professor committee
-
అనుమానాలు
యూనివర్సిటీ: నత్తకు నడక నేర్పిన చందంగా తయారైంది ఎస్కేయూ యంత్రాంగం తీరు. గత ఏడాది నవంబర్ 13న శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఆర్థిక విభాగంలో వెలుగులోకి వచ్చిన జీతాల కుంభకోణంపై ప్రొఫెసర్ల కమిటీని నియమించారు. దీనికి తోడు జీతాల కుంభకోణాన్ని నిగ్గు తేల్చడానికి అత్యున్నత స్థాయి దర్యాప్తు సంస్థ ఏసీబీకి అప్పగించినట్లు ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ నీలం సహాని డిసెంబర్ 6 న ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తు చేపడుతున్న వర్సిటీ అంతర్గత కమిటీ అయిన ప్రొఫెసర్ల కమిటీ డిసెంబర్ 27న సిపార్సులు, చేపట్టాల్సిన చర్యలతో కూడిన సమగ్ర నివేదికను అందించింది. మరో వైపు ఉన్నత విద్యాశాఖ సిపార్సులు చేసిన ఏసీబీ తన దర్యాప్తుకు ఇంత వరకు స్పందించలేదు. ఇందుకు నిబంధనలు అడ్డు తగలడమేనని నిపుణులు భావిస్తున్నారు. సీబీసీఐడైనా దర్యాప్తు చేపడుతుందా అనుకుంటే ఆ అవకాశాలు లేవని తెలుస్తోంది. అన్నీ కొర్రీలే : ఏసీబీ వారు కేసును తమ పరిధిలోకి తీసుకోవాలంటే ఆర్థిక నేరం రూ.10 కోట్లకు మించి ఉండాలి. ఆపరేషన్ అవినీతికి పాల్బడిన సమయంలోనే వారు నిఘా ఉంచి అరెస్ట్ చేయగలగాలి. అయితే ఎస్కేయూ కుంభకోణం రూ.3.07 కోట్లు జరిగినట్లు కమిటీ నిగ్గుతేల్చింది. మరో వైపు సీబీసీఐడీ దర్యాప్తు చేపట్టాలంటే నేరం జిల్లాను దాటి ఇతర జిల్లాలో కూడా జరిగి ఉండాలి. దీంతో ఏసీబీ, సీబీసీఐడీ దర్యాప్తు సంస్థలు చేపట్టడానికి నిబంధనలు అడ్డు తగలడంతో ప్రొఫెసర్ల కమిటీ నివేదికతోనే ముగించేస్తారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ కమిటీ నివేదికలో సశేషంగా మిగిలిన అంశాలన్నీ ఎవరు నిగ్గుతేలుస్తారు? ఇంకా అక్రమార్కులు ఉన్నారని సూత్రప్రాయంగా ప్రొఫెసర్ల కమిటీ నివేదిక వెల్లడించినప్పటికీ ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టకపోతే కుంభకోణం పాత్రధారులు వైట్‌కాలర్ నేరగాళ్లుగా మిగిలిపోతారని సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. 45 మంది అధికారులకు నోటీసులు: ఎస్కేయూలో 1103 మంది బోధన, బోధనేతర ఉద్యోగులు ఉన్నారు. 45 మంది అధికారులకు జీతాలు ఎక్కువ పడినట్లు నిర్ధారించి వారికి నోటీసులు జారీ చేశారు. మే 5 వతేదీ లోపుల వారు ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మీరాం నాయక్ ముందు వివరణ ఇవ్వాల్సి ఉందని అందులో స్పష్టం చేశారు. 2011 నుంచి బ్యాంకు స్టేట్మెంట్లుతో పాటు విచారణకు హాజరుకావాల్సి ఉందని తెలిపారు. అయితే ఇందులో ఎవరి ఖాతాల్లోను రూ.15 వేలకు మించలేదు. ఏ నెల అయితే అదనంగా జీతానికి జమ అయిందో అపుడే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లామని అందుకు తిఖిత పూర్వక ఆధారాలు ఉన్నాయని కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో వర్సిటీ ఖజానాకు గండి పడిన రూ.3.07 కోట్లను ఎలా భర్తీ చేస్తారు.. ఇందులో దాగి ఉన్న తక్కిన సూత్రధారుల నిగ్గు తేల్చాలంటే ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రూ.3.07 కోట్ల నష్టపోయిన ఫించనుదారులు, వర్సిటీ ఉద్యోగులకు న్యాయం చేయడానికి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తే మంచిదని కోరుతున్నారు. ఫ్రొఫెసర్ల కమిటీ నివేదికను బహిర్గతం చేయకుండా జాప్యం చేస్తుండడం పలు అనుమానాలకు ఊతం ఇచ్చేలా ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. -
డీ నోట్ లేకుండానే వేతనాల మంజూరా?
యూనివర్సిటీ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో వెలుగుచూసిన జీతాల కుంభకోణాన్ని నిగ్గుతేల్చడానికి వర్సిటీ అంతర్గత ప్రొఫెసర్ల కమిటీకి తోడుగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి నియమించిన ప్రత్యేక కమిటీ తన నివేదికను అందజేసింది. ఎస్కేయూ యంత్రాంగం చేసిన లోటుపాట్లపై సమగ్రంగా అధ్యయనం చేసిన కాగ్ రిటైర్డ్ అధికారి సుబ్రమణ్యం నివేదికను రిజిస్ట్రార్ ఆచార్య కే.దశరథరామయ్యకు గురువారం అందజేశారు. ప్రతి ఏటా కోట్ల లావాదేవీలు జరుగుతున్న వర్సిటీలో ఖాతాల నిర్వహణలో మౌలిక సూత్రాలు పాటించలేదని ఆయన తేల్చిచెప్పారు. ఇకముందు ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి సవివరంగా వివరించారు. గత కొన్నేళ్ల నుంచి డీనోట్‌పై రిజిస్ట్రార్ సంతకం చేయకుండా ఉండడం తప్పిదం అని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రూ.3.05 కోట్ల కుంభకోణం జరిగినట్లు తన నివేదికలో పేర్కొన్నారు. వర్సిటీ ఉద్యోగుల జీతాలలో కోత, అరియర్స్, పెన్షన్స్‌లో ఎంత దొరికితే అంత అన్నట్లుగా దారి మళ్లించినట్లు ప్రధానంగా వెల్లడించారు. ప్రతి ఉద్యోగి వివరాలు ఖాతా నంబరుతో సహా వివరంగా తెలియచేసిన డీనోట్‌పై ప్రతి నెలా ఫైనాన్స్ ఆఫీసర్‌తో సహా సంతకాలు చేయాల్సి ఉంటుందని తన సిపార్సులు వెలిబుచ్చారు. మరో వైపు ఫ్రొపెసర్ల కమిటీ తన పూర్తి నివేదికను వచ్చే వారంలో ఇవ్వనుంది. రిజిస్ట్రార్‌తో ఉద్యోగ సంఘాల వాగ్వాదం: ఎస్కేయూ ఉద్యోగులు తమ జీతాలు చెల్లించాలని రిజిస్ట్రార్ ఆచార్య కే.దశరథరామయ్యతో వాగ్వాదం చేశారు. గత కొన్నేళ్లుగా డీనోట్‌పై రిజిస్ట్రార్ సంతకం చేయలేదని.. ఈ దఫా కూడా సంతకం చేయనని ఆయన నిరాసక్తత వ్యక్తం చేయడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రిజిస్ట్రార్ చాంబర్లో గంట సేపు బైఠాయించి రిజిస్ట్రార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రిజిస్ట్రార్ జేఎన్టీయూకు వెళ్లి ఇన్చార్జ్ వీసీ ఆచార్య కే.లాల్కిశోర్ను సంప్రదించి సుబ్రమణ్యం సిపార్సులను తెలియచేశారు. వీటికి సమ్మతించిన వీసీ డీనోట్‌పై సంతకం చేద్దామని నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగుల ఖాతాల్లోకి జీతాలను జమచేశారు. ఈ కార్యక్రమంలో భోదనేతర సంఘం మాజీ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, అధ్యక్షుడు కేశవరెడ్డి ,ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లోకేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మళ్లీ కస్టడీకి కోరే అవకాశం: ఆర్థిక నేరాలకు పాల్పడిన వర్సిటీ ఉద్యోగులైన ఉదయ భాస్కర్‌రెడ్డి, శేషయ్య, కృష్ణమూర్తిలు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. వారిని తిరిగి పోలీస్ కస్టడీలో తీసుకుని ఇంటరాగేషన్ చేయాలని పోలీసు అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. పోలీస్ కస్టడీలో కుంభకోణంలో ఇద్దరు ప్రొఫెసర్ల పాత్ర ఉన్నట్టు వారు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి అందరి వివరాలు పూర్తీగా తెలియడానికి వారిని కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు మెజిస్ట్రేట్‌ను కోరే అవకాశం ఉంది