అనుమానాలు | dought | Sakshi
Sakshi News home page

అనుమానాలు

Published Sat, May 2 2015 3:13 AM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM

dought

యూనివర్సిటీ:  నత్తకు నడక నేర్పిన చందంగా తయారైంది ఎస్కేయూ యంత్రాంగం తీరు. గత ఏడాది నవంబర్ 13న శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఆర్థిక విభాగంలో వెలుగులోకి వచ్చిన జీతాల కుంభకోణంపై ప్రొఫెసర్ల కమిటీని నియమించారు. దీనికి తోడు  జీతాల కుంభకోణాన్ని నిగ్గు తేల్చడానికి అత్యున్నత స్థాయి దర్యాప్తు సంస్థ ఏసీబీకి అప్పగించినట్లు ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ నీలం సహాని డిసెంబర్ 6 న ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తు చేపడుతున్న వర్సిటీ అంతర్గత కమిటీ అయిన ప్రొఫెసర్ల కమిటీ  డిసెంబర్ 27న సిపార్సులు, చేపట్టాల్సిన చర్యలతో కూడిన సమగ్ర నివేదికను అందించింది. మరో వైపు ఉన్నత విద్యాశాఖ సిపార్సులు చేసిన ఏసీబీ తన దర్యాప్తుకు ఇంత వరకు స్పందించలేదు. ఇందుకు నిబంధనలు అడ్డు తగలడమేనని నిపుణులు భావిస్తున్నారు. సీబీసీఐడైనా దర్యాప్తు చేపడుతుందా అనుకుంటే ఆ అవకాశాలు లేవని తెలుస్తోంది.
 
 అన్నీ కొర్రీలే : ఏసీబీ వారు కేసును తమ పరిధిలోకి తీసుకోవాలంటే ఆర్థిక నేరం రూ.10 కోట్లకు మించి ఉండాలి. ఆపరేషన్ అవినీతికి పాల్బడిన సమయంలోనే వారు నిఘా ఉంచి అరెస్ట్ చేయగలగాలి. అయితే ఎస్కేయూ కుంభకోణం రూ.3.07 కోట్లు జరిగినట్లు కమిటీ నిగ్గుతేల్చింది. మరో వైపు సీబీసీఐడీ దర్యాప్తు చేపట్టాలంటే నేరం జిల్లాను దాటి ఇతర జిల్లాలో కూడా జరిగి ఉండాలి.
 
 దీంతో ఏసీబీ, సీబీసీఐడీ దర్యాప్తు సంస్థలు చేపట్టడానికి నిబంధనలు అడ్డు తగలడంతో ప్రొఫెసర్ల కమిటీ నివేదికతోనే ముగించేస్తారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ కమిటీ నివేదికలో సశేషంగా మిగిలిన అంశాలన్నీ ఎవరు నిగ్గుతేలుస్తారు? ఇంకా అక్రమార్కులు ఉన్నారని సూత్రప్రాయంగా ప్రొఫెసర్ల కమిటీ నివేదిక వెల్లడించినప్పటికీ ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టకపోతే కుంభకోణం పాత్రధారులు వైట్‌కాలర్ నేరగాళ్లుగా మిగిలిపోతారని సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి.
 
 45 మంది అధికారులకు నోటీసులు: ఎస్కేయూలో 1103 మంది బోధన, బోధనేతర ఉద్యోగులు ఉన్నారు. 45 మంది అధికారులకు జీతాలు ఎక్కువ పడినట్లు నిర్ధారించి వారికి నోటీసులు జారీ చేశారు. మే 5 వతేదీ లోపుల వారు ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మీరాం నాయక్ ముందు వివరణ ఇవ్వాల్సి ఉందని అందులో స్పష్టం చేశారు. 2011 నుంచి బ్యాంకు స్టేట్‌మెంట్లుతో పాటు విచారణకు హాజరుకావాల్సి ఉందని తెలిపారు. అయితే ఇందులో ఎవరి ఖాతాల్లోను రూ.15 వేలకు మించలేదు. ఏ నెల అయితే అదనంగా జీతానికి జమ అయిందో అపుడే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లామని అందుకు తిఖిత పూర్వక ఆధారాలు ఉన్నాయని కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో వర్సిటీ ఖజానాకు గండి పడిన రూ.3.07 కోట్లను ఎలా భర్తీ చేస్తారు.. ఇందులో దాగి ఉన్న తక్కిన సూత్రధారుల నిగ్గు తేల్చాలంటే ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రూ.3.07 కోట్ల నష్టపోయిన ఫించనుదారులు, వర్సిటీ ఉద్యోగులకు న్యాయం చేయడానికి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తే మంచిదని కోరుతున్నారు. ఫ్రొఫెసర్ల కమిటీ నివేదికను బహిర్గతం చేయకుండా జాప్యం చేస్తుండడం పలు అనుమానాలకు ఊతం ఇచ్చేలా ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.    
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement