యలమంచిలి: సాధారణ ఎన్నికలకు ముందే మున్సిపల్ ఎన్నికలు తరుముకురావడంతో రాజకీయ పార్టీల్లో ఆందోళన మొదలైంది. ముందుగా వచ్చిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆచితూచి వ్యవహరించకపోతే వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం ాలిటీ ఎన్నికల్లో స్థానిక కులసమీకరణాలు, బంధుత్వాలు, పరిచయాలతో పాటు డబ్బు, మద్యం కీలకం కానున్నాయి.
యలమంచిలి మున్సిపాలిటీలో అత్యధికంగా కాపు కులస్తులు ఉండగా తర్వాత వరుసలో గవర సామాజిక వర్గంవారు ఉన్నారు. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ, టీడీపీలు అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభించాయి. వార్డుల్లో గెలుపు గుర్రాల కోసం వెదుకుతున్నాయి. ఇటీవల పలువురు కాంగ్రెస్ నేతలు వైఎస్సార్ సీపీలో చేరాలని నిర్ణయించుకోవడం ఆ పార్టీకి మరింత బలాన్నిస్తోంది.
వైఎస్సార్ సీపీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా బోదెపు గోవింద్ సతీమణి, లేదా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఆడారి శ్రీధర్ భార్యకు అవకాశం రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ నుంచి ఆడారి తులసీరావు కుమార్తె పిళ్లా రమాకుమారి పేరు ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. టీడీపీ నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జ్ సుందరపు విజయ్‌కుమార్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్నప్పటికీ మరోపక్క మాజీ ఎంపీ పప్పల చలపతిరావు పేరు వినిపిస్తోంది. సుందరపు అభ్యర్థిత్వాన్ని విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావుతోపాటు ఆయన అనుచరులు వ్యతిరేకిస్తుండడంతో ఆ పార్టీ అభ్యర్థి విషయంలో ఇంకా స్పష్టత కనిపించడంలేదు. మరోపక్క ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తిరాజు కూడా హటాత్తుగా రూటు మార్చారు.
చంద్రబాబుతో మంతనాలు జరిపిన ఎమ్మెల్యే యలమంచిలి నుంచే టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తానని కార్యకర్తలతో చెబుతున్నారు. ఎమ్మెల్యే ప్రకటనలు తెలుగుతమ్ముళ్లతోపాటు, కాంగ్రెస్ కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. ఇక కాంగ్రెస్‌పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారు కనుచూపుమేరలో కనిపించడంలేదు. వైఎస్సార్‌సీపీ నుంచి ఆపార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు పేరు వినిపిస్తోంది.