తల్లిబిడ్డల హత్యకేసులో వీడిన మిస్టరీ నిందితుడి అరెస్టు
రేపల్లె: నియోజకవర్గ పరిధిలోని నగరం మండలం చిలకాలవారిపాలెం గ్రామంలో సెప్టెంబర్ 25తేదీన జరిగిన తల్లిబిడ్డల హత్యకేసులో మిస్టరీ వీడింది. హత్య చేసింది కట్టుకున్న వాడేనని పోలీసులు నిర్ధారించారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో రూరల్ సీఐ పెంచలరెడ్డి శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నగరం మండలం చిలకాలవారిపాలెం గ్రామంలో ఉప్పాల శివరామకృష్ణ అలియాస్ వెంకట కృష్ణ భార్య తిరుపతమ్మ కాపురం ఉంటున్నారు. గత కొంత కాలంగా తిరుపతమ్మ వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానం పెనుభూతంగా మారింది. శివరామకృష్ణ ప్రతి రోజు తెనాలిలో తాపీపని చేసి తిరిగి ఇంటికి వస్తుంటాడు. అదేవిధంగా సెప్టెంబర్ 25వతేదీ రాత్రి ఇంటికి వచ్చిన శివరామకృష్ణకు ఆయన భార్య తిరుపతమ్మకు మధ్య వివాహేతర సంబంధంపై వివాదం తలెత్తింది.
ఈక్రమంలో భార్య తిరుపతమ్మపై కత్తితో దాడిచేయగా అడ్డం వచ్చిన కుమార్తె నాగశ్రీ, కుమారుడు యశ్వంత్‌లకు తీవ్రగాయాలై అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందారు. గమనించిన శివరామకృష్ణ కుమార్తె మృతదేహాన్ని ఇంటి వెనుక ఉన్న తాడిదిబ్బలో పాతిపెట్టి కుమారుని శవాన్ని పక్కనే ఉన్న కాల్వలో పడవేసి పరాయ్యాడు. కేసును అన్ని కోణాలలో విచారించటం జరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో శివరామకృష్ణ శుక్రవారం ఉదయం ఏలేటిపాలెం వీఆర్వో కర్రా రవి వద్ద లొంగిపోయి విషయాన్ని చెప్పి తమ వద్ద లొంగిపోయినట్లు చెప్పారు. హత్యకు ఉపయోగించిన కత్తిని గ్రామస్థుల సమక్షంలో కాల్వలో నుంచి తమకు స్వాధీనం చేసినట్లు చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు చెప్పారు.
కట్టుకున్నవాడే కడతేర్చాడు..
Published Sat, Nov 7 2015 1:42 AM | Last Updated on Sun, Sep 3 2017 12:08 PM
Advertisement
Advertisement