విశ్వహోదాపై నీలినీడలు | viswa hodapai neeli needalu | Sakshi
Sakshi News home page

విశ్వహోదాపై నీలినీడలు

Published Fri, Aug 5 2016 10:08 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

విశ్వహోదాపై నీలినీడలు

విశ్వహోదాపై నీలినీడలు

  •  ఆర్ట్స్‌ కళాశాలకు వర్సిటీ స్థాయిపై గందరగోళం
  •  పెద్ద సంఖ్యలో అధ్యాపకుల బదిలీలు
  •  మోకాలడ్డుతున్న ఉన్నత విద్యాశాఖ
  •  విడుదల కాని యూజీసీ నిధులు
  • కంబాలచెరువు (రాజమహేంద్రవరం) :
    అనుకున్నట్టుగా అంతా జరిగి ఉండి ఉంటే.. రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల(అటానమస్‌)కు ఈపాటికే విశ్వ విద్యాలయం హోదా దక్కి ఉండేది. కానీ, ఉన్నత విద్యాశాఖ నిర్లక్ష్యం పుణ్యమా అని ఈ చారిత్రక కళాశాలకు ‘విశ్వ’హోదా దక్కే ప్రక్రియపై నీలినీడలు కమ్ముకుంటున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. 1853లో జిల్లా స్కూలుగా ఈ విద్యాలయ ప్రస్తానం మొదలైంది. తదనంతరం నాటి మద్రాసు ప్రెసిడెన్సీలో ప్రొవిన్షియల్‌ స్కూలుగా.. ప్రభుత్వ కళాశాలగా రూపుదాల్చింది. ఆంధ్రప్రదేశ్‌లో తొలి ప్రభుత్వ కళాశాలగా పేరొందింది. యుగపురుషుడు కందుకూరి వీరేశలింగంపంతులుగారు, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వంటి మహానుభావులు ఈ కళాశాలలో విద్యాబోధన చేశారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారు, మాజీ కేంద్ర మంత్రి వీకే కృష్ణమీనన్, ప్రముఖ చిత్రకారుడు దామెర్ల రామారావువంటివారు ఈ కళాశాలలో విద్యాభ్యాసం చేసినవారే. ఇంతటి ఖ్యాతినొందిన ఈ కళాశాలకు విశ్వవిద్యాలయం హోదా దక్కే అవకాశం కొద్ది నెలల కిందట వచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్రీయ ఉచ్ఛతర్‌ శిక్షా అభియాన్‌(రూసా)కు పంపారు. దానికి దాదాపు ఆమోదం లభించింది. ఇక ఉత్తర్వులు రావడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో వేరే పరిణామాలు చోటు చేసుకున్నాయి.
    ఒకేసారి 30 మంది అధ్యాపకుల బదిలీ
    ఆర్ట్స్‌ కళాశాలలో మొత్తం 23 అండర్‌ గ్రాడ్యుయేట్, ఏడు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులున్నాయి. మొత్తం 3,500 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. కళాశాలకు మొత్తం 150 అధ్యాపక పోస్టులు అవసరం కాగా, కొన్నాళ్ల కిందటి వరకూ 83 మంది అ«ధ్యాపకులు, పీహెచ్‌డీలతో నెట్టుకొచ్చేవారు. అసలే చాలీచాలని అధ్యాపకులతో ఇబ్బందులు పడుతూండగా.. కొద్ది రోజుల కిందట ఒకేసారి 30 మంది అధ్యాపకులను, పీహెచ్‌డీలను బదిలీ చేశారు. దీంతో వారి సంఖ్య 53కు పడిపోయింది. బదిలీ అయినవారిలో నలుగురు పీహెచ్‌డీలు, సీనియర్లు ఉన్నారు. కనీసం వారిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. త్వరలో వర్సిటీ హోదా వస్తుందనుకుంటున్న నేపథ్యంలో ఒకేసారి అంతమంది అధ్యాపకులు బదిలీ అవడం చర్చనీయాంశమైంది. అందునా ఈ ఏడాది కళాశాలలో ఎక్కువమంది విద్యార్థులు చేరారు. వారికి పీహెచ్‌డీలు ఒక్కరూ లేరు.
    పనులు ప్రారంభం కాక..
    ఏదైనా కళాశాలకు యూనివర్సిటీ హోదా ఇవ్వాలంటే ముందుగా దానిని కాలేజీ ఫర్‌ పొటెన్షియల్‌ ఎక్స్‌లెన్స్‌ (సీపీఈ) ఎంపిక చేయాలి. ఆవిధంగా కూడా ఆర్ట్స్‌ కళాశాల ఎంపికైంది. ఈ నేపథ్యంలో రూ.55 కోట్లు మంజూరయ్యాయి. కానీ, కళాశాలలో వర్సిటీ హోదాకు సంబంధించిన పనులు ఆరంభం కాకపోవడంతో ఆ నిధులు ఇంకా విడుదల కాలేదు. మరోపక్క వర్సిటీ హోదాకు సంబంధించిన పనులు సెక్రటేరియట్‌లో జరగడంలేదు.ఉన్నత విద్యాశాఖలో రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల నంబర్‌–1 స్థానంలో ఉంది. అది కాస్తా వర్సిటీగా మారిపోతే తమకో కళాశాల పోతుందన్న ఉద్దేశంతోనే ఉన్నత విద్యాశాఖ వర్సిటీ అప్‌గ్రడేషన్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.
    బదిలీకి ప్రిన్సిపాల్‌ యత్నాలు
    సరిగ్గా ఇదే సమయంలో తనను బదిలీ చేయాలని ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ మస్తానయ్య ఉన్నత విద్యాశాఖ అనుమతి కోరారు. యూజీసీ నిబంధనలు, జీవో నంబర్‌–42 ప్రకారం కళాశాలలో ప్రిన్సిపాల్‌ ఐదేళ్లు పని చేయాలి. కానీ మూడేళ్లకే ఆయన వెళ్లిపోవడానికి ప్రయత్నించడం కూడా చర్చనీయాంశమవుతోంది. కమిషనరేట్‌కు వెళ్లేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని, అక్కడ పని చేసే వేరే వ్యక్తిని ఇక్కడకు ప్రిన్సిపాల్‌గా పంపేలా ఒప్పందం చేసుకున్నారని చెబుతున్నారు.
    నిలిచిన యూజీసీ గ్రాంట్స్‌
    కళాశాలకు అటానమస్‌ కింద ఏటా రూ.20 లక్షలు, నాన్‌ అటానమస్‌ కింద రూ.కోటి వరకూ నిధులు మంజూరవుతాయి. వీటిని ఏవిధంగా ఖర్చు చేసిందీ చూపాలి. కానీ, ఆవిధంగా జరగకపోవడంతో యూజీసీ నిధులను నిలిపివేయడంతోపాటు నోటీసులు కూడా పంపింది. ఈ పరిణామాలన్నీ చూస్తూంటే ఆర్ట్స్‌ కళాశాలకు యూనివర్సిటీ హోదా ఎండమావే కానున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో రెండునెలల్లో కళాశాల నాక్‌  గ్రేడ్‌కు వెళ్లాల్సి ఉంది. ఇప్పటివరకూ కళాశాల నాక్‌–ఎ గ్రేడ్‌లో నిలిచింది. అభివృద్ధి కుంటుపడడంతో ఈసారి అది లేనట్టేనని అంటున్నారు.
    మేం చేయాల్సిదంతా చేశాం
    ఆర్ట్స్‌ కళాశాలను యూనివర్సిటీగా మార్చేందుకు మేము చేయాల్సిందంతా చేశాం. మొదట్లో యూనివర్సిటీ ప్రకటించారు. తరువాత సీపీఈ ఉంటేనే చేస్తామన్నారు. అదీ ఇచ్చారు. ఇక మా చేతుల్లో ఏమీలేదు. నాక్‌–ఎ గ్రేడ్‌కు వెళ్తాం. ఇంకా ౖటైమ్‌ ఉంది కదా.
    – సీహెచ్‌ మస్తానయ్య, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌
    అధ్యాపకుల బదిలీలతో ఆటంకం
    ఆర్ట్స్‌ కళాశాల విశ్వవిద్యాలయం హోదా వచ్చేందుకు మార్గం సుగమమైన దశలో ఒకేసారి 30 మంది అధ్యాపకులను బదిలీ చేయడం వెనుక కుట్ర ఉంది. యూనివర్సిటీ హోదాకు అడ్డుకట్ట వేయాలన్నదే దీని ఉద్దేశంలా కనిపిస్తోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకం. అధికారులు, ప్రిన్సిపాల్‌ నిర్లక్ష్య ధోరణితోనే యూజీసీ నిధులు ఆగిపోయాయి.
    – కె.విజయ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు 
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement