సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ కీలకదశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో వివాదాలు ఉద్యమానికి మంచిది కాదని, భవిష్యత్తులో ఇలాంటివి జరుగకుండా అందరం కలిసి పనిచేద్దామని తెలంగాణ రాజకీయ జేఏసీ, విద్యార్థి జేఏసీ నేతలు నిర్ణయించారు. సకల జనభేరి సందర్భంగా రాజకీయ జేఏసీ కో చైర్మన్ వి.శ్రీనివాస్‌గౌడ్, విద్యార్థి జేఏసీ నేతల మధ్య తలెత్తిన విభేదాలకు ముగింపు పలికారు. టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు నివాసంలో రెండు జేఏసీల నేతలు బుధవారం సమావేశమయ్యారు. రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం, ముఖ్యనేతలు సి.విఠల్, వి.శ్రీనివాస్‌గౌడ్, అద్దంకి దయాకర్, కారెం రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నేతలు బి.వినోద్‌కుమార్, బాల్క సుమన్, ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం, విద్యార్థి జేఏసీ నేతలు పిడమర్తి రవి, మధు తదితరులు చర్చల్లో పాల్గొన్నారు.
‘సకల జనభేరిలో విద్యార్థులను నిర్లక్ష్యం చేశారు. ఐదున్నర గంటలపాటు సభ జరిగితే 10 నిమిషాలైనా విద్యార్థులను మాట్లాడించే సమయంలేదా? పత్తా లేనివారెందరో సకల జనభేరిలో పెత్తనం చేశారు. విద్యార్థి నేతలను పిలిచి మాట్లాడిస్తామని చెప్పి అవమానించారు. దీనికి సమాధానం చెప్పకుండా శ్రీనివాస్‌గౌడ్ ఎలా బెదిరిస్తారు’ అని విద్యార్థి జేఏసీ నేతలు ఈ సందర్భంగా నిలదీశారు. దీనిపై రాజకీయ జేఏసీ నేతలు స్పందిస్తూ ‘‘సకల జనభేరిలో విద్యార్థులను మాట్లాడించకపోవడం బాధాకరమే. సభలోనూ, సభ తర్వాత జరిగిన పరిణామాలు కూడా బాధాకరం. ఇవి జరిగి ఉండాల్సినవి కావు. తెలంగాణ బిల్లు పార్లమెంటులోకి రాబోయే తరుణంలో ఉద్యమ శక్తుల మధ్య విభేదాలు ఎవరికీ మంచిది కాదు. ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేద్దాం. భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర పరిణామాలు జరగకుండా సమన్వయం చేసుకుందాం’’ అని ప్రతిపాదించారు.
మిగిలిన రాజకీయ జేఏసీ, టీఆర్‌ఎస్, ప్రజాసంఘాల జేఏసీ నేతలు కూడా విద్యార్థులను సముదాయించారు. దీంతో విద్యార్థులు, శ్రీనివాస్‌గౌడ్ పరస్పరం ఆలింగనం చేసుకుని సమస్యను ఇంతటితో వదిలేద్దామని నిర్ణయించారు. అనంతరం పలువురు నేతలు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులే ఊపిరి అని, భవిష్యత్తులోనూ విద్యార్థుల పోరాటాలు, నిబద్ధత ఉద్యమానికి చాలా అవసరమని కేశవరావు, బి.వినోద్ అన్నారు. భవిష్యత్తులో అన్ని జేఏసీలతో కలసి పనిచేస్తామని, హైదరాబాద్‌లో వైఎస్సార్‌సీపీ సమైక్య సభను అడ్డుకుంటామని పిడమర్తి రవి చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ సభకు అనుమతిని ఇస్తే ఉద్యోగులంతా సహాయ నిరాకరణకు దిగుతామని శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. హైదరాబాద్‌లో సభను పెడతామంటే యుద్ధం జరిగి తీరుతుందని గజ్జెల కాంతం చెప్పారు.