సాక్షి, హైదరాబాద్: ఒకే వాహనాన్ని ఇద్దరి పేరిట రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యమేనా? సాధారణంగా అయితే సాధ్యం కాదు. కానీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో డబుల్ రిజిస్ట్రేషన్లు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. రవాణా శాఖ అధికారులు, కొంత మంది ప్రైవేటు వ్యక్తులు కుమ్మక్కై ఈ దందా నడుపుతున్నారని సమాచారం. వాహనాన్ని చూసి, దాన్ని ఛాసిస్ నంబర్‌ను కాపీ చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేస్తారు.
ఒకసారి రిజిస్టర్ చేసిన వాహనాన్ని అదే నంబర్‌తో మరో వ్యక్తి పేరిట రిజిస్టర్ చేయడం సాధ్యం కాదు. అయినా, అధికారుల అండదండలతో డబుల్ రిజిస్ట్రేషన్ చేయించడం పరిపాటిగా మారింది. ఫైనాన్స్ కంపెనీల నుంచి అక్రమంగా రుణాలు తీసుకోవడం, వాహనం అసలు యజమానిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూలు చేయడం జరుగుతోంది. అక్రమార్కులు సంపాదించిన అవినీతి సొమ్ములో నుంచి రవాణా అధికారులకు వాటాలు అందుతున్నట్లు సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వందల సంఖ్యలో డబుల్ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు బాధితులు వాపోతున్నారు.
ఒకే రోజు ఇద్దరి పేర్లతో రిజిస్ట్రేషన్!
మారుతి ఆల్టో కారును జ్యోతి కిరణ్మయి ‘మిత్ర ఏజన్సీ’లో 2008 డిసెంబర్ 23న కొన్నారు. 2009 జనవరి 12న ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించగా ‘ఏపీ 09 బీఎస్ 3044’ నంబర్‌ను కేటాయించారు. ఇటీవల కారును విక్రయించడానికి ఆమె ప్రయత్నించగా కారు ఆమె పేరిట లేదని బ్రోకర్ చెప్పడంతో అవాక్కయ్యారు. ఆన్‌లైన్‌లో చూస్తే, ఈ నంబరు కారు యజమాని కిరణ్‌కుమార్‌గా రిజిస్టర్ అయి ఉన్నట్లు గుర్తించారు. కారు కొనడానికి జ్యోతి కిరణ్మయి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రుణం తీసుకున్నారు. కానీ.. కిరణ్‌కుమార్ ‘విష్ణుప్రియ ఆటో ఫైనాన్స్’ నుంచి రుణం తీసుకున్నట్లు రవాణా శాఖ వెబ్‌సైట్ చెబుతోంది. ఆమె రిజిస్ట్రేషన్ చేయించిన రోజే రెండో రిజిస్ట్రేషన్ కూడా జరిగినట్లు వెబ్‌సైట్‌లో నమోదై ఉండటం గమనార్హం.
రవాణా శాఖలో ‘డబుల్ రిజిస్ట్రేషన్’
Published Fri, Sep 13 2013 1:38 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM
Advertisement
Advertisement