సాక్షి, కరీంనగర్ : జిల్లా కాంగ్రెస్ సారథి త్వరలోనే మారనున్నారు. జోడు పదవులు ఉన్నవారిని, రానున్న ఎన్నికల్లో టికెట్ల రేసులో ఉన్నవారిని పార్టీ బాధ్యతల నుంచి తప్పించాలని, వారి స్థానంలో ఎన్నికల్లో సమర్థంగా పనిచేసే వారికి పగ్గాలను అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఈ మేరకు పీసీసీ ఇంతకుముందే మార్పుచేర్పుల ప్రక్రియ మొదలుపెట్టింది. రాష్టంలోని పలు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను మార్చేందకు ఆయా జిల్లాల ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపింది.
రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో, తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో డీసీసీల మార్పు జరుగనుంది. ఇందులో భాగంగానే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావును మార్చనున్నారు. నెలరోజుల క్రితమే పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జిల్లా కాంగ్రెస్ పెద్దలకు ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని కోరారు. అప్పటినుంచి డీసీసీ చైర్మన్ మార్పుపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా మంత్రి శ్రీధరబాబు శనివారం గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు బొత్సను కలిశారు.
కొండూరి రవీందర్‌రావు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నందున ఆయన మార్పు అనివార్యమని బొత్స మంత్రికి వివరించారు. డీసీసీ చైర్మన్‌గా ఎవరిని నియమించాలనే అంశంపై వారు చర్చించారు. జిల్లా నేతలను సంప్రదించిన తర్వాత కొత్త నేత పేరును సూచిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు బొత్స సత్యనారాయణకు వివరించారని సమాచారం. సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో జిల్లాలో పార్టీని కాపాడగలిగే సామర్థ్యం ఉన్నవారికి పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది.
డీసీసీ పీఠాన్ని ఆశిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, పీసీసీ అధికార ప్రతినిధి కటుకం మృత్యుంజయం ప్రస్తుతం డీసీసీ రేసులో ఉన్నారు. వీరు మంత్రి శ్రీధర్‌బాబుకు సన్నిహితంగా ఉంటున్నారు. సీనియర్లయిన వీరికి జిల్లాలో పార్టీకి సంబంధించిన అందరితో మంచి సంబంధాలున్నాయి. యువతరానికి అవకాశం కల్పించాలని భావిస్తే బొమ్మ శ్రీరాంచక్రవర్తి పేరు పరిశీలనకు రావచ్చనని పార్టీ వర్గాలంటున్నాయి. జిల్లాకు చెందిన ముఖ్యనేతలు ఏకాభిప్రాయం ద్వారా ఒక పేరును పీసీసీకి ప్రతిపాదించే అవకాశముంది. వారం పది రోజుల్లో డీసీసీ చైర్మన్ మార్పు జరుగనుంది.
డీసీసీ పగ్గాలెవరికో!
Published Sun, Dec 1 2013 4:00 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement