
యాత్రల్ని అడ్డుకోవడం మంచిది కాదు: నారాయణ
ప్రజాస్వామ్యంలో రాజకీయ యాత్రల్ని, కార్యక్రమాలను అడ్డుకోవడం సమంజసం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో రాజకీయ యాత్రల్ని, కార్యక్రమాలను అడ్డుకోవడం సమంజసం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కెనారాయణ అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సహా ఎవ్వరి యాత్రలకు ఆటంకం కలిగించినా ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసినట్టేనని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరి రాజకీయ అభిప్రాయాలను వారు చెప్పుకోవడం ప్రజాస్వామ్య హక్కుగా గుర్తించాలని పేర్కొన్నారు. ఏది మంచో ఏది చెడో ప్రజలే అంతిమంగా నిర్ణయిస్తారని తెలిపారు.
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం ఆడుతున్న ఆటలో భాగంగానే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నడుచుకుంటున్నారని నారాయణ అంతకుముందు ఆరోపించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపైనే ఉందని అన్నారు.