జిల్లాపై చిన్నచూపు | Do not use Nizampatnam port development | Sakshi
Sakshi News home page

జిల్లాపై చిన్నచూపు

Published Thu, Aug 21 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 PM

జిల్లాపై చిన్నచూపు

జిల్లాపై చిన్నచూపు

నిజాంపట్నం ఓడరేవు అభివృద్ధి ఊసే లేదు
రుణ మాఫీపై నిర్ధిష్ట హామీ లేదు..
టూరిజం సర్క్యూట్ మంజూరు..
కీలక ప్రాజెక్టులకు అరకొర కేటాయింపులు
కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనులకు రూ.120 కోట్లు
పులిచింతల ప్రాజెక్టుకు రూ.26.21 కోట్లు మాత్రమే..
ఇరిగేషన్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికీ భారీ కోతలు
రాష్ట్ర బడ్జెట్‌పై సర్వత్రా అసంతృప్తి...
సాక్షి ప్రతినిధి, గుంటూరు: విభజన అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తొలిసారిగా శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లాలోని అన్ని వర్గాలను అసంతృప్తికి గురిచేసింది.  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలకు తగ్గట్టు కేటాయింపులు చూపించేందుకు చేసిన ప్రయత్నంగా ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి అంకెల గారడీ చేశారనే విమర్శలూ వినపడుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ తరఫున 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను గెలిపించిన గుంటూరు జిల్లా ప్రజలకు ఈ బడ్జెట్ ఎలాంటి ప్రయోజనం కలిగించలేకపోతోంది.
జిల్లాకు కొత్తగా టూరిజం సర్క్యూట్‌ను మాత్రమే మంజూరు చేసి, ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులను విస్మరించడం విస్మయానికి గురి చేసింది.
రాష్ట్రంలోని 14 చిన్న తరహా ఓడరేవులను పబ్లిక్, ప్రైవేట్ భా గస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం జిల్లాలోని నిజాంపట్నం ఓడరేవు అభివృద్ధిని విస్మరించింది. కళింగపట్నం, భావనపాడు వంటి హార్బర్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం చిన్న తరహా ఓడరేవుల శాఖ ఆధీనంలోని నిజాం పట్నం హార్బర్‌ను పట్టించుకోకపోవడం అనాలోచిత చర్యగా అభివర్ణిస్తున్నారు.
సముద్ర ముఖ ద్వారం వద్ద ఏర్పడుతున్న ఇసుకమేటలను తొలగించి ఓడల ద్వారా సరుకుల రవాణా పెంచే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయలేకపోయిందని వాణిజ్య రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
కృష్ణా పశ్చిమ డెల్టా ఆధునికీకరణ పనులకు మొక్కుబడిగానే నిధులు కేటాయించారు. దీనికి సంబంధించి రూ.850 కోట్లకు  రూ.200 కోట్ల విలువైన పనులే ఇప్పటి వరకు జరిగాయి. సాగునీటి రంగానికి పెద్ద పీట వేశామంటున్న ప్రభుత్వం రూ.8,465 కోట్లు కేటాయించినప్పటికీ, నిధులు అరకొరగానే విడుదలయ్యాయి.
నిర్మాణ సంస్థలు డెల్టా ఆధునికీకరణ పనులను వేగంగా చేయడం లేదని ప్రతీ బడ్జెట్‌లోనూ ప్రభుత్వం నిధులు అరకొరగానే కేటాయిస్తోంది. ఈసారీ కూడా కృష్ణాడెల్టాకు రూ.120 కోట్లు మాత్రమే కేటాయించింది.
పులిచింతల ప్రాజెక్టుకు రూ.26.21 కోట్లు కేటాయించారు. అయితే ఈ సంస్థ రూ.216 కోట్ల నష్టపరిహారం కోరుతూ ఆర్భిట్రేషన్‌కు వెళ్లింది. పునరావాస కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, బాధితులకు నష్టపరిహారంగా  చెల్లించాల్సిన మొత్తాలు అధికంగా ఉన్నప్పటికీ బడ్జెట్‌లో రూ.26.21 కోట్లు మాత్రమే కేటాయించారు.
పౌరసరఫరాల శాఖకు రూ.2,318 కోట్లు కేటాయించినప్పటికీ‘అమ్మహస్తం’ గురిం చి ప్రస్తావించకపోవడంతో ఈ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం అటకెక్కిస్తుందనే ప్రచా రం జరుగుతోంది. ఈ పథకం స్థానే ‘అన్న క్యాంటీన్’లకు  నిధులు కేటాయించనున్నట్టు తెలుస్తోంది.
పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచే కార్యక్రమంలో భాగంగా జిల్లాకు ఒక టూరిజం సర్క్యూట్‌ను కేటాయించారు. పర్యాటక అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించగా, ఇందులో టూరిజం సర్క్యూట్ కూడా ఉంది. జిల్లాలోని కొండవీడుకోట తదితర పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి నామమాత్ర నిధులు కేటాయించారు.
రైతులు, డ్వాక్రా గ్రూపులు తీసుకున్న రుణాలను పూర్తిగా రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి  వీటి మాఫీపై పూర్తిస్థాయి స్పష్టత ఇవ్వలేకపోయారు.
జిల్లాలో  రైతులు, డ్వాక్రా గ్రూపులు తీసుకున్న మొత్తం రుణాలు రూ.10 వేల కోట్లు ఉంటే, రాష్ట్రం మొత్తం మీద రుణమాఫీకి ఈ బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లు మాత్రమే కేటాయించారు.
ఎస్సీ సబ్‌ప్లాన్ కింద గత ఏడాది కేటాయించిన నిధులు పూర్తిగా  పంపిణీ జరగలేదు. జిల్లాలో 3 వేల మంది లబ్ధిదారులు బ్యాంకుల్లో వ్యక్తిగత ఖాతాలు ప్రారంభించినప్పటికీ సబ్సిడీ జమ కాలేదు. తిరిగి ఈ బడ్జెట్‌లో రూ.2,657 కోట్లు కేటాయించారు.
గృహ నిర్మాణ రంగానికి అరకొరగానే కేటాయింపులు జరిపారు. జిల్లాలో 23,521 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఆగిపోయాయి. 54,919 ఇళ్లు ప్రారంభానికీ నోచుకోలేదు. 78 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. బడ్జెట్ కేటాయింపులను చూస్తే ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావడం గగనమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
 
 ముస్లిం మైనార్టీలకు అన్యాయం
పట్నంబజారు : బడ్జెట్‌లో ముస్లిం మైనారిటీ వర్గాలకు తీరని అన్యాయం జరిగింది. తెలంగాణలో రూ. వెయ్యి కోట్లు  కేటాయిస్తే, మన రాష్ట్రంలో కేవలం రూ. 371 కోట్లు మాత్రమే కేటాయించటం దారుణం. ఈ కారణంగాగ ముస్లిం వర్గాల ప్రజలు అనేక రకాలుగా నష్టపోయే ప్రమాదం ఉంది.  మైనారిటీ వర్గాల ఫీజురీయింబర్స్‌మెంట్, కార్పొరేషన్ రుణాలు, పేదలకు నివాసాల ఏర్పాటు వీటిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ను రూపొందిస్తే బాగుండేది. బడ్జెట్‌లో మైనారిటీలను చిన్నచూపు చూశారనేది స్పష్టంగా అర్థమవుతోంది.
 - మొహ్మద్ ముస్తఫా, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే
 
ప్రజలను వంచించిన టీడీపీ ప్రభుత్వం
నరసరావుపేటవెస్ట్ : ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు బడ్జెట్‌లో తగిన నిధులు  కేటాయించకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజలను వంచించింది. రుణమాఫీకి అరకొర కేటాయింపులు చూస్తుంటే ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నట్లుగా కనిపిస్తోంది. ప్రతి నిరుద్యోగికి రూ.2 వేలు భృతి కల్పిస్తామని చేసిన హామీ ప్రస్తావనే బడ్జెట్‌లో లేదు. ఈ ఏడాది నుంచే నరసరావుపేటలో జేఎన్‌టీయు ఇంజనీరింగ్ కళాశాలను ప్రారంభిస్తామని చెప్పి బడ్జెట్‌లో ఆ ప్రస్తావనే తీసుకురాలేదు. ఇప్పటికే గృహ నిర్మాణ శాఖలో 12 లక్షల ఇందిరమ్మ ఇళ్లు అసంపూర్తిగా మిగిలిపోగా, బడ్జెట్‌లో రూ.800కోట్లు మాత్రమే కేటాయించి, మరో 25 వేల ఇళ్లు ఏ విధంగా పూర్తి చేస్తారు. ఇక మైనార్టీలకు పూర్తిగా అన్యాయం చేశారు.  -డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే ,నరసరావుపేట
 

రాజధాని ఊసేలేని బడ్జెట్
 మంగళగిరి:
నవ్యాంధ్ర రాజధాని ఊసే లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆశ్చర్యంగా వుంది. ఆర్థిక శాఖా మంత్రి యనమల బడ్జెట్ ప్రసంగం అంతా పార్టీ ప్రసంగాన్ని తలపించింది. రూ. 15వేల కోట్లను కేటాయిస్తే రుణమాఫీ ఎలా సాధ్యం. డ్వాక్రా మహిళలు, చేనేతలు, రైతులు, యువకులు బడ్జెట్‌పై ఎన్నో ఆశలతో ఎదురుచూశారు. బుధవారం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వారి ఆశలను వమ్ము చేసింది. ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమం, ఇంటికో ఉద్యోగం, పవర్‌లూమ్‌కు కేటాయింపులని వాగ్దానాలు చేసిన ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా ఏ విధంగా అమలు చేస్తారు. గృహ నిర్మాణాలకు కేటాయించిన నిధులు ఇప్పటి వరకు వున్న పాత బిల్లులకే సరిపోవు. ఇక కొత్త ఇళ్ల నిర్మాణం ఏ విధంగా సాధ్యమవుతుంది.  

కార్మిక సంక్షేమం కోసం రూ. 276 కోట్లు మాత్రమే కేటాయించడం కార్మికులపై ప్రభుత్వానికి వున్న నిర్లక్ష్యాన్ని తెలియజేసింది. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు రూ. 615 కోట్లు కేటాయించిన నేపథ్యంలో రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామిక వేత్తలు ఏ విధంగా ముందుకు వస్తారు. రాష్ట్రంలో ఇప్పటికే కరవు తాండవిస్తోంది. వర్షాభావం ఏర్పడి రైతుల పంటలు వేసే స్థితిలో లేరు. ఇలాంటి దశలో విపత్తుల నిర్వహణకు రూ.403 కోట్లు కేటాయించడం ఏ విధంగా సమంజసం.

ఆర్థిక మంత్రి ప్రసంగం అంతా పరనింద...ఆత్మస్తుతి అన్న చందాన సాగింది. ఫించన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లపై స్పష్టత లేదు. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వ పెద్దలు నిధులు కేటాయించకుండా ఏ విధంగా అభివృద్ధి చేస్తారు. నవ్యాంధ్రలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ నిరాశాజనకంగా ఉంది.  -ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఎమ్మెల్యే,మంగళగిరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement