చంద్రబాబుపై ప్రజలకు భ్రమలు తొలగాయి
- వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ సునీల్
కరప : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ప్రజలు పెట్టుకున్న భ్రమలు తొలగిపోయాయని, గ్రామాల్లో, నగరాల్లో ఎక్కడ చూసినా వ్యతిరేకత కనిపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ కో–ఆర్టినేటర్ చలమలశెట్టి సునీల్ అన్నారు. బుధవారం కరప వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన విధంగా నవ్యాంధ్ర ప్రదేశ్‌ను కూడా అభివృద్ధి చేస్తారని ప్రజలు నమ్మి గెలిపించారన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం పేరు చెప్పి ప్రచారం చేసుకోవడమే కానీ చేసిందేమీ కనిపించడంలేదన్నారు. అమలు సాధ్యంకానీ వాగ్దానాలతో అధికారం చేజిక్కించుకున టీడీపీ వాటిని అమలుచేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. జన్మభూమి కమిటీలు నియమించడంతో అవినీతిని గ్రామస్థాయికి తీసుకుపోయారని సునీల్ విమర్శించారు. తమ పార్టీ అధినేత వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ప్రధాని నరేంద్రమోదీని కలిస్తే తప్పేంటని ప్రశ్నించి, దీన్ని అధికార పార్టీ నాయకులు, మంత్రులు రాజకీయం చేయడం తగదన్నారు. ప్రధానిని ఎవరైనా కలవవచ్చన్న రాజకీయ పరిజ్ఞానం కూడా లేకపోవడం శోచనీయమన్నారు. అనంతరం కార్యకర్తలతో మాట్లాడుతూ టీడీపీ సాగిస్తున్న అవినీతి పాలనపై జగన్ చేస్తున్న పోరాటాన్ని ప్రజలకు వివరించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు.