
జిల్లాకు వైఎస్సార్ సీపీ త్రిసభ్య కమిటీ
- 30న కాకినాడలో జిల్లా విస్తృతస్థాయి సమావేశం
- విజయసాయిరెడ్డి, ధర్మాన, ఉమ్మారెడ్డి రాక
సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పార్టీ త్రిసభ్య కమిటీ ఈ నెల 30న జిల్లాకు రానుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వివిధ జిల్లాల సమీక్షలో భాగంగా త్రిసభ్య కమిటీ కాకినాడ సూర్యకళామందిర్‌లో జిల్లా విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కమిటీ సభ్యులు పార్టీ పరిస్థితిపై నేతలతో సమీక్షిస్తారని శాసనసభా పక్ష ఉప నేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ తెలిపారు. గురువారం కంబోడియా నుంచి ఆయన ఫోన్లో ‘సాక్షి’తో మాట్లాడారు.
త్రిసభ్య కమిటీ సభ్యులైన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి, పార్టీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన ప్రసాదరావుతో పాటు పార్లమెంటు పరిశీలకులు కూడా హాజరు కానున్నారని చెప్పారు. సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ సీజీసీ, సీఈసీ, రాష్ట్ర కమిటీ సభ్యులు, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల కో ఆర్డినేటర్‌లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, డీసీసీబీ డెరైక్టర్‌లు, సొసైటీ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, మండల కన్వీనర్లు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల కన్వీనర్లు, గ్రామ కమిటీల అధ్యక్షులు, అనుబంధ కమిటీల సభ్యులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.