కర్నూలు:కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ వై.నరసింహులు కన్నీరు పెట్టుకున్నారు.కార్యాలయ ఉద్యోగులు తమ సమస్యలపై ఆందోళన తీవ్రతరం చేయడంతో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.తాను ఉద్యోగం చేయలేనని విలపిస్తూ వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. వివరాలివీ..డీఐవోగా పనిచేసిన డాక్టర్ వెంకటరమణ, పలువురు ఉద్యోగులు శనివారం ఉదయం డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద ధర్నా చేశారు.
వారిని తన చాంబర్‌లోకి డీఎంహెచ్‌వో పిలిపించుకుని మాట్లాడుతుండగా..పలు డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లిన ఉద్యోగులు మూకుమ్మడిగా నిలదీయడంతో డీఎంహెచ్‌వో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.దీంతో ఉద్యోగులు ఆయనపై విరుచుకుపడుతూ..ఎస్సీ ఉద్యోగులపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.తాను బీసీని కాబట్టే మూకుమ్మడిగా నిలదీస్తున్నారంటూ డీఎంహెచ్‌వో సైతం ఆగ్రహించారు.తాను వైఎస్సార్ కంటి వెలుగు, సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కలెక్టరేట్‌లో బిజీగా ఉన్నానని, ఈ సమయంలో తనను ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదన్నారు.
ఒక దశలో తీవ్రస్థాయిలో విలపిస్తూ తాను రాజీనామా చేస్తానని, ఈ ఉద్యోగం అక్కర్లేదని వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. దీంతో పలువురు ఉద్యోగులు ఆయన్ను సముదాయించి సీట్లో కూర్చోబెట్టారు. కాగా, కార్యాలయ ఏవోగా లద్దగిరి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కొరేషిరాజును నియమిస్తున్నామని, ఇకపై ఉద్యోగుల సమస్యలు ఆయనే పరిష్కరిస్తారని డీఎంహెచ్‌వో చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
Comments
Please login to add a commentAdd a comment