కర్నూలు: జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు నేరాల బాట పట్టాడు. తాళం వేసిన ఇళ్లకు కన్నాలు వేసి దొంగతనాలకు పాల్పడుతూ చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తుడు హరిజన బొగ్గు వెంకటేశ్వర్లును కర్నూలు తాలుకా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఆరు తులాల బంగారు, 20 తులాల వెండి పట్టీలు, రూ.5 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాలుకా సీఐ మధుసూధన్‌రావు నేరస్తుడి వివరాలను వెళ్లడించారు.
ప్రకాశం జిల్లా వెంకాయపల్లెకు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పట్టించుకోకుండా కొంతకాలంగా జులాయిగా తిరుగుతూ నేరాల బాట పట్టాడు. దీంతో అతని భార్య దూరంగా ఉంటుంది. ఎలాంటి సంతానం కలుగకపోవడంతో జల్సాల కోసం చోరీలనే వృత్తిగా ఎంచుకున్నాడు. తాళాలు వేసిన ఇళ్లపై రెక్కీ నిర్వహించి చోరీలకు పాల్పడేవాడు. గతంలో కర్నూలు పాతబస్తీతో పాటు మూడవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. అయినప్పటికీ అతనిలో మార్పు రాలేదు. బెయిల్‌పై విడుదల కాగానే మళ్లీ నేరాలకు పాల్పడేవాడు.
మంగళవారం వెంకాయపల్లె ఎల్లమ్మ గుడి వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో వెంకటేశ్వర్లును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా పలు దొంగతనాలు చేసినట్లు నేరం అంగీకరించాడు. గత నెల 27వ తేది వెంకాయపల్లెలో నివాసం ఉంటున్న ప్రకాశం జిల్లాకు చెందిన అంకమరావు కుటుంబ సభ్యులతో కలిసి కర్నూలు నగరానికి వెళ్లడంతో గమనించిన వెంకటేశ్వర్లు ఆ ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో భద్రపరిచిన నాలుగు తులాల బంగారం, ఏటీఎం కార్డును ఎత్తుకెళ్లాడు.
ఆగస్టు 29న పడిదెంపాడులో నివాసముంటున్న బోయ సంజన్న ఇంట్లో రెండు తులాల బంగారు ఆభరణాలు, కాళ్ల పట్టీలను చోరీ చేశాడు. దొంగను అరెస్టు చేసి సొమ్ములను రికవరీ చేసిన ఎస్‌ఐ పెద్దయ్య నాయుడు, హెడ్ కానిస్టేబుల్ విద్యాసాగర్, సిబ్బంది శివకుమార్, మద్దిలేటి, షమీర్ తదితరులను సీఐ అభినందించారు.
జల్సాల కోసం చోరీలు
Published Tue, Sep 9 2014 11:52 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement