పార్టీని వీడొద్దు : కృపారాణి
Published Wed, Dec 4 2013 3:59 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
కంచిలి, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీని వీడి బయటకెళ్లవద్దని కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు ఆవరణలో మంగళవారం సాయంత్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె. ఈశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. స్వలాభానికి, రాజకీయ లబ్ధికోసం పార్టీ మారుతున్నవారి నైజాన్ని గుర్తించాలని, వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. కొందరు వ్యక్తులు బయటికెళ్ళి పోయినంతమాత్రాన పార్టీకి ఏం నష్టం జరిగిపోదని, కార్యకర్తలంతా పార్టీలోనే ఉంటున్నారని సమావేశానికి హాజరైనవారినిచూస్తే అర్థమవుతుందన్నారు.
జిల్లాలో ఇచ్ఛాపురం నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని స్పష్టమైందన్నారు. మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారద మట్లాడుతూ నిద్రావస్థలో ఉన్న ఇచ్ఛాపురం నియోజవర్గ కార్యకర్తలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఉత్సాహంగా పనిచేసి మళ్ళీ పార్టీని అధికారంలోకి తెస్తారన్నారు. సోంపేట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు డాక్టర్ ఎన్. దాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని విమర్శించేవారు ముందు పార్టీకి, పార్టీ ఇచ్చిన పదవులకు రాజీనామా చేసి మాట్లాడాలన్నారు. కార్యక్రమంలో పార్టీ డాక్టర్స్‌సెల్ ప్రతినిధి కిల్లి రామ్మోహనరావు, మాజీ ఎమ్మెల్యే నరేష్‌కుమార్ అగర్వాలా(లల్లూ), మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ లాభాల స్వర్ణమణి, పిలక పద్మావతి, శ్యామ్‌పురియా, పి.వి. రమణ, పి. చిన్నబాబు, పి. నీలాచలం, పి.దేవ్, బి. శోభన్‌బాబు, డి. ధర్మారావు, బి. మోహన్‌దాస్, రెడ్డి రాజశేఖర్, బి. శ్యామ్, ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement