సాక్షి, పోలవరం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కిల్లి కృపారాణి విరుచుకుపడ్డారు. ఆమె బుధవారమిక్కడ మాట్లాడుతూ... కాంగ్రెస్ ఏం పాపం చేసిందో చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలంటూ పాదయాత్ర చేపట్టడం కాంగ్రెస్ పార్టీ చేసిన పాపమా? అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర ఖజానా నుంచి రూ.5130 కోట్లు ఖర్చు చేసి పోలవరం ప్రాజెక్ట్‌ను ప్రారంభించారని ఈ సందర్భంగా కిల్లి కృపారాణి గుర్తు చేశారు. అలాగే కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పల్లంరాజు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి రాజధాని నిర్మాణంపై ఉన్న శ్రద్ధ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై లేదని ఎద్దేవా చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని, రూ.5130 కోట్లు ఖర్చు చేసి 32శాతం పనులు పూర్తి చేసింది తమ పార్టీయేనని తులసిరెడ్డి అన్నారు. జలయజ్ఞం ద్వారా 56 ప్రాజెక్ట్‌లు ప్రారంభించి 11 ప్రాజెక్ట్‌లు పూర్తి చేశామని ఆయన అన్నారు. కాగా పోలవరం ప్రాజెక్టు సత్వరం పూర్తి చేయాలనే డిమాండుతో కాంగ్రెస్ పార్టీ ఆదివారం తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో మహా పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment