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ వింగ్‌లో వివిధ కంపెనీల్లో ఏదైనా ఆయా కంపెనీలకు పనికి వచ్చే రీసెర్చ్‌ చేసి ఉపాధి పొందుతున్నారు. ఇదే సమయంలో అతని ఆలోచనలకు పదును పెట్టారు. ఓ వైపు కంపెనీలో ఉద్యోగం చేస్తునే అన్ని వాహనాలకూ ఒకే పెట్రోల్‌ను కనిపెడితే ఎంత బావుంటుందో అని కొన్నేళ్ల క్రితం వచ్చిన ఆలోచనలకు మరింత ఊతమిస్తూ ప్రయత్నాలు ఒక్కొక్కటిగా చేయసాగాడు. తన కన్నా ముందు ఎంతో మంది బయో డీజిల్‌ అనీ, పొగరహిత పెట్రోల్‌ అనీ, స్పీడ్‌ పెట్రోల్‌ అనీ ఎన్నో ఇంధనాలను కనిపెట్టిన విషయాన్ని కూడా రికార్డులను సేకరించి చూశాడు. కానీ అతని ఆలోచన భిన్నమైందని తెలుసుకుని ఆయన ప్రయత్నాలు మరింత తీవ్రతరం చేశాడు.  ఎట్టకేలకు ఆయన ప్రయత్నం ఫలించింది. సహజ ఇంధనాన్ని కనిపెట్టి దానికో రూపు తీసుకువచ్చాడు. ఆయన కనిపెట్టిన పెట్రోల్‌ పొగ రహితమయినది. లీటరుకు బైక్‌ అయితే 120 కిలోమీటర్లు మైలేజీ ఇస్తున్నది. దీనిని ఒకటికి రెండుసార్లు పరిశీలించి ప్రదర్శన కోసం ఒకరిద్దరి ముందు పెట్టాడు. మరింత మందికి పెట్రోల్‌ ఇచ్చాడు. అద్భుతమైన మైలేజ్‌తో పాటు ఇంజన్‌ సౌండ్, పొగ రహితంగా ఉండటంతో అందరూ సెహభాష్‌ అంటున్నారు.

సింథటిక్‌ కెమెస్ట్రీతో...
జెనటిక్‌ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీలను ఔపోసన పట్టిన లోకేష్‌  స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలోని ఉర్లాం దగ్గరి  వీఎన్‌ పురం. ఉపాధిలో భాగంగా బొబ్బిలిలో స్థిరపడ్డాడు. ఆయనకున్న ఆలోచనల్లోని సింథటిక్‌ కెమెస్ట్రీతో ఈ సరికొత్త ఇంథనాన్ని కనుగొన్నాడు. అన్ని జీవరాశుల్లోనూ అంతర్భాగంగా ఉంటే  అణు నిర్మాణం ఆధారంగా ఈ సహజ ఇంధనాన్ని కనిపెట్టానని చెప్పాడు లోకేష్‌. అణు నిర్మాణంలోని కీలక దశలను అభివృద్ధి చేస్తూ ఆయిల్‌ను అంచెలంచెలుగా మిశ్రమాలంకరణతో విజయం సాధించాడు. ఇప్పుడు ఈ ఇంధనం లారీలు, కార్లు, భారీ వాహనాలు, బైక్‌లకూ వినియోగించవచ్చు. అయితే ఆయా ఇంజిన్లలో కొద్దిపాటి మార్పులు చేసి సహజ ఇంధనానికి అనుగుణంగా తీసుకురావాల్సి ఉంటుందన్నారు. మామూలు పెట్రోలు కన్నా దాదాపు సగం ధరకే లభించే అవకాశం ఉందని లోకేష్‌ చెబుతున్నారు.

అన్ని వాహనాలకూ...
లోకేష్‌ తయారు చేసిన ఇంధనం పారదర్శకంగా నీరులానే ఉంటుంది. ఎటువంటి జిడ్డు కూడా ఉండటం లేదు. ఈ ఆయిల్‌ లీటరు వేస్తే బైక్‌లు 120 కిలోమీటర్లు, కార్లు 30 కి.మీ. లారీ వంటి భారీ వాహనాలు 20 కిలోమీటర్ల మైలేజిని ఇస్తాయని తన పరీక్షల ద్వారా చెబుతున్నాడు. మెకానిక్‌ స్ట్రక్చర్‌కు అనుగుణంగా ఈ పెట్రోల్‌ పని చేస్తుంది.

ఎన్నో ప్రయోజనాలు..
ఈ పెట్రోల్‌ వాడకం ద్వారా మంచి మైలేజ్, పొగరహితం, ప్రమాదరహితం, ఇంజిన్లకు ఎక్కువ  జీవితకాలం, మరమ్మతులు తక్కువ, వంటి ప్రయోజనాలున్నాయని చెబుతున్నాడు. పేటెంట్‌ త్వరలో వచ్చాక నామకరణం, ధర చెబుతా..దీనికి సంబంధించి పేటెంట్‌ కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఈ పెట్రోల్‌ మిశ్రమాన్ని చెప్పేందుకు వీలు పడదు.  పేటెంట్‌ ప్రజంటేషన్‌ అయిన తరువాత అప్పుడు చెప్పే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం భూమిలో దొరికే సహజ వాయువులు కొన్నాళ్లకు అంతరించి పోయే అవకాశం ఉంది. అప్పుడు ఈ సహజ ఇంధనం ఎంతో అవసరముంటుంది. దీనికి పెద్ద ఖర్చు ఉండదు. లాభసాటిగా ఉంటుంది. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేస్తా. అందరి దీవెనలూ కావాలి!             – లోకేష్‌ జిగిలింకి, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఉద్యోగి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement