నిష్పక్షపాతంగా విచారిస్తాం: ఎస్పీ | district sp visits cherakulapadu | Sakshi
Sakshi News home page

నిష్పక్షపాతంగా విచారిస్తాం: ఎస్పీ

Published Sun, May 28 2017 6:33 PM | Last Updated on Tue, Sep 5 2017 12:13 PM

district sp visits cherakulapadu

చెరుకులపాడు హత్య కేసుపై ఎస్పీ వ్యాఖ్య

వెల్దుర్తి రూరల్‌: కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ డోన్‌ డీఎస్పీ బాబా ఫకృద్దీన్, సీఐ శ్రీనివాసులుతో కలిసి చెరుకులపాడు గ్రామంలో ఆదివారం పర్యటించారు. నారాయణ రెడ్డి హత్యకేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తారని, నిష్పక్షపాతంగా విచారిస్తామని ఆయన తెలిపారు. నిందితులను విచారించేందుకు పోలీస్‌ కస్టడీ కోరుతూ కోర్టుకు అప్పీలు చేశామని చెప్పారు. హత్యకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు తమకు తెలిపితే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. కాగా, తమ గ్రామం ప్రశాంతంగా ఉండేదని, తాజాగా అలజడుల కారణంగా తమ నాయకుడినే కోల్పోయామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో తిరిగి ప్రశాంతత నెలకొనేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ వారికి అభయమిచ్చారు. హతుడు సాంబశివుడు కుటుంబాన్ని ఎస్పీ బృందం పరామర్శించింది. అతని తల్లి, భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తామెవరం ఏనాడూ ఫ్యాక్షన్‌ జోలికి వెళ్లలేదని, నారాయణరెడ్డి హత్యను అడ్డుకోబోయిన తన కుమారుడిని హత్య చేశారని, వ్యవసాయంతో జీవనం సాగించే తమకు ఈ దుస్థితి పట్టిందని కుటుంబీకులు వాపోయారు. అనంతరం ఎస్పీ నారాయణరెడ్డి అన్న ప్రదీప్‌కుమార్‌రెడ్డి, నారాయణరెడ్డి భార్య కంగాటి శ్రీదేవి, కుమారుడు మోహన్‌రెడ్డిలను పరామర్శించారు

ఎస్‌ఐపై వెల్లువెత్తిన ఫిర్యాదులు
స్థానిక ఎస్‌ఐ తులసీనాగప్రసాద్‌పై నారాయణరెడ్డి కుటుంబీకులు, గ్రామ సర్పంచ్, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, గ్రామస్తుల పలు ఫిర్యాదులు చేశారు. తమ తమ్ముడు నారాయణరెడ్డి హత్యకు ఎస్‌ఐ పరోక్ష కారకుడని, అతని ప్రోద్బలంతోనే ప్రత్యర్ధులు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్దారని ప్రదీప్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తన భర్త హత్యలో కేఈ శ్యాంబాబుతోపాటు ముఖ్యంగా ఎస్‌ఐ పాత్ర  ఉందంటూ శ్రీదేవి ఎస్పీ ఎదుట వాపోయారు. తాను దళిత మహిళా సర్పంచ్‌ను.. గర్భవతిని అయినా గ్రామంలో పరిస్థితులపై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళితే ఎస్సై అవమానించి అసభ్యకరంగా మాట్లాడాడంటూ సర్పంచ్‌ అపర్ణ, ఆమె భర్త శివలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ కోసం పలుమార్లు అక్రమ ఇసుక, తదితర అసాంఘిక కార్యలాపాలపై వార్తలు రాసిన విలేకరులపై సైతం అక్రమ కేసులు బనాయించాడని రైతులు, గ్రామస్తులు ఎస్‌ఐపై ఫిర్యాదు చేశారు.
 
జిల్లాలో ఫ్యాక్షన్‌ నిర్మూలనకు చర్యలు
జిల్లాలో ఫ్యాక్షన్‌ నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నానని ఎస్పీ రవికృష్ణ తెలిపారు. తాను కప్పట్రాళ్లను అభివృద్ధి చేస్తున్న తీరును ఉదహరించారు. గ్రామంలోని రచ్చకట్ట వద్ద విలేకరులతో మాట్లాడుతూ నారాయణరెడ్డి హత్య తరువాత జిల్లాలో అన్ని ఫ్యాక్షన్‌ గ్రామాలలో ఇటు ఫ్యాక్షనిస్టులుగా ఉన్న అనుమానితులను, అటు అలసత్వం వీడాలంటూ పోలీసు యంత్రాంగానికి హెచ్చరికలు జారీ చేశామన్నారు. అనుమానితులపై బైండోవర్‌ కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఏ గ్రామంలోనైనా ఎవరికైనా ఏ చిన్న సమస్య ఎదురైనా, పోట్లాటలకు దారితీసే పరిస్థితులు ఎదురైనా తన నంబరు 9440795500కు ఫోన్‌ చేసి తెలపాలన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement