దీక్ష భగ్నం
Published Mon, Aug 19 2013 7:02 AM | Last Updated on Fri, Sep 1 2017 9:55 PM
సాక్షి, కడప:రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే ఏకైక డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు గత నెలలోనే రాజీనామాలు చేశారు. అయినా విభజన నిర్ణయాన్ని ప్రకటించడంతో ఈ నెల 12న రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డితో పాటు హఫీజుల్లా, పాండురంగారెడ్డి, సంపత్‌లు కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నారు. వైసీపీ నేతల దీక్షలతో సమైక్య ఉద్యమం ఒక్కసారి ఉధృతమైంది. కార్మిక, ఉద్యోగ, ప్రజా, కుల సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు సంబంధించి మతపెద్దలు దీక్షలను సందర్శించి దీక్షకులను ఆశీర్వదించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా శిబిరాన్ని సందర్శించారు. జిల్లాలోని పట్టణాలతో పాటు గ్రామాల నుంచి స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చి దీక్షలో పాల్గొన్నారు.
దీక్షలోని వారికి మద్దతుగా రోజూ 30-40 మంది రిలేదీక్షలకు కూర్చున్నారు. ఇతర జిల్లాలోని వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ నేతలు కూడా దీక్షాశిబిరాన్ని సందర్శించారు. దీంతో జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి పెరిగింది. దీక్ష కొనసాగుతున్న తీరు, ప్రజా మద్దతు, ఉద్యమసెగలపై ఎప్పటికప్పుడు ఇంటలిజెన్స్ విభాగం ప్రభుత్వానికి సమాచారం చేరవేసింది. ఏ రాజకీయపార్టీ నేతలు జిల్లాలో ఆమరణదీక్షకు దిగకపోవడం, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ దీక్షలతో ఉద్యమం ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చడంతో ప్రభుత్వం కూడా ఆలోచనలో పడింది. పోలీసుల ద్వారా దీక్షను భగ్నం చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం శిబిరం వద్దకు భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. రాత్రి 7 గంటలకు డీఎస్పీ రాజేశ్వరరెడ్డి, సీఐ షౌకత్‌అలీ శిబిరం లోపలికి వచ్చారు. దీంతో వైసీపీ కార్యకర్తలు దీక్షకులకు రక్షణగా చుట్టుముట్టి ‘పోలీస్ గోబ్యాక్’ అని నినదించారు. దీంతో వారు వెనుదిరిగారు. తర్వాత 9 గంటల సమయంలో పోలీసులు భారీబలగంతో వచ్చి దీక్షను భగ్నం చేశారు. బలవంతంగా వారిని లాక్కెళ్లి జీపులో రిమ్స్‌కు తరలించారు.
వెంటనే దీక్షకు దిగిన పార్టీ నేతలు:
ఆమరణదీక్షను భగ్నం చేయగానే వెంటనే పార్టీ రైతు విభాగం కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి, పార్టీ మెడికల్ వింగ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మేసా ప్రసాద్‌లు అదే శిబిరంలో ఆమరణదీక్షకు దిగారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న తమపార్టీ నేతలను ఆస్పత్రికి తరలించడం దారుణమని, తెలంగాణలో పోలీసులు ఉద్యమానికి సహకరిస్తుంటే ఇక్కడి పోలీసులు ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్నారని దీక్షకు కూర్చున్నవారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైసీపీ పోరాటం ఆగదని, అందుకే ఆమరణదీక్షకు సిద్ధమయ్యామని వారు ప్రకటించారు.
నేడు ఆమరణదీక్షలో కూర్చోనున్న ముగ్గురు నేతలు
సమైక్యాంధ్రకు మద్ధతుగా వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, కడపనగర సమన్వయకర్త అంజాద్‌బాషా, పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు రఘురామిరెడ్డి తనయుడు నాగిరెడ్డిలు కలె క్టరేట్ ఎదుట సోమవారం ఆమరణదీక్షకు కూర్చోనున్నారు.
ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తాం:
రవీంద్రనాథరెడ్డి, మాజీ మేయర్.
ఏడురోజులుగా శాంతియుత దీక్ష చేస్తున్నాం. దీక్షకు స్పందించాల్సింది పోయి మమ్మల్ని అరెస్టు చేయడం దారుణం. దీక్షను భగ్నం చేశామని పోలీసులు, ప్రభుత్వం భావించవచ్చు. కానీ ఆస్పత్రిలో దీక్షను కొనసాగిస్తాం. సమైక్య ప్రకటన వచ్చేంత వరకూ ప్రాణాలు పోయినా దీక్షను మాత్రం ఆపే ప్రసక్తే లేదు.
మన ప్రాంతానికి అన్యాయం జరగనివ్వం: ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
దీక్షను భగ్నం చేయడం అన్యాయం. విభజన జరిగితే మన ప్రాంతానికే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అది అన్ని వర్గాల ప్రజలపై ప్రభావం చూపుతోంది. శాంతియుతంగా సాగిస్తున్న దీక్షను పోలీసులు అర్థం చేసుకోలేదు. అండగా నిలవాల్సింది పోయి భగ్నం చేశారు. ప్రాణాలు పోయినా మన ప్రాంతానికి మాత్రం అన్యాయం జరగనివ్వం. సమైక్య ప్రకటన వెలువడే వరకూ వైసీపీ పోరాటం ఆగదు.
నేడు కడప, రాయచోటి బంద్
మా పార్టీ నేతలు శాంతియుతంగా దీక్ష చేస్తున్నారు. మా దీక్షకు పోలీసులు కూడా ఇన్ని రోజులు సహకరించారు. ఆదివారం కూడా మేము అదే భావనలో ఉన్నాం. అయితే ఒక్కసారిగా పోలీసులు దీక్షా శిబిరంలోకి చొచ్చుకువచ్చి మా నేతలను అక్రమంగా అరెస్టు చేశారు. దీనికి నిరసనగా సోమవారం కడప, రాయచోటి బంద్‌కు పిలుపునిస్తున్నాం.
- అంజాద్ బాషా,కడప సమన్వయకర్త,
మదన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ యూత్
స్టీరింగ్ కమిటీ మెంబర్
Advertisement