V. srinivas goud
-
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర యువజన వ్యవహారాలు & రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ.శ్రీనివాస్‌గౌడ్‌కు మంగళవారం హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేయాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఎన్నికల అఫిడవిట్లో శ్రీనివాస్‌గౌడ్ తప్పుడు ధ్రుృవపత్రాలు సమర్పించారని, శ్రీనివాసగౌడ్ ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి పిటిషన్ వేశాడు. అయితే దీనిని కొట్టేయాలంటూ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. రాఘవేంద్రరాజు పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు, శ్రీనివాస్‌గౌడ్ దాఖలు చేసిన పిటిషన్‌ను మాత్రం కొట్టేసింది. ఇదిలా ఉంటే.. ఖమ్మం కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు తాజాగా అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: అప్పు చేయనిదే నడవని దుస్థితి తెలంగాణది! -
కేసీఆర్ రూపొందించిన సినిమా అట్టర్ ప్లాప్: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర అంటూ కేసీఆర్ రూపొందించిన సినిమా అట్టర్ ప్లాప్ అయ్యిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఈ సినిమాలో నటీనటులంతా జీవించినా... కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా ఫెయిలైందన్నారు. ఎఫ్ఐఆర్ లేదా రిమాండ్ రిపోర్ట్‌లో ఎక్కడా బీజేపీ నేతలు డీకే ఆరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి పేర్లు లేకపోయినా టీఆర్ఎస్ నేతలు వారిపై ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టారు. గురువారం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ అంశంపై ఉన్నతస్థాయి విచారణ సంస్థలను ఆశ్రయిస్తామని, మొత్తం వ్యవహారం నిగ్గు తేలేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఎన్నికల వ్యూహకర్త పాత్ర ఏమిటి? సీఎం స్వయంగా ఈ కుట్రకు తెరదీశారా? అనే దానిపైనా విచారణ జరపాలన్నారు. అవినీతి ఆరోపణలున్న మంత్రిని కాపాడబోయి సీఎం మరిన్ని తప్పులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో కొందరు ఐపీఎస్‌లు వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే బాధ కలుగుతోందని, ప్రభుత్వం కొమ్ము కాస్తూ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎవరైతే మంత్రి అక్రమాలపై పూర్తి ఆధారాలతో కోర్టులు, ఎన్నికల కమిషన్‌ను.. తమ హత్యకు కుట్ర జరుగుతోందని మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారో వారే హత్యకు కుట్ర పన్నారంటూ పోలీసులు కేసు పెట్టడం ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. నిర్మల్‌లో సాజిద్ ఖాన్ అనే వ్యక్తి 16 ఏళ్ల బాలికను డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తానని ఆశ చూపి అత్యాచారం చేస్తే పట్టుకోడానికి పోలీసులకు వారం రోజులు పడితే, మంత్రి హత్యకు కుట్ర పన్నారంటూ ఒక్కరోజులోనే ఢిల్లీపోయి కొందరిని పట్టుకొచ్చారని అన్నారు. చదవండి: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. డీకే అరుణ, జితేందర్ రెడ్డి రియాక్షన్ రాష్ట్ర పోలీసుల తీరుపై తాము ఫిర్యాదు చేస్తే ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారని, ఈ విచారణను రాష్ట్ర పోలీసులు ఎదుర్కోవాల్సి వస్తుందనే కనీస సోయి కూడా లేదా? అని నిలదీశారు. ‘ఢిల్లీలో కిడ్నాప్‌నకు గురైన వారి అకామిడేషన్ నా పేరు మీదే ఉంది. ప్రజల్లో తిరిగే వాళ్లం. ఎవరైనా ఢిల్లీకి వస్తే వాళ్లకు ఆశ్రయమిస్తాం. భోజనం పెడతాం’అని ఒక ప్రశ్నకు సంజయ్ బదులిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, రవీంద్రనాయక్, జి.ప్రేమేందర్‌రెడ్డి, డి.ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు. చదవండి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్ర: ‘కిడ్నాప్’ల వ్యవహారంలో సంచలన మలుపు -
మా ఇంటికి ఎవరొచ్చినా బస కల్పించడం నా బాధ్యత: జితేందర్‌రెడ్డి
-
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. డీకే అరుణ రియాక్షన్
-
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. డీకే అరుణ, జితేందర్ రెడ్డి రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో బీజేపీ నేతలపై ఆరోపణలు రావడంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను హత్య చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని పేర్కొన్నారు. కేసు వెనక రాజకీయ, ప్రభుత్వ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పే వారిపై కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. శ్రీనివాస్ గౌడ్, పోలీసులు కథ రక్తి కట్టిస్తున్నారని, మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ వేయాలన్నారు. కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. పోలీసుల అదుపులో ఉన్నవారంతా ఒకప్పుడు మంత్రి అనుచరులేనని, వారితో తమకెలాంటి సంబంధం లేదన్నారు. సుపారీ ఇవ్వగలిగే శక్తి టీఆర్ఎస్ నేతలకు తప్ప ఎవరికీ లేదన్నారు. మున్నూరు రవిపై ఎక్కడా ఆరోపణలు లేవు మరోవైపు మాజీ ఎంపీ జితేంతర్ రెడ్డి మాట్లాడుతూ.. మున్నూరు రవి తమ ఇంటికి రావడం ఇదేం తొలిసారి కాదని అన్నారు. మహబూబ్‌నగర్ నుంచి ఢిల్లీకి కార్యకర్తలు ఎవరొచ్చినా అతిథ్యం ఇస్తానని తెలిపారు. ఉద్యమ కారులకు వసతి కల్పించడం తన బాధ్యత అని అన్నారు. మున్నూరు రవిపై ఎక్కడా ఆరోపణలు లేవని, క్రిమినల్ చర్రిత లేదని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఢిల్లీ నాయకత్వానికి వివరిస్తున్నామని తెలిపారు. బీజేపీ నేతలపై కక్ష తీర్చుకునేందుకు ఈ ప్లాన్ అని విమర్శించారు. తాను విచారణకు సిద్దమేనని, దీనిపై సమగ్ర విచారణ చేయాలని కోరారు. ప్రభుత్వానికి సీబీఐపై నమ్మకం లేకుంటే రిటైర్డ్ జడ్జీతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. జితేందర్‌రెడ్డి ఇంటిపై దాడి ఇదిలా ఉండగా.. మహబూబ్‌నగర్‌లోని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఇంటిపై దాడి చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఆయన ఇంట్లోని కారు అద్దాలు ధ్వంసం చేశారు. గేటు ముందు టైర్‌ను తగల బెట్టారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని జితేందర్‌రెడ్డి తన ట్విటర్‌లోషేర్ చేశారు. ఢిల్లీలోని తన నివాసంలో కిడ్నాప్ ఘటన అనంతరం మహబూబ్‌నగర్‌లో దుండగులు తన ఇంటిపై దాడి చేసి బెదిరించారని ఈ విషయంపై మహబూబ్‌నగర్ పోలీసులకు, డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కాగా మహబూబ్‌నగర్‌కు చెందిన నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్‌లు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నారని, వీరిని జితేందర్ రెడ్డి సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉన్నట్లు తేలడంతో అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపిన విషయం తెలిసిందే. జితేందర్ రెడ్డి డ్రైవర్, పీఏ రాజు వీరికి షెల్టర్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ఈ హత్య కుట్రకు సంబంధించి జితేందర్‌రెడ్డి పాత్రపై కూడా విచారణ జరుతామని సీపీ ఎవల్లడించారు. ఈ నేపథ్యంలోనే జితేందర్‌రెడ్డి ఇంటిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. -
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యకు కుట్ర జరిగిందని, దీనికి సంబంధించి ఎనిమిది మందిని అరెస్టు చేశామని సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నిందితులు హత్యకు ప్రణాళిక వేశారని.. రూ.15 కోట్లకు సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. కానీ కుట్ర బయటపడుతుందన్న అనుమానంతో.. సుపారీ గ్యాంగ్‌లోని వారిని హత్య చేసేందుకు నిందితులు ప్రయత్నించారని, దీనితో అసలు విషయం బయటపడిందని వివరించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాఘవేందర్‌రాజు, చాలువాగ్ నాగరాజు, వర్ద యాదయ్య, భండేకర్ విశ్వనాథ్, మున్నూరు రవి, మధుసూదన్‌రాజు, అమరేందర్‌రాజు, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కారు డ్రైవర్ థాపాలను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర బుధవారం రాత్రి మీడియాకు వెల్లడించారు. ఆ వివరాల మేరకు.. పాత నేరస్తులు కలిసి.. మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేందర్‌రాజు, శంషాబాద్‌కు చెందిన ఫరూక్ అహ్మద్ పాత నేరస్తులు. గత ఏడాది నవంబర్ 18న వారిద్దరూ.. మహబూబ్‌నగర్ కోర్టులో కలిశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను హత్య చేసే ఉద్దేశంతో ఉన్న రాఘవేందర్‌రాజు.. కోర్టు ఆవరణలోనే ఈ విషయాన్ని ఫరూక్‌కు వివరించాడు. ఆ హత్యను ఫరూక్, అతడి గ్యాంగ్ చేసినా సరేనని.. లేదా ఆ పని చేయగలిగే వేరే వాళ్లనైనా తమకు పరిచయం చేయాలని కోరాడు. మంత్రిని హత్య చేసేందుకు రూ.15 కోట్లు ఇస్తామని డీల్ కుదుర్చుకున్నాడు. కానీ తర్వాత భయపడిన ఫరూక్.. ఈ విషయాన్ని తన స్నేహితుడు మహబూబ్‌నగర్‌కు చెందిన హైదర్ అలీకి చెప్పాడు. దీనితో విషయం బయటపడుతుందేమోనని భావించిన రాఘవేందర్‌రాజు.. ఫరూక్, హైదర్అలీ ఇద్దరినీ చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఎలా బయటపడింది? ఫరూక్, హైదర్ అలీ ఇద్దరూ గత నెల 23న సుచిత్ర దగ్గర ఓ లాడ్జిలో దిగారు. 25న మధ్యాహ్నం 2 గంటలకు వారు టీ తాగేందుకు బయటికి వచ్చారు. ఆ సమయంలో మహబూబ్‌నగర్‌కు చెందిన నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్, మరికొందరు కలిసి వారిని చంపేందుకు కత్తులతో వెంబడించారు. వారి నుంచి తప్పించుకున్న ఫరూక్, హైదర్అలీ.. సాయంత్రం 5 గంటల సమయంలో పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. 26న యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్‌లను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. 27న నాగరాజును కస్టడీలోకి తీసుకుని విచారించగా.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను హత్య చేసేందుకు జరిగిన కుట్ర బయటపడింది. మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేందర్‌రాజు మరికొందరితో కలిసి మంత్రిని హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని నాగరాజు వాంగ్మూలంలో వివరించాడు. ఈ వివరాలతోపాటు నిందితుల ఫోన్ లొకేషన్ ఆధారంగా.. రాఘవేందర్‌రాజు, మున్నూరు రవి, మధుసూదన్‌రాజు ముగ్గురూ ఢిల్లీలోని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఢిల్లీ వెళ్లి వారిని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఇక్కడ వారిని విచారించగా కుట్ర పూర్తి వివరాలు బయటపడ్డాయి. మహబూబ్‌నగర్ టు ఢిల్లీ.. వయా వైజాగ్.. రాఘవేందర్‌రాజు, మున్నూరు రవి, మధుసూదన్‌రాజు, అమరేందర్‌రాజు అంతా కలిసి ముందుగా మహబూబ్‌నగర్ నుంచి విశాఖపట్నానికి.. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లినట్టు ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. వారికి బీజేపీ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పీఏ రాజు, డ్రైవర్ థాపా కలిసి.. ఢిల్లీ సౌత్ అవెన్యూలోని సర్వర్ క్వార్టర్స్‌లో షెల్టర్ ఏర్పాటు చేశారని సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. నిందితులకు షెల్టర్ ఇచ్చిన వారికి నోటీసులు ఇచ్చామని.. అందులో థాపాను అరెస్టు చేయగా, పీఏ రాజు పరారీలో ఉన్నాడని తెలిపారు. మంత్రి హత్య డీల్‌కు సంబంధించిన రూ.15 కోట్లను మధుసూదన్‌రాజు, అమరేందర్‌రాజు సమకూరుస్తామని చెప్పినట్టుగా తేలిందని సీపీ వివరించారు. రాఘవేందర్‌రాజు నుంచి 9 ఎంఎం పిస్టల్, రెండు తూటాలను.. మున్నూరు రవి నుంచి ఒక రివాల్వర్, 6 రౌండ్ల తూటాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. నిందితులు ఈ ఆయుధాలను దుండిగల్ అటవీ ప్రాంతంలో దాచిపెట్టారని, వారు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ ఆయుధాలను ఉత్తరప్రదేశ్ నుంచి కొనుగోలు చేసినట్టు నిందితులు చెప్పారని, ఎవరి వద్ద కొన్నారనేది ఇంకా తేలాల్సి ఉందని సీపీ వివరించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అనుచరులకు కూడా ఈ వ్యవహారంలో హస్తమున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. నిందితులను క్షుణ్నంగా విచారించి, పూర్తి వివరాలను రాబడతామని ప్రకటించారు. తప్పుల్ని బయటపెట్టిన వారిపైనే.. పోలీసులు పెట్టిన తప్పుడు కేసుపై హైకోర్టును ఆశ్రయిస్తాం. సామాజిక బాధ్యతగా ఆర్టీఐ ద్వారా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుల్ని బయటపెట్టిన యువకులపైనే మంత్రి హత్యకు కుట్ర అంటూ కేసులు పెట్టారు. – బీజేపీ నేత ఏపీ జితేందర్‌రెడ్డి సీబీఐతో విచారణ జరిపించాలి.. రాష్ట్ర మంత్రిపై హత్యకు కుట్ర అనేది చాలా పెద్ద విషయం. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో నిజానిజాలు తెలియాలంటే సీబీఐతో విచారణ జరిపించాలి. లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి. అన్నీ అవాస్తవాలు, అభూత కల్పనలతో కథ అల్లి నాపై కుట్ర ఆరోపణలు మోపడం సరికాదు. సీపీ స్టీఫెన్ రవీంద్రకు ఉమ్మడి ఏపీ నాటి నుంచి మంచి పేరు ఉంది. ఆయన లాంటి వ్యక్తి అబద్ధాలు మాట్లాడడం తగదు. – బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ -
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మాతృ వియోగం
పాలమూరు: ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాతృ మూర్తి శాంతమ్మ (70) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఆమె తుదిశ్వాస విడిచారు. శనివారం ఉదయం ఆమె పార్థివదేహాన్ని మహబూబ్‌నగర్‌లోని మంత్రి నివాసానికి తరలించారు. సాయంత్రం పాలకొండ సమీపంలోని మంత్రి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర ప్రజాప్రతి నిధులు శాంతమ్మకు నివాళి అర్పించి.. శ్రీనివాస్‌గౌడ్‌ను పరా మర్శించారు. కాగా, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తండ్రి నారాయణగౌడ్ ఈ ఏడాది ఫిబ్రవరి 14న మరణించారు. శాంతమ్మ మృతితో మంత్రి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీనివాస్‌గౌడ్ మాతృమూర్తికి గవర్నర్, సీఎం సంతాపం సాక్షి, హైదరాబాద్: ఆబ్కారీ శాఖమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ మరణం పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపారు. -
పాలమూరుకు వరం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
సాక్షి, మహబూబ్‌నగర్ : వెనుకబడిన, వలసల జిల్లా పాలమూరుకు తెలంగాణలో మొదటి మెడికల్ కళాశాల రావడం మనకు ఒక వరమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. గురువారం స్థానికంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అంతుబట్టని రోగాలు పెరుగుతున్న ఈ సమయంలో డాక్టర్లు నిత్య విద్యార్థిగా పరిశోధనలు చేయాలని సూచించారు. పేదరికంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. అలాగే, మెడికల కళాశాల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేసి సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. -
ఉద్యోగుల మధ్య చిచ్చుపెడ్తారా: శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికే కరెంటు, నీళ్ల విషయంలో చిచ్చు రేగుతోందని, తాజాగా ఉద్యోగుల మధ్య కూడా చిచ్చు రేపుతారా? అని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. ఉద్యోగుల విభజనలో జాప్యం, కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలపై ఆయన మండిపడ్డారు. గురువారం సచివాలయంలో ఉద్యోగ సంఘాల నాయకులు దేవీప్రసాద్, విఠల్‌తోపాటు వివిధ ఉద్యోగుల సంఘాల నాయకులు సీఎస్ రాజీవ్‌శర్మ, ఉద్యోగుల విభజన కమిటీ చైర్మన్ కమలనాథన్‌ను కలసి వినతి పత్రాలు ఇచ్చారు. అనంతరం దేవీప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 31వ తేదీలోగా ఉద్యోగుల విభజనను పూర్తిచేయకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఉద్యోగుల సమాచారం ఇవ్వడంలో ఆయా విభాగాల అధిపతులు జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. -
తెలంగాణకు వ్యతిరేకంగా ‘కమలనాథన్’ గైడ్‌లైన్స్
ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ సాక్షి, హైదరాబాద్: కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు తెలంగాణ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉన్నాయని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ చైర్మన్, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయిల్లోని ఆంధ్రా ఉద్యోగుల విభజన విషయమై కమిటీ ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని, ఇది తెలంగాణకు జరుగుతున్న మరో అన్యాయమన్నారు. శుక్రవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా స్థాయిల్లో 20, జోనల్ స్థాయిలో 30 శాతం ఆంధ్రాఉద్యోగులు ఉన్నారని, వీరిని స్థానికత ఆధారంగా విభజన చేయాలన్నారు. కమిటీ సిఫారసుల్లో ఈ అంశం లేనందున వారంతా స్థానికులుగా మారే ప్రమాదం ఉందన్నారు. -
తెలంగాణకు న్యాయమైన వాటా రావాలి: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ఒక దశ మాత్రమే పూర్తయిందని, పోరాటం ఇంకా ముగియలేదని టీఆర్ఎస్ నేత హరీష్‌రావు అన్నారు. పార్టీ నేతలు కె.స్వామిగౌడ్, వి.శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి తెలంగాణ భవన్లో ఏర్పాటైన వార్‌రూం కార్యకలాపాలను శుక్రవారం ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, ఉద్యోగాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా రావాలని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ సాకారమయ్యేదాకా పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. పంపిణీ జరుగుతున్నప్పుడు అనుసరిస్తున్న వైఖరితోనే కాంగ్రెస్, టీడీపీ నేతల నైజం బయటపడుతోందని హరీష్ వ్యాఖ్యానించారు. ఉద్యోగుల స్థానికత, అక్రమాలు, వాస్తవాలపై టీఆర్ఎస్ కార్యాలయంలోని కమిటీకి ప్రత్యక్షంగా కానీ, కొరియర్ లేదా ఈమెయిల్ (trswarroom@gmail.com)ద్వారా సమాచారం అందించవచ్చునని హరీష్ రావు తెలిపారు. -
ఈ సమయంలో వివాదాలొద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ కీలకదశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో వివాదాలు ఉద్యమానికి మంచిది కాదని, భవిష్యత్తులో ఇలాంటివి జరుగకుండా అందరం కలిసి పనిచేద్దామని తెలంగాణ రాజకీయ జేఏసీ, విద్యార్థి జేఏసీ నేతలు నిర్ణయించారు. సకల జనభేరి సందర్భంగా రాజకీయ జేఏసీ కో చైర్మన్ వి.శ్రీనివాస్‌గౌడ్, విద్యార్థి జేఏసీ నేతల మధ్య తలెత్తిన విభేదాలకు ముగింపు పలికారు. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు నివాసంలో రెండు జేఏసీల నేతలు బుధవారం సమావేశమయ్యారు. రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం, ముఖ్యనేతలు సి.విఠల్, వి.శ్రీనివాస్‌గౌడ్, అద్దంకి దయాకర్, కారెం రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నేతలు బి.వినోద్‌కుమార్, బాల్క సుమన్, ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం, విద్యార్థి జేఏసీ నేతలు పిడమర్తి రవి, మధు తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. ‘సకల జనభేరిలో విద్యార్థులను నిర్లక్ష్యం చేశారు. ఐదున్నర గంటలపాటు సభ జరిగితే 10 నిమిషాలైనా విద్యార్థులను మాట్లాడించే సమయంలేదా? పత్తా లేనివారెందరో సకల జనభేరిలో పెత్తనం చేశారు. విద్యార్థి నేతలను పిలిచి మాట్లాడిస్తామని చెప్పి అవమానించారు. దీనికి సమాధానం చెప్పకుండా శ్రీనివాస్‌గౌడ్ ఎలా బెదిరిస్తారు’ అని విద్యార్థి జేఏసీ నేతలు ఈ సందర్భంగా నిలదీశారు. దీనిపై రాజకీయ జేఏసీ నేతలు స్పందిస్తూ ‘‘సకల జనభేరిలో విద్యార్థులను మాట్లాడించకపోవడం బాధాకరమే. సభలోనూ, సభ తర్వాత జరిగిన పరిణామాలు కూడా బాధాకరం. ఇవి జరిగి ఉండాల్సినవి కావు. తెలంగాణ బిల్లు పార్లమెంటులోకి రాబోయే తరుణంలో ఉద్యమ శక్తుల మధ్య విభేదాలు ఎవరికీ మంచిది కాదు. ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేద్దాం. భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర పరిణామాలు జరగకుండా సమన్వయం చేసుకుందాం’’ అని ప్రతిపాదించారు. మిగిలిన రాజకీయ జేఏసీ, టీఆర్ఎస్, ప్రజాసంఘాల జేఏసీ నేతలు కూడా విద్యార్థులను సముదాయించారు. దీంతో విద్యార్థులు, శ్రీనివాస్‌గౌడ్ పరస్పరం ఆలింగనం చేసుకుని సమస్యను ఇంతటితో వదిలేద్దామని నిర్ణయించారు. అనంతరం పలువురు నేతలు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులే ఊపిరి అని, భవిష్యత్తులోనూ విద్యార్థుల పోరాటాలు, నిబద్ధత ఉద్యమానికి చాలా అవసరమని కేశవరావు, బి.వినోద్ అన్నారు. భవిష్యత్తులో అన్ని జేఏసీలతో కలసి పనిచేస్తామని, హైదరాబాద్‌లో వైఎస్సార్సీపీ సమైక్య సభను అడ్డుకుంటామని పిడమర్తి రవి చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ సభకు అనుమతిని ఇస్తే ఉద్యోగులంతా సహాయ నిరాకరణకు దిగుతామని శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. హైదరాబాద్‌లో సభను పెడతామంటే యుద్ధం జరిగి తీరుతుందని గజ్జెల కాంతం చెప్పారు. -
లూటీకే యూటీ అంటున్నారు : శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, న్యూస్‌లైన్: లూటీ చేసేందుకే సీమాంధ్రులు హైదరాబాద్‌ను యూటీ చేయాలని కోరుతున్నారని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేస్తే యుద్ధమే అని హెచ్చరించారు. సోమవారం నాంపల్లిలోని తెలంగాణ గజిటెడ్ భవన్లో సకలజనభేరి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సీమాంధ్ర నాయకులు కండ కావరంతో, కళ్తు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు ఎంతో సహనంతో ఉన్నామని, హైదరాబాద్ లో సమావేశం పెట్టినా ఓర్చుకున్నామని చెప్పారు. కానీ అధర్మం, అసత్యం పునాదుల మీద తెలంగాణ ఉద్యమం ఉందంటూ మాట్లాడితే సహించేది లేదన్నారు. అసత్యపు పునాదుల మీద తెలంగాణ ఉద్యమం నడిస్తే 50ఏళ్లకు పైబడి ఎలా నడుస్తుందని ప్రశ్నించారు. ‘50 రోజుల క్రితం వరకు ప్రజలకు ఎవరో కూడా తెలియని నీవా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడేది..’ అంటూ ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్షుడిపై పరోక్షంగా నిప్పులు చెరిగారు. ‘ఇంటర్ వరకు చదివి మధ్యలోనే చదువు ఆపేసిన నీవు చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడొద్దు..’ అని అన్నారు. బానిస బతుకులంటూ అవమానపరిచే విధంగా మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు. తాము అనుకుంటే హైదరాబాద్‌లో ఏఒక్క సీమాంధ్రుడూ ఉండలేడని హెచ్చరిం చారు. హైదరాబాద్‌ను యూటీ చేసినా కామన్ క్యాపిటల్ చేసినా ఇంకా కలిసి ఉండే ప్రసక్తే లేదన్నారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టొద్దని హితవు పలికారు. అనంతరం పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.