
గజలక్ష్మి (ఫైల్)
సాలూరు: భర్త ఆదరణకు నోచుకోని ఓ ఒంటరి ఇల్లాలు వీధికుక్కలకు బలైంది. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బంగారమ్మ కాలనీలో వెంకటాపురం గజలక్ష్మి (45) శిథిలమైన తన గృహంలో నివాసం ఉంటోంది. భర్త రామకృష్ణ బొడ్డవలస గురుకుల పాఠశాలలో వంటవాడిగా పనిచేస్తున్నాడు. ఆయన ఆదరణ లేకపోవడంతో ఈమె ఇరుగుపొరుగు వారిచ్చే ఆహారం తీసుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది. అనారోగ్యం బారినపడ్డ ఆమె శిథిల గృహంలో గురువారం రాత్రి నిద్రపోయింది.
తలుపులు కూడా లేని ఆ ఇంట్లో వీధికుక్కలు తలదాచుకోవడం సాధారణమైంది. వేకువజామున 3 గంటల సమయంలో ఆమెపై కుక్కలతో పాటు కుక్క పిల్లలు దాడిచేసి, ఆమె శరీరాన్ని పీక్కుతిని దారుణంగా చంపేశాయి. తెల్లవారుజామున సమీప కుటుంబాలవారు వెళ్లి చూసేసరికి అత్యంత దారుణ స్థితిలో ఉన్న గజలక్ష్మి మృతదేహాం పడిఉంది. వార్డు మాజీ కౌన్సిలర్ పెద్దింటి శ్రీరాములు పోలీసులకు తెలపడంతో ఎస్‌ఐ పాంగివారి విచారణ జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment