కాకినాడ: పిఠాపురం జగ్గయ్యచెరువు బాధితులు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. పేదలకు అందజేసిన పట్టా భూముల్లో నిర్మించుకున్న గృహాలను అధికారపార్టీ ప్రజాప్రతినిధి ప్రోద్బలంతో రెవెన్యూ అధికారులు అక్రమంగా కూల్చివేయడంపై నిరసన వ్యక్తం చేశారు.
కలెక్టరేట్ గేటు ఎదుట కొద్దిసేపు ధర్నా చేపట్టి అనంతరం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అక్కడే స్ధానిక ఎమ్మెల్యే వర్మ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పిఠాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు నేతృత్వంలో బాధితులు కలెక్టర్ అరుణ్‌కుమార్‌కు వినతిపత్రంను అందజేశారు.
వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో జగ్గయ్యచెరువులో ఇళ్ళస్ధలాలు మంజూరు చేశారని గుర్తు చేశారు ఆ స్థలాల్లో పేదలు అప్పులుచేసి, బంగారం తాకట్టు పెట్టుకుని పునాదులు నిర్మించుకుంటే ఆక్రమణలంటూ అధికారులు కూల్చివేస్తున్నారన్నారు. అక్కడ నివసిస్తున్న 719 కుటుంబాలు భయంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. బాధితులకు న్యాయం చేయాలని, తహశీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబ్జి, పట్టణ అధ్యక్షుడు బొజ్జారామయ్య, మండల జనరల్ సెక్రటరీ ఉలవల భూషణం, గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు వర్ల రాజు తదితరులతోపాటు బాధితులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.