విభజనాగ్ని
విభజనాగ్ని
సాక్షి, కాకినాడ :
రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా తెలంగాణ బిల్లును ఆమోదించడంపై మంగళవారం జిల్లావ్యాప్తంగా నిరసన జ్వాలలు పెల్లుబికాయి. రాస్తారోకోలు..ధర్నాలు..దిష్టిబొమ్మల దహనాలతో జిల్లా ప్రజలు మళ్లీ రోడ్డెక్కి తమ ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు.
సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ నేతల తీరు వల్లే ఈ దుర్గతి పట్టిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడునెలలుగా ఉవ్వెత్తున సాగిన విభజనాగ్ని ఉద్యమం సమైక్యద్రోహుల వల్ల నీరు గారిందంటూ జిల్లా ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
జూలై-30న సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కనుకూలంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది మొదలు నేటి వరకు సాగిన సమైక్య ఉద్యమంలో జిల్లావాసులు ఆగ్రభాగన నిలిచారు. రెండునెలలపాటు జిల్లా మొత్తం ధర్నాలు, ఆందోళనలు, బంద్‌లతో స్తంభించిపోయింది. ఏపీఎన్జీఒలకు ప్రభుత్వశాఖలన్నీ అండగా నిలిచి సమ్మెబాట పట్టాయి. వైఎస్సార్ సీపీ శ్రేణులు వినూత్న ఆందోళనలతో కదం తొక్కాయి.
జీర్ణించుకోలేకపోతున్న జనం
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లుకు మూజువాణి ఓటుతో మంగళవారం లోక్‌సభ ఆమోదముద్ర వేయడాన్ని జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆరు దశాబ్దాలుగా కలిసి ఉన్న తెలుగుజాతిని సీట్లు-ఓట్ల కోసం కాంగ్రెస్-బీజేపీ-టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలతో ముక్కలు చేశాయని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సమైక్యద్రోహులుగా మారిన ఈ పార్టీల ప్రజాప్రతినిధుల తీరు వల్లే ఈ దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రేపటి నుంచి విధుల్లోకి ఎన్జీవోలు
విభజన బిల్లు అసెంబ్లీకి పంపడాన్ని నిరసిస్తూ ఈ నెల ఆరవ తేదీ నుంచి ఏపీఎన్జీఒలు మళ్లీ నిరవధిక సమ్మె బాటపట్టారు. గత 13 రోజులుగా నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్న ఏపీఎన్జీఒలు వినూత్న రీతిలో నిరసనలతో హోరెత్తిస్తున్నారు. తాము సమ్మెను విరమించి గురువారం నుంచి విధులకు హాజరవుతామని ఏపీఎన్జీఓ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం తెలిపారు.
ఆగ్రహ జ్వాలలు
జిల్లా కేంద్రమైన కాకినాడలో కలెక్టరేట్ వద్ద ఏపీ ఎన్జీఓలు సోనియా, దిగ్విజయ్, షిండే, జై రామ్ రమేష్, సుష్మాస్వరాజ్‌లతో రూపొందించిన ఫ్లెక్సీలకు నిప్పుపెట్టి తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. మసీదు సెంటర్‌లో సమైక్యవాదులు టైర్లకు నిప్పుపెట్టి సోనియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వైఎస్సార్‌సీపీ నిరసన
రాజమండ్రి దేవీచౌక్ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు బొమ్మన రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మను దహనం చేసి రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో రాజ్‌కుమార్‌తోపాటు జక్కంపూడి రాజా, ఆదిరెడ్డి వాసు, రాష్ర్ట ఎస్సీ సెల్ సభ్యుడు మాసా రామజోగ్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి కోరుకొండ సెంటర్‌లో రాస్తారోకో చేశారు. బీజేపీ జెండాలను దహనం చేసి ఆందోళనకు దిగారు. దీంతో విజయలక్ష్మితో సహా పలువుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కోరుకొండ మండల కన్వీనర్ చింతపల్లి చంద్రం గుండుగీయించుకొని నిరసన తెలిపారు. అమలాపురం హైస్కూల్ సెంటర్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో బీజేపీ స్థూపం ధ్వంసం చేసి రాహుల్ గాంధీ ఫ్లెక్సీలకు నిప్పుపెట్టారు. జేఏసీ కోనసీమ చైర్మన్ విఎస్ దివాకర్, కన్వీనర్ బండారు రామ్మోహనరావు వైఎస్సార్‌సీపీ నాయకులు మిండగుదిటి మోహన్‌తో పాటు జేఏసీ, పార్టీ నాయకులు రాస్తారోకో చేశారు. మామిడికుదురులో వైఎస్సార్‌సీపీ రాష్ర్టరైతు విభాగం కమిటీ సభ్యుడు జక్కంపూడి తాతాజీ తదితరుల ఆధ్వర్యంలో 216 జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏలేశ్వరం బాలాజీచౌక్ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులు అలమండ చలమయ్య, శిడగం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. పిఠాపురంలోని పార్టీ కార్యాలయం ఎదుట సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. సఖినేటిపల్లి మండలం శృంగవరపుపాడులో స్థానికులు రాస్తారోకో చేయగా, రాజోలులో రాస్తారోకో నిర్వహించి దిష్టిబొమ్మలను దహనం చేశారు. అరకు పార్లమెంటు నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొత్తపల్లి గీత యువసేన కార్యకర్తలు రంపచోడవరంలో సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. అనపర్తి దేవీచౌక్ సెంటర్‌లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కిర్లంపూడిలో ఎంపీడీఒ ప్రసాద్ ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు.