
కొందామా.. ఆగుదామా!
నరసాపురం అర్బన్, న్యూస్‌లైన్: జిల్లా మార్కెట్‌లో బంగారం కొనుగోళ్లు భారీగా పడిపోయూయి. పుత్తడి కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో అంతర్జాతీయ పరిస్థితులు, షేర్ మార్కెట్ గమనాలు విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దీంతో అమ్మకం, కొనుగోలుదారుల్లో అయోమయం నెలకొంది. ఎన్నడూ లేనివిధంగా ధరలు భారీగా పతనం కావడమే దీనికి కారణమైంది. రానున్న రోజుల్లో పసిడి ధరలు మరింత తగ్గుతాయని అంతర్జాతీయ బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, గత అనుభవాలను బట్టిచూస్తే బంగారం ధరలు తగ్గినా.. తిరిగి పుంజుకున్న పరిస్థితులే అధికంగా ఉన్నాయి. ఈసారి మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుందని మా ర్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో కొత్తగా బంగారం కొనాలనుకునే వారు రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గుతాయన్న ఉద్దేశంతో జ్యూయలరీ షాపుల మెట్లెక్కడం లేదు. జిల్లాలో పుత్తడికి ప్రధాన మార్కెట్ అరుున నరసాపురంలో అమ్మకాలు, కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో సాగటం లేదు. ప్రస్తుత పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కావటంతో సాధారణ రోజుల్లో సాగే అమ్మకాలతో పోలిస్తే నాలుగైదు రెట్లు అధికంగా ఉండాలి. కానీ.. 20 శాతం మాత్రమే అమ్మకాలు పెరిగాయని బులియన్ వ్యాపారి అజిత్‌కుమార్‌జైన్ ‘న్యూస్‌లైన్’కు చెప్పారు.
మూడేళ్ల కనిష్టానికి...
ప్రస్తుతం బంగారం ధరలు మూడేళ్ల కనిష్టానికి చేరుకున్నాయి. బుధవారం నరసాపురం బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.27,900 పలికింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాములు రూ.25,950కు ట్రేడ్ అయింది. వారం రోజులుగా ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. ఇటీవల కాలంలో ధరలు ఇంతగా క్షీణించడం ఇదే ప్రథమం. 2012 చివరిలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32 వేలకు పైగా చేరుకుని రికార్డు సృష్టించింది. అప్పట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.35 వేల మార్కును చేరుకుంటుందని అంచనా వేశారు. అయితే ధరలు తగ్గుతూ వచ్చాయి. ఏడాది కాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల అనూహ్యంగా ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడం, దేశీయంగా దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం వంటి పరిస్థితులే ధరల తగ్గుదలకు కారణంగా చెబుతున్నారు. మోడీ ప్రభుత్వం బంగారం దిగుమతులపై ఆంక్షలు సడలించే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో రానున్న రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.25 వేల దిగువకు వస్తుందని అంచనా కడుతున్నారు.
భారీగా నష్టాలు
మూడేళ్ల నుంచి బంగారంపై మదుపుచేసే వ్యక్తులు ధరల తగ్గడంతో భారీగా నష్టపోయామని ఆందోళన చెందుతున్నారు. షేర్ మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతుండటంతో బంగారంపై పెట్టుబడిని సురక్షితమైన మార్గంగా మదుపరులు భావించారు. పుత్తడిపై పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. మరోవైపు సామాన్య, మధ్యతరగతి ప్రజలు సైతం అవసరానికి ఆదుకుం టుందనే ఉద్దేశంతో అప్పులు చేసి మరీ బంగారాన్ని కొనుగోలు చేశారు. ఇప్పుడు వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఇటీవల కొన్ని రోజుల వ్యవధిలోనే కాసు బంగారం (8గ్రాములు) ధర రూ.2,500 వరకు తగ్గింది. దీంతో వారు భారీగా నష్టపోయినట్లైంది. ఇదిలావుంటే బంగారంపై అప్పులు ఇచ్చిన బ్యాంకులు, సంస్థలు కూడా ఆందోళనలో ఉన్నా యి. గ్రాముపై రూ.2 వేల వరకు ఆయూ సంస్థలు అప్పులు ఇచ్చాయి. జాతీయ బ్యాంకులు మాత్రం గ్రాముకు రూ.1,700 వరకు ఇచ్చాయి. ప్రైవేట్ వ్యాపారులు, కార్పొరేట్ బ్యాంకులు అధిక వడ్డీపై రూ.2,200 వరకూ అప్పులిచ్చారుు. ప్రస్తుతం ఆభరణాల బంగారు గ్రాము ధర రూ.2,580గా ఉంది. దీంతో అప్పుల వసూళ్లపై ఆయా బ్యాంకులు, సంస్థలు దృష్టిపెట్టాయి. ఖాతాదారులకు డిమాండ్ నోటీసులు పంపిస్తూ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.