
జిల్లా కాంగ్రెస్‌లో ఎవరిదారి వారిదే
- జిల్లా కాంగ్రెస్‌లో ఎవరిదారి వారిదే
- మాజీ సీఎంకు ముఖం చాటేసిన
- గల్లా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- పదవులకు రాజీనామా చేయండి
- సీఎం సోదరుడి ఒత్తిడి
- నేడు పదవులకు అమాస, వెంకటరమణ రాజీనామా ?
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి పదవికి, కాం గ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లాలో ఒంటరిగా మిగిలారు. సీఎం రాజీనామాతో జిల్లాలోని కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు తమ దారి చూసుకుంటున్నారు. జిల్లాలో అతికొద్ది మంది మాత్రమే కిరణ్ బాటలో నడిచే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి హోదాలో సమైక్య చాంపియన్ అనిపించుకోవాలని ఉబలాటపడ్డ కిరణ్‌కుమార్‌రెడ్డి చివరికి జీరోగా మారారు.
కిరణ్ మంత్రివర్గంలో గనుల శాఖ మంత్రిగా ఉన్న గల్లా అరుణకుమారి ముందుగానే రాజీనామా చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో భవిష్యత్‌లో తన మార్గం వేరే అని ఆమె చెప్పకనే చెప్పినట్లయింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గుమ్మడి కుతూహలమ్మ, షాజహాన్‌బాషా, డాక్టర్ రవి పరిస్థితి కూడా ఇంతే. నిజానికి సీఎం అయ్యేనాటికి కిరణ్‌కు జిల్లా ఎమ్మెల్యేలతో అంతగా సఖ్యత లేదు.
అప్పట్లో అరుణకుమారి తప్పితే మిగిలిన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ నేపథ్యంలో సీఎం సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి రంగంలోకి దిగి షాజహాన్, కుతూహలమ్మ, రవిని బుజ్జిగించి తమవైపు తిప్పుకున్నారు.