డాలర్ శేషాద్రికి అస్వస్థత
సాక్షి, తిరుమల/తిరుపతి: తిరుమల ఆలయ ఓఎస్‌డీ పి.శేషాద్రి(డాలర్ శేషాద్రి)కి బుధవారం గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆయనకు స్విమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. మొదట పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా ప్రస్తుతం ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఆయన మంగళవారం రాత్రి జరిగిన గరుడవాహన సేవలో ఏకధాటిగా ఆరుగంటలపాటు విశిష్ట సేవలందించారు. అదే సందర్భంగా వాహనాన్ని అటూ ఇటూ తిప్పే సమయంలో కొంత అస్వస్థతకు లోనైనట్టు ఆయన శిష్యులు తెలిపారు. తిరిగి బుధవారం ఉదయం హనుమద్వాహన సేవలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన నివాస భవనం గోవింద నిలయంలో హఠాత్తుగా ఛాతీ నొప్పి వచ్చింది. ఓ కారులో డాలర్ శేషాద్రిని అశ్వినీ ఆస్పత్రిలోని అపోలో హృద్రోగ చికిత్సా కేంద్రానికి తరలించారు. తర్వాత ఛాతీనొప్పి ఎక్కువ కావడంతో ఆయన్ను తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. తిరుమల జేఈవో శ్రీనివాసరాజు, పీఆర్‌వో రవి స్వయంగా తిరుపతిలోని స్విమ్స్‌కు మధ్యాహ్నం 3.40 గంటలకు వెంటిలేటర్‌పై తీసుకువచ్చారు. స్విమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజశేఖర్ పర్యవేక్షణలో వైద్యుల బృందం శేషాద్రికి వైద్య పరీక్షలు నిర్వహించి రక్తపోటు, గుండె పనితీరును పరీక్షించారు. మొదట్లో ఆరు గంటలు గడిస్తేగాని ఏమీ చెప్పలేమన్న వైద్యులు.. తర్వాత పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు.
ఇది మూడోసారి..
శేషాద్రికి గతంలో రెండుసార్లు గుండెపోటు వచ్చింద్చి. ప్రస్తుం ఊపిరితిత్తుల్లోకి నీరు చేరిందని, కిడ్నీ సమస్యలు కూడా తలెత్తాయని వైద్యులు గుర్తించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి స్విమ్స్‌కు వచ్చి డాలర్ శేషాద్రి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. డాలర్ శేషాద్రి(66) 1977 జనవరి 26న టీటీడీలో ఉత్తర పారుపత్తేదార్(లెక్కలు రాసే గుమాస్తా)గా విధుల్లో చేరారు. తర్వాత సీనియర్ అసిస్టెంట్, పదోన్నతిపై పారుపత్తేదారుగా సుదీర్ఘ కాలం పనిచేశారు. 2006లో ఉద్యోగ విరమణ తర్వాత ఆలయ ఓఎస్‌డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా 2014 జూలై 4వ తేదీ వరకు కొనసాగే అవకాశం దక్కింది. తర్వాత ప్రస్తుత ఈవో గిరిధర్ గోపాల్ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకునే వరకు ఓఎస్‌డీగా కొనసాగేందుకు పొడిగింపు ఉత్తర్వులు ఇచ్చారు.