రూటు మార్చిన ఎర్రచందనం స్మగ్లర్లు
Published Sat, Aug 10 2013 2:51 AM | Last Updated on Mon, Oct 22 2018 1:59 PM
సాక్షి, తిరుపతి : సమైక్యాంధ్ర ఉద్యమంతో ఎర్రచందనం స్మగ్లర్ల రూటు మారింది. పోలీసుల భయం కన్నా వరుస ఆందోళనలతో హైవేలు, గ్రామీణ రహదారుల్లో అవాంతరాలు ఏర్పడుతుండటంతో రైళ్లలో ఎర్రచందనం దుంగలు తరలించడం మేలు అన్న నిర్ణయానికి ఎర్ర దొంగలు వచ్చా రు. చామల రేంజ్‌లో నరికే దుంగలను పనపాకం, చంద్రగిరి వంటి స్టేషన్లకు రాత్రి సమయాల్లో, తెల్లవారు జామున తెచ్చి పట్టాల పక్కన ఉంచి ప్యాసింజరు రైళ్లు అగిన వెంటనే అందులో ఎక్కించి తీసుకెళ్తున్నట్లు సమాచారం. సాధారణంగా చిత్తూరు హైవే లేదా నాయుడుపేట రహదారిలో గాజులమండ్యం మీదుగా, శ్రీకాళహస్తి మీదుగా తడ మార్గం లోనూ చెన్నయ్‌కు ఎర్రచందనం దుంగలు తరలించేవారు.
ఈ మార్గాల్లో రాత్రి సమయాల్లో వాహనాల తనిఖీలను అర్బన్ పోలీసులు ముమ్మరం చేశారు. దీనికితోడు పగటి పూట రహస్యంగా, పోలీసులు కనుక్కోలేని విధంగా వాహనాల్లో ఎర్రచందనం దుంగలు తరలించేందుకు ప్రయత్నించిన హైవేల్లో సమైక్యాంధ్ర ఉద్యమ కారులు వంటవార్పులు, రాస్తారోకోలు, మానవహారాలకు దిగుతుండటంతో ట్రాఫిక్ జామ్‌తో వాహనాలు రోడ్లపైనే అగిపోతున్నాయి. ఈనేపథ్యంలో రోడ్డు మార్గంలో కన్నా రైలు మార్గమే సురక్షితం అనే వ్యూహంతో స్మగ్లర్లు రూటు మార్చినట్టు తెలుస్తోంది.
రైల్వే పోలీసుల దృష్టి ఉండదు
తిరుపతి నుంచి కాట్పాడి వైపు వెళ్లే ప్యాసింజర్ రైళ్లలో పెద్దగా పోలీసు నిఘా ఉండదు. ఈ రైళ్లలో టీసీలు గానీ, జనరల్ ైరె ల్వే పోలీసు లేదా రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ కూడా పెద్దగా పట్టించుకోదు. దీంతో ఇందులో ప్రయాణి ంచే వారి గురించి, రవాణా చేసే వస్తువుల గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ప్యాసింజర్ రైళ్లు క్రాసింగ్ కోసం లేదా స్టాపింగ్ రీత్యా పనపాకం, చంద్రగిరి రైల్వేస్టేషన్ల వద్ద కచ్చితంగా నిలుపుతారు. ఈ సమయాన్ని ఎర్రచందనం అక్రమ రవాణాదారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. చంద్రగిరి, పనపాకం రైల్వేస్టేషన్లు అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉంటాయి. సమీప అడవుల్లో నుంచి ఎర్రచందనం దుంగలు నరికి కాలిదారిన కూడా తీసుకు రావచ్చు. జనం దృష్టి పడకుండా, నిర్మానుష్యంగా ఉంటాయి. దీన్ని స్మగ్లర్లు తమకు అనుకూలంగా మార్చుకుని ఎర్రచందనం పక్కరాష్ట్రాలకు తరలిస్తున్నారు.
పనపాకం వద్ద పట్టుబడ్డ ఎర్ర కూలీలు
ఇటీవల పనపాకం సమీపంలో అటవీ ప్రాంతంలో ఎర్రచందనం నరికేందుకు వచ్చిన 15 మందికి పైగా కూలీలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకుని విచారించి, రిమాండ్‌కు పంపించారు. ఈ ప్రాంతంలో ఎర్రచందనం కూలీల కదలికలు ఉన్నాయంటే ఎర్రచందనం స్మగ్లింగ్ రైళ్ల ద్వారా సాగేందుకు అవకాశం ఉందని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. ఈ తరహా ఎర్రచందనం స్మగ్లింగ్ పై అటు టాస్క్‌ఫోర్స్, ఇటు అటవీశాఖ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సి ఉంది.
Advertisement