డీ నోట్ లేకుండానే వేతనాల మంజూరా? | Dee scholarships granted without a note? | Sakshi
Sakshi News home page

డీ నోట్ లేకుండానే వేతనాల మంజూరా?

Published Fri, Dec 5 2014 3:17 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM

Dee scholarships granted without a note?

యూనివర్సిటీ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో వెలుగుచూసిన జీతాల కుంభకోణాన్ని నిగ్గుతేల్చడానికి వర్సిటీ అంతర్గత ప్రొఫెసర్ల కమిటీకి  తోడుగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి నియమించిన ప్రత్యేక కమిటీ తన నివేదికను అందజేసింది. ఎస్కేయూ యంత్రాంగం చేసిన లోటుపాట్లపై సమగ్రంగా అధ్యయనం చేసిన కాగ్ రిటైర్డ్ అధికారి సుబ్రమణ్యం నివేదికను రిజిస్ట్రార్ ఆచార్య కే.దశరథరామయ్యకు గురువారం అందజేశారు. ప్రతి ఏటా కోట్ల లావాదేవీలు జరుగుతున్న వర్సిటీలో ఖాతాల నిర్వహణలో మౌలిక సూత్రాలు పాటించలేదని ఆయన తేల్చిచెప్పారు. ఇకముందు ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి సవివరంగా వివరించారు. గత కొన్నేళ్ల నుంచి డీనోట్‌పై రిజిస్ట్రార్ సంతకం చేయకుండా ఉండడం తప్పిదం అని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రూ.3.05 కోట్ల కుంభకోణం జరిగినట్లు తన నివేదికలో పేర్కొన్నారు. వర్సిటీ ఉద్యోగుల జీతాలలో కోత, అరియర్స్, పెన్షన్స్‌లో ఎంత దొరికితే అంత అన్నట్లుగా దారి మళ్లించినట్లు ప్రధానంగా వెల్లడించారు. ప్రతి ఉద్యోగి వివరాలు ఖాతా నంబరుతో సహా వివరంగా తెలియచేసిన డీనోట్‌పై ప్రతి నెలా ఫైనాన్స్ ఆఫీసర్‌తో సహా సంతకాలు చేయాల్సి ఉంటుందని తన సిపార్సులు వెలిబుచ్చారు. మరో వైపు ఫ్రొపెసర్ల కమిటీ తన పూర్తి నివేదికను వచ్చే వారంలో ఇవ్వనుంది.
 
 రిజిస్ట్రార్‌తో ఉద్యోగ సంఘాల వాగ్వాదం: ఎస్కేయూ ఉద్యోగులు తమ జీతాలు చెల్లించాలని రిజిస్ట్రార్ ఆచార్య కే.దశరథరామయ్యతో వాగ్వాదం చేశారు. గత కొన్నేళ్లుగా డీనోట్‌పై రిజిస్ట్రార్ సంతకం చేయలేదని.. ఈ దఫా కూడా సంతకం చేయనని ఆయన నిరాసక్తత వ్యక్తం చేయడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రిజిస్ట్రార్ చాంబర్‌లో గంట సేపు బైఠాయించి రిజిస్ట్రార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రిజిస్ట్రార్ జేఎన్‌టీయూకు వెళ్లి ఇన్‌చార్జ్ వీసీ ఆచార్య కే.లాల్‌కిశోర్‌ను సంప్రదించి సుబ్రమణ్యం సిపార్సులను తెలియచేశారు. వీటికి సమ్మతించిన వీసీ డీనోట్‌పై సంతకం చేద్దామని నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగుల ఖాతాల్లోకి జీతాలను జమచేశారు. ఈ కార్యక్రమంలో భోదనేతర సంఘం మాజీ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, అధ్యక్షుడు కేశవరెడ్డి ,ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లోకేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.  
 
 మళ్లీ కస్టడీకి కోరే అవకాశం: ఆర్థిక నేరాలకు పాల్పడిన వర్సిటీ ఉద్యోగులైన ఉదయ భాస్కర్‌రెడ్డి, శేషయ్య, కృష్ణమూర్తిలు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. వారిని తిరిగి పోలీస్ కస్టడీలో తీసుకుని ఇంటరాగేషన్ చేయాలని పోలీసు అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. పోలీస్ కస్టడీలో కుంభకోణంలో ఇద్దరు ప్రొఫెసర్ల పాత్ర ఉన్నట్టు వారు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి అందరి వివరాలు పూర్తీగా తెలియడానికి వారిని కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు మెజిస్ట్రేట్‌ను కోరే అవకాశం ఉంది

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement