సాక్షి, హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో బీజేపీ నేతలపై ఆరోపణలు రావడంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను హత్య చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని పేర్కొన్నారు. కేసు వెనక రాజకీయ, ప్రభుత్వ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పే వారిపై కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. శ్రీనివాస్ గౌడ్, పోలీసులు కథ రక్తి కట్టిస్తున్నారని, మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ వేయాలన్నారు. కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. పోలీసుల అదుపులో ఉన్నవారంతా ఒకప్పుడు మంత్రి అనుచరులేనని, వారితో తమకెలాంటి సంబంధం లేదన్నారు. సుపారీ ఇవ్వగలిగే శక్తి టీఆర్‌ఎస్ నేతలకు తప్ప ఎవరికీ లేదన్నారు.
మున్నూరు రవిపై ఎక్కడా ఆరోపణలు లేవు
మరోవైపు మాజీ ఎంపీ జితేంతర్ రెడ్డి మాట్లాడుతూ.. మున్నూరు రవి తమ ఇంటికి రావడం ఇదేం తొలిసారి కాదని అన్నారు. మహబూబ్‌నగర్ నుంచి ఢిల్లీకి కార్యకర్తలు ఎవరొచ్చినా అతిథ్యం ఇస్తానని తెలిపారు. ఉద్యమ కారులకు వసతి కల్పించడం తన బాధ్యత అని అన్నారు. మున్నూరు రవిపై ఎక్కడా ఆరోపణలు లేవని, క్రిమినల్ చర్రిత లేదని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఢిల్లీ నాయకత్వానికి వివరిస్తున్నామని తెలిపారు. బీజేపీ నేతలపై కక్ష తీర్చుకునేందుకు ఈ ప్లాన్ అని విమర్శించారు. తాను విచారణకు సిద్దమేనని, దీనిపై సమగ్ర విచారణ చేయాలని కోరారు. ప్రభుత్వానికి సీబీఐపై నమ్మకం లేకుంటే రిటైర్డ్ జడ్జీతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
జితేందర్‌రెడ్డి ఇంటిపై దాడి
ఇదిలా ఉండగా.. మహబూబ్‌నగర్‌లోని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఇంటిపై దాడి చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఆయన ఇంట్లోని కారు అద్దాలు ధ్వంసం చేశారు. గేటు ముందు టైర్‌ను తగల బెట్టారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని జితేందర్‌రెడ్డి తన ట్విటర్‌లోషేర్ చేశారు. ఢిల్లీలోని తన నివాసంలో కిడ్నాప్ ఘటన అనంతరం మహబూబ్‌నగర్‌లో దుండగులు తన ఇంటిపై దాడి చేసి బెదిరించారని ఈ విషయంపై మహబూబ్‌నగర్ పోలీసులకు, డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
కాగా మహబూబ్‌నగర్‌కు చెందిన నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్‌లు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నారని, వీరిని జితేందర్ రెడ్డి సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉన్నట్లు తేలడంతో అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపిన విషయం తెలిసిందే. జితేందర్ రెడ్డి డ్రైవర్, పీఏ రాజు వీరికి షెల్టర్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ఈ హత్య కుట్రకు సంబంధించి జితేందర్‌రెడ్డి పాత్రపై కూడా విచారణ జరుతామని సీపీ ఎవల్లడించారు. ఈ నేపథ్యంలోనే జితేందర్‌రెడ్డి ఇంటిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment