డాలర్ శేషాద్రి ఆరోగ్యంపై ఆసక్తి
సాక్షి, తిరుమల: గుండెపోటుకు గురైన ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి ఆరోగ్యంపై అందరూ ఆసక్తి కనబరిచారు. గురువారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై టీటీడీ ఉద్యోగులు చర్చించుకున్నారు. ‘దేవుడి ఆశీసులతో శేషాద్రి స్వామి క్షేమం గా రావాలి’ అంటూ ఆకాంక్షిం చారు. ప్రస్తుతం స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాలర్ శేషాద్రి ఆరోగ్యం కుదుట పడిందన్న సమాచారం తెలియడంతో వాహన సేవల్లోని సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.
బుధవారం హనుమంత వాహనం వరకు ఆలయ ఓఎస్‌డీగా అన్నీ తానై నడిపించే డాలర్ శేషాద్రి బాధ్యతల్ని ఆలయ బొక్కసం ఇన్‌చార్జి గురురాజా నిర్వహించారు. వాహన సేవలు ఎక్కడ ఆపాలి? ఏ ప్రాంతంలో సర్కారు హారతి ఇవ్వాలి? గంటకొట్టి హెచ్చరించే బాధ్యతల్ని గురురాజా సమర్థవంతంగా నిర్వహించారు.
శేషాద్రి కోలుకున్నారు డెప్యూటీ ఈవో
ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి స్వామి క్షేమంగా కోలుకున్నారని గురువారం డెప్యూటీ ఈవో చిన్నం గారి రమణ అన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారని, ఆయన క్షేమంగా తిరిగి వస్తారని ఆకాంక్షించారు.