ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ‘డమ్మీ లెక్చరర్లు’..! | Fake lecturers in the engineering Colleges | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ‘డమ్మీ లెక్చరర్లు’..!

Published Thu, Mar 23 2017 1:47 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ‘డమ్మీ లెక్చరర్లు’..! - Sakshi

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ‘డమ్మీ లెక్చరర్లు’..!

బోధన సిబ్బంది భర్తీలో కాలేజీల ఎత్తుగడ
సిబ్బందిని నియమించకుండా సర్టిఫికెట్లతో మేనేజ్‌ చేస్తున్న వైనం
డమ్మీ లెక్చరర్లు తనిఖీలున్న రోజే కాలేజీల్లో కనిపిస్తారు..
ఆ రోజుకు వారికి రూ.2 వేల నుంచి 5 వేలు చేతిలో పెడతారు..
నిజనిర్ధారణ కమిటీ తనిఖీల్లో వెల్లడి


సాక్షి, హైదరాబాద్‌: బోధన సిబ్బంది నియామకాల్లో ఇంజనీరింగ్‌ కాలేజీల్లో జిమ్మిక్కులు ప్రదర్శిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సిబ్బంది లేనప్పటికీ రికార్డుల్లో మాత్రం ఉన్నట్లు సృష్టించేందుకు నానాతంటాలు పడుతున్నాయి. తాజాగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బోధన సిబ్బంది, ఇతర సదుపాయాలున్నాయా లేదా అన్నదానిపై నిజనిర్ధారణ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఏప్రిల్‌ 15నాటికి తనిఖీల ప్రక్రియ పూర్తి కానుండగా, ఇప్పటివరకు 40 శాతం కాలేజీల్లో పరిశీలన ముగిసినట్లు అధికారులు చెబుతున్నారు.

వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి అఫిలియేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో కమిటీ సభ్యులు పరిశీలన చేసి వాస్తవ పరిస్థితులను యూనివర్సిటీకి నివేదించాలి. ఈ క్రమంలో కమిటీని సైతం బురిడీ కొట్టించేలా యాజమాన్యాలు డమ్మీ లెక్చరర్లను సీనియర్‌ ఫ్యాకల్టీలుగా చూపిస్తున్నారు. అఫిలియేషన్‌ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 310 కాలేజీలు జేఎన్‌టీయూకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 214 ఇంజనీరింగ్‌ కాలేజీలుండగా, మిగతావి ఎంబీఏ, ఫార్మసీ కాలేజీలు.

సగానికి పైగా డమ్మీలే...!
ప్రస్తుతం నిజనిర్ధారణ కమిటీ తనిఖీలు నిర్వహిస్తుండడంతో కాలేజీలన్నీ సందడిగా కనిపిస్తున్నాయి. రికార్డుల్లో పేర్కొన్న సిబ్బందిని ప్రత్యక్షంగా చూపేందుకు యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా బుధవారం ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ కాలేజీని అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో లెక్చరర్లు, వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నారు. ఇంతలో తనిఖీ బృందంలోని సభ్యుడు సమీపంలోని ఓ విద్యార్థితో ముచ్చటిస్తూ ఫలానా లెక్చరర్‌ తెలుసా అని ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. పాఠ్యాంశ బోధన తెలియని డమ్మీ అధ్యాపకులు చాలామంది ఉన్నట్లు గుర్తించారు. వీటిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు చెబుతున్నారు.

తనిఖీల రోజే భత్యం...
ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీల్లో డమ్మీ లెక్చరర్లే ఎక్కువ. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే కొందరు పూర్వ విద్యార్థులు లేదా నచ్చిన వ్యక్తుల్ని లెక్చరర్లుగా ఎంపిక చేసి, వారి నుంచి సర్టిఫికెట్లు తీసుకుని కాలేజీల్లో భద్రపరుస్తారు. తనిఖీల సమయంలో వాటిని అధికారులకు చూపడంతో పాటు ఆయా అభ్యర్థులను పిలిపించి లెక్కలు సర్దుబాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా కాలేజీకి హాజరైన డమ్మీ లెక్చరర్లకు రూ. రెండు వేలు నుంచి రూ. ఐదు వేల వరకు ముట్టజెపుతున్నారు. సాధారణంగా తనిఖీ బృందాలు కాలేజీలను ఆకస్మికంగా తనిఖీ చేయాలి. కానీ యాజమాన్యాలకు ముందస్తు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమై ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నాయి. దీంతో అవకతవకలను కప్పిపుచ్చుకునే అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. నిబంధనల మేరకు అంకెలు సరిపోవడంతో అధికారులు అనుమతులు ఇచ్చేస్తున్నారు.

మహ్మద్‌ పాషా ఎంటెక్‌ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో సంప్రదిస్తే.. లెక్చరర్‌ ఉద్యోగం ఇస్తామని అందుకు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు సమర్పించాలని యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో వారి సూచన మేరకు సర్టిఫికెట్లు ఇచ్చాడు. లెక్చరర్‌ ఉద్యోగం ఇస్తున్నట్లు లెటర్‌ ఇచ్చారు కానీ నెలవారీ వేతనం మాత్రం ఇవ్వడం లేదు. ఇదేమిటని అడిగితే.. సమాచారం ఇచ్చినప్పుడు వస్తే చాలని సూచించడంతో పాషా ఖంగుతిన్నాడు. యాజమాన్యం అడపాదడపా సమాచారమిస్తున్నప్పుడు హాజరవడంతో రూ. రెండు వేలు నుంచి రూ. ఐదు వేలు చెల్లిస్తుండటంతో సరేలే అని సర్దుకుని తనపని తాను చేసుకుంటున్నాడు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసమే కొన్ని ఇంజనీరింగ్‌ కాలేజీలు నడుస్తున్నాయి. ఆ కాలేజీలో సిబ్బంది ఉండరు. మౌలికవసతులు ఉండవు. కానీ అన్నీ ఉన్నట్లు తప్పుడు లెక్కలు చూపుతూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం అడుతున్నాయి.
– గత అసెంబ్లీ భేటీలో రీయింబర్స్‌మెంట్‌పై చర్చలో సీఎం కేసీఆర్‌ అన్న మాటలివి..
ప్రస్తుతం నిజనిర్ధారణ కమిటీ అధికారుల తనిఖీల్లో పలు కాలేజీల్లో ఇలాంటి సంఘటనలే బయటపడుతున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement