జెడ్పీలో డిప్యుటేషన్లు రద్దు !
విజయనగరంఫోర్ట్ : జిల్లా పరిషత్‌లో డిప్యుటేషన్లు రద్దుకానున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా డిప్యుటేషన్లపై ఉద్యోగులను నియమించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేసిన అధికారులను దూరంగా పెట్టాలని కొత్త జెడ్పీ చైర్‌పర్సన్ శోభ స్వాతిరాణి కొంతకాలంగా భావిస్తున్నారు. ఆ మేరకు జిల్లా పరిషత్, పంచాయతీరాజ్ శాఖల్లో డిప్యుటేషన్‌పై ప్రస్తుతం పని చేస్తున్న వారిని వెనక్కి పంపించనున్నారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి డిప్యుటేషన్‌పై జిల్లాకేంద్రంలో నియమితులై తిష్ఠ వేసిన వారు వారి మండలాలకు వెళ్లనున్నారు. ఒక్క జిల్లా పరిషత్‌లోనే 50 మంది ఉద్యోగులు డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. పంచాయతీ రాజ్‌లో 30 మంది వరకు పని చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో డిప్యూటేషన్లు రద్దుకు సంబంధించి ఉత్తర్వులు వెలువడనున్నట్టు సమాచారం.
సర్వత్రా చర్చ
జిల్లా పరిషత్, పంచాయతీరాజ్ శాఖల్లో డిప్యుటేషన్లు రద్దు చేస్తున్నారన్న అంశంపై జిల్లా పరిషత్‌లో పలువురు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. తమ డిప్యుటేషన్లు రద్దు చేయవద్దని, మీకు అనుకూలంగా పని చేస్తామని కొంతమంది అధికారులు ప్రాథేయపడుతున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని డిప్యుటీ సీఈఓ శ్రీధర్‌రాజా వద్ద ప్రస్తావించగా డిప్యుటేషన్ల రద్దుకు సంబంధించి ఉద్యోగుల వివరాలు సిద్ధం చేయాలని జెడ్పీ చైర్‌పర్సన్ ఆదేశించారని తెలిపారు.