=నేరగాళ్ల అడ్డాగా జిల్లా సరిహద్దులు
=పుత్తూరులో తీవ్రవాదుల ఉనికి వెల్లడి
=వరదయ్యపాళెంలో దొంగనోట్లు స్వాధీనం
=చిత్తూరు, గుడిపాల, పలమనేరు మార్గాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్
=యాదమరి, కుప్పం మార్గాల్లో
=బియ్యం అక్రమ రవాణా
=ఎర్రావారిపాళెం, కుప్పంలో గంజాయి సాగు
=తమిళనాడు, కర్ణాటక నుంచి నేరగాళ్ల రాక
అంతర్రాష్ట్ర సరిహద్దులున్న చిత్తూరు జిల్లా నేరగాళ్లకు అడ్డాగా మారుతోంది. తీవ్రవాదుల ఉనికి నుంచి దొంగనోట్ల చెలామణి వరకు, ఎర్రచందనం స్మగ్లింగ్ నుంచి రేషన్ బియ్యం అక్రమరవాణా వరకు జిల్లా సరిహద్దులు నెలవుగా ఉంటున్నాయి. జిల్లాలోని సత్యవేడు, వరదయ్యపాళెం, కుప్పం, బి.కొత్తకోట, రామసముద్రం, వి.కోట, రామకుప్పం, పుత్తూరు, నగరి, గుడిపాల, ఎస్‌ఆర్.పురం, పాలసముద్రం మండలాలు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు 30-40 కి.మీ.దూరంలో ఉన్నాయి. దీంతో ఆ రాష్ట్రాల నేరగాళ్లు ఈ ప్రాంతాల్లో చేరి తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇటీవల వరుసగా వెలుగుచూసిన నేర సంఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సంచలన నేరాలకు అడ్డాగా మారుతున్న సరిహద్దు ప్రాంతాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం...
తమిళనాడు, కర్ణాటక నుంచి నేరగాళ్ల రాక
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడినవారు అక్కడి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి చిత్తూరు జిల్లాను కేంద్రంగా చేసుకుంటున్నారు. తిరుపతి అర్బన్ పోలీసులు రెండు నెలల కిత్రం అరెస్టు చేసిన గజదొంగ ఏలుమలై తమిళనాడు కాంచీపురానికి చెందినవాడు. ఇతని నుంచి అప్పట్లో రూ.70 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అర్బన్, చిత్తూరు జిల్లాల పోలీసులకు ఇటీవల ప్రతి రోజూ 20 నుంచి వంద మంది వరకు పట్టుబడుతున్న ఎర్రచందనం నరికే కూలీలందరూ తమిళనాడు రాష్ట్రానికి చెందిన తిరువణ్ణామలై, వేలూరు, సేలం ప్రాంతాలకు చెందినవారే.
అలాగే కర్ణాటకలో ఒక హత్యకేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి తుపాకీతో తిరుమలకు వెళ్తుండగా ఆరునెలల క్రితం అలిపిరి టోల్‌గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకు చెందిన ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను ఇటీవల టాస్క్‌ఫోర్స్ పోలీసులు జిల్లా సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అజ్ఞాతంగా ఇలాంటి వారు మరెందరో ఉన్నట్టు సమాచారం.
ఎర్రచందనం స్మగ్లింగ్
శేషాచల కొండల్లోని వేల కోట్ల రూపాయల ఎర్రచందనం జిల్లా నుంచి అక్రమంగా దేశ,విదేశాలకు తరలిపోతోంది. ముఖ్యంగా గుడిపాల, యాదమరి, వి.కోట, రామసముద్రం, గంగవరం, వరదయ్యపాళెం, సత్యవేడు మార్గాల్లో, ఇటు మదనపల్లి నుంచి చిక్‌బల్లాపూర్ మీదుగా కర్ణాటక, తమిళనాడుకు తరలుతోంది. పోలీసులు, అటవీశాఖ ఎన్నిసార్లు దాడులు చేసి స్మగ్లర్లను, చెట్లు నరికే కూలీలను అరెస్టు చేసినా అక్రమరవాణా ఆగడం లేదు. తమిళనాడు నుంచి చెట్లు నరికే కూలీలు, కర్ణాటక నుంచి స్మగ్లర్లు జిల్లాలోకి ప్రవేశించి యథేచ్ఛగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇప్పటి వరకు గత ఐదేళ్లుగా స్మగ్లర్లు తరలించిన ఎర్రచందనం విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అనధికారిక అంచనా.
వరదయ్యపాళెంలో దొంగనోట్లు
తాజాగా రెండు రోజుల కిత్రం వరదయ్యపాళెంలో పోలీసులు రూ.20 వేల వరకు దొంగనోట్లను స్వాధీనం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారికి ఇవి ఎలా చేరాయి, ఈ దొంగనోట్లు తమిళనాడు నుంచి ఇక్కడికి తీసుకొ చ్చి ఎవరైనా చెలామణి చేశారా ?అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రవాదుల ఉనికి వెల్లడైన రెండువారాల్లోపే వరదయ్యపాళెంలో దొంగనోట్లు వెలుగుచూడడం సరిహద్దు ప్రాంతాల్లో నేరాల తీవ్రతకు అద్దం పడుతోంది.
తీవ్రవాదుల కలకలం
పాతగుడ్డలు, చింతపండు వ్యాపారాల పేరిట అల్‌ఉమా తీవ్రవాదులు ఆరునెలలకు పైగా పుత్తూరులో నివాసం ఉంటూ సంచలనం సృష్టిం చారు. తమిళనాడు పోలీసుల సమాచారంతో మన పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి తీవ్రవాదులు బిలాల్, ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన జరిగిన పుత్తూరుకు తమిళనాడు సరిహద్దు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాగా గతంలో బెంగళూరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్‌లో సైంటిస్టులను కాల్చి చంపిన ఐఎంఏ తీవ్రవాదులు ఇద్దరిని పుంగనూరు నుంచి కర్ణాటక పోలీసులు పట్టుకెళ్లారు. పుంగనూరు కూడా కర్ణాటక సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.
పొలాల్లో గంజాయి సాగు
ఎర్రావారిపాళెం మండలంలోని అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గజరాతి దిన్నె, శెట్టిపల్లి గ్రామాల్లో కొందరు రైతులు గంజాయి సాగు చేస్తూ ఇటీవల పట్టుబడడం సంచలనం రేపింది. ఇక్కడ సాగు చేసిన గంజాయిని కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నారు. అలాగే కుప్పం ప్రాంతంలోనూ మూడు నెలల క్రితం గంజాయి సాగును కనుగొని ధ్వంసం చేశారు. జిల్లా నుంచి తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల మీదుగా గంజాయి, నాటు సారా అక్రమరవాణా యథేచ్ఛగా సాగుతోంది.
పక్క రాష్ట్రాలకు రేషన్ బియ్యం
జిల్లాలో కిలో రూపాయికి ఇచ్చే రేషన్ బియ్యం కొన్ని చోట్ల డీల ర్ల చేతివాటం, మరి కొన్ని చోట్ల సివిల్ సప్లయిస్ సిబ్బంది సహకారంతో పొరుగు రాష్ట్రాలకు తరలుతోంది. అక్రమార్కులు ఈ బియ్యాన్ని సరిహద్దులు దాటించి వాటికి పాలిష్ వేసి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అధిక ధరకు అమ్ముకుంటున్నారు. వి.కోట, కుప్పం, రామకుప్పం, సత్యవేడు, వరదయ్యపాళెం, నగరి, గుడిపాల, చిత్తూరు, యాదమరి ప్రాంతాల నుంచి లోడ్లకు లోడ్లు రాత్రి సమయాల్లో రేషన్ బియ్యాన్ని తరలించేస్తున్నారు. శ్రీకాళహస్తి సమీపంలోనూ అక్రమగా తరలుతున్న ఒక లారీ రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గతంలో సీజ్‌చేశారు. అప్పుడప్పుడూ అధికారులు దాడులు చేస్తున్నా రేషన్ బియ్యం అక్రమంగా తరలడం మాత్రం ఆగడం లేదు.