
రాజధానిపై చర్చ చేపట్టాల్సిందే: వైఎస్సార్‌సీపీ
దద్దరిల్లిన ఏపీ శాసనసభ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని వ్యవహారంపై బుధవారం అసెంబ్లీ దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల పరస్పర ఆరోపణ లు, వాగ్వాదాల మధ్య సభ గురువారానికి వా యిదాపడింది. రాజధానిపై సభలో చర్చించకుం డా ప్రకటన ఎలా చేస్తారని ప్రతిపక్షం నిలదీయ గా.. ప్రకటన చేసిన తర్వాత చర్చించవచ్చంటూ అధికారపక్షం ఎదురుదాడికి దిగింది. ఈ రెండిం టిలో ఏ పద్ధతినైనా అనుసరించవచ్చని స్పీకర్ చెప్పారు. వైఎస్సార్‌సీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి శివరామకృష్ణన్ నివేదికపై తక్షణమే చర్చించాలని డిమాండ్ చేశారు. సభా సంప్రదాయాలు తెలియకుండా విపక్షం సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని అధికారపక్షం ధ్వజమెత్తింది. ఈ దశలో సభ ఉదయం 10.57 గంటలకు తొలిసారి వాయిదాపడింది. 11.55 గంటల ప్రాంతంలో సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ రాజధానిపై రభస కొనసాగడంతో స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేశారు.
రాజధానిపై చర్చకు పట్టు
బుధవారం ప్రశ్నోత్తరాల సమయం ముగిశాక సీఎం తరఫున మంత్రులు అచ్చెన్నాయుడు, సిద్ధా రాఘవరావులు పబ్లిక్ అకౌంట్స్, అంచనాల, ప్రభుత్వ రంగ సంస్థల, దక్షిణ మధ్య రైల్వే జెడ్‌ఆర్‌యూసీసీలకు సభ్యుల ఎంపికకు ప్రతిపాదనలు చేశారు. అనంతరం బడ్జెట్‌పై చర్చకు స్పీకర్ ఉపక్రమిస్తుండగా.. రాజధాని విషయమై చర్చించాలని వైసీపీ సభ్యులు కోరారు. దీనికి స్పీకర్ వైపు నుంచి సానుకూలత వ్యక్తం కాకపోవడంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. రాష్ట్ర రాజధానిపై తామిచ్చిన 344 తీర్మానాన్ని ప్రస్తావించారు. ‘‘అధ్యక్షా! నిన్న మేము రాజధానిపై 344 తీర్మానం ఇ చ్చాం. రాజధానిపై చంద్రబాబు ఏవేవో ప్రకటనలు చేస్తారని వివిధ పేపర్లలో చదివాం. అష్టమీ, నవమీ అంటున్నారు.. దశమికి ప్రకటన చేస్తారంటున్నారు. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై చర్చించకుండా ప్రకటన చేస్తానని బాబు నోటి నుంచే వింటున్నాం. చర్చ జరుపుతారా? జరపరా? అసలింతకీ ఆ కమిటీ నివేదిక ఇస్తారా? ఇవ్వరా? మాకేమీ అర్థం కాకుండా ఉంది. వారంతట వారే ప్రకటన చేసేస్తానంటే ఈ సభ ఎందుకు? మేమిచ్చిన 344 తీర్మానంపై ఎప్పుడు చర్చ పెడతారో స్పష్టంగా చెప్పమనండి’’ అని అన్నారు. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిస్తూ.. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను రేపు (గురువా రం) సభలో ప్రవేశపెడతామన్నారు. ఈ దశలో జగన్‌మోహన్‌రెడ్డికి, స్పీకర్‌కు మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది..
జగన్: దశమికి ప్రకటన చేస్తామని కూడా చెబుతున్నారు. చర్చకు ఎంత సమయం ఇస్తారో చెప్పి ముహూర్తం పెట్టండి. చర్చ జరగకుండానే మీరు ప్రకటనలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎప్పుడు చర్చ పెడతారు? ఎన్ని రోజులు కేటాయిస్తారో చెప్పమనండి.
స్పీకర్: సభలో ప్రకటన చేస్తారనేది ప్రతిపాదనే. సమయం ఎంత కావాలన్నా కేటాయిస్తారు.
జగన్: చంద్రబాబునాయుడు ప్రకటన చేసిన తర్వాత చర్చకు అర్థమేముంది అధ్యక్షా..! చర్చ జరగకుండానే ప్రకటనేమిటి?
స్పీకర్: సభలోని ఎజెండాపై మాట్లాడాలే తప్ప దాన్ని ఖరారు చేయవద్దు... నిర్దేశించేందుకు ప్రయత్నించవద్దు. ఊహాగానాలు చేయవద్దు.
అధికార పక్షం ఎదురుదాడి..
మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకొని.. ప్రతిపక్ష నేత సభా నియమాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. సభా సమయాన్ని వృథా చేయొద్దని ఎదురుదాడికి దిగారు. చంద్రబాబు ప్రకటన చేస్తారని, ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీ సలహాలు ఇవ్వొచ్చని చెప్పారు. సభా గౌరవాన్ని పెంచేలా వ్యవహరించాలే తప్ప తగ్గించవద్దని అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. సభ మధ్యలోకి దూసుకెళ్లి నిరసన తెలుపుతూ రాజధానిపై చర్చకు పట్టుబట్టారు. సభా సంప్రదాయాలు తెలియనిదెవరికో చెప్పాలని నిలదీశారు.
రెండు పద్ధతులూ అనుసరణీయమే..
దీంతో స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. ‘‘చర్చ తర్వాత ప్రకటన చేయవచ్చు. ప్రకటన తర్వాతా చర్చ చేపట్టవచ్చు. ఈ రెండు పద్ధతులూ అనుసరణీయం, ఆమోదయోగ్యనీయమే. మీరు (విప క్షం) మీ సలహాలు చెప్పవచ్చు. సభను అడ్డుకోవద్దు. సజావుగా సాగనీయండి’ అని చెప్పారు. సభను స్తంభింపజేయడం వల్ల విపక్షమే సమయాన్ని కోల్పోతుందని అన్నారు. దీనికి విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేస్తూ.. రాజధానిపై ప్రకటనకు ముందే సభలో చర్చ జరగాలని అన్నారు. తమ నాయకునికి మాట్లాడే అవకాశమివ్వాలని కోరారు. దీనికి స్పీకర్ అనుమతిస్తూ జగన్‌ను మాట్లాడాల్సిందిగా కోరారు.
ఆవేళ కూడా చర్చ, ఓటింగ్ తర్వాతే నిర్ణయం: జగన్
‘‘1953 జూలై 1న ఈ పరిస్థితుల మధ్యనే రాజధానిపై చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులే ఈ వ్యవహారమై (రాజధానిపై) నిర్ణయించుకుని భారత ప్రభుత్వానికి తెలియజేయాలని నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటించారు. దానికనుగుణంగా ఐదు రోజులపాటు వివిధ పార్టీలు సభలో సుదీర్ఘ చర్చ జరిపాయి. చివరకు ఓటింగ్ కూడా తీసుకున్నారు. ఆ తర్వాతనే రాజధానిపై నిర్ణయం తీసుకున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. అప్పట్లో కూడా చర్చ, ఓటింగ్ జరిగాయి. ఇది గతం. ఇప్పుడు కూడా చర్చ తర్వాతనే ప్రకటన రావాలి. ఆ తర్వాత ఓటింగ్, ఆపైన తీర్మానం జరగాలి’’ అని జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. చర్చ, ఓటింగ్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అసెంబ్లీ ఎందుకు అని జగన్ ప్రశ్నించారు.
ఏ ప్రకటన చేస్తామో తెలుసుకోరా?
దీనిపై మంత్రులు అచ్చెన్నాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎదురుదాడికి దిగారు. చర్చ కావాలనుకుంటే ప్రభుత్వం సిద్ధమేనన్నారు. విపక్షం వాదన అనుభవరాహిత్యానికి నిదర్శనమని, చంద్రబాబు ఏమి ప్రకటన చేస్తారో తెలుసుకోకుండానే రాద్ధాంతం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. దీనికి వైఎస్సా ర్‌సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. తాము అడిగేదానికి సమాధానం చెప్పలేక అధికారపక్షం ఎదురుదాడికి దిగడం విచారకరమన్నారు. ప్రకటన చేసిన తర్వాత చర్చ ఏముంటుందని ప్రశ్నించారు. చర్చ కోసం పట్టుబడుతూ నినాదాలు చేశారు. దానికి ప్రతిగా అధికారపక్ష సభ్యులు కూడా కేకలు వేయడంతో సభలో ఏమి జరుగుతోందో అర్థం కాకుండా పోయింది. దీంతో స్పీకర్ సభను 10.57 గంటల సమయంలో పది నిమిషాలు వాయిదా వేశారు. ఆతర్వాత సభ తిరిగి 11.55 గంటలకు ప్రారంభమైంది. అప్పుడూ ఇదే పరిస్థితి కొనసాగింది. గొడవ సద్దుమణగకపోవడంతో 13 నిమిషాల తర్వాత స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేశారు.