ఉద్యోగుల మధ్య చిచ్చుపెడ్తారా: శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికే కరెంటు, నీళ్ల విషయంలో చిచ్చు రేగుతోందని, తాజాగా ఉద్యోగుల మధ్య కూడా చిచ్చు రేపుతారా? అని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. ఉద్యోగుల విభజనలో జాప్యం, కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలపై ఆయన మండిపడ్డారు.
గురువారం సచివాలయంలో ఉద్యోగ సంఘాల నాయకులు దేవీప్రసాద్, విఠల్‌తోపాటు వివిధ ఉద్యోగుల సంఘాల నాయకులు సీఎస్ రాజీవ్‌శర్మ, ఉద్యోగుల విభజన కమిటీ చైర్మన్ కమలనాథన్‌ను కలసి వినతి పత్రాలు ఇచ్చారు. అనంతరం దేవీప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 31వ తేదీలోగా ఉద్యోగుల విభజనను పూర్తిచేయకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఉద్యోగుల సమాచారం ఇవ్వడంలో ఆయా విభాగాల అధిపతులు జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.