పిల్లారాయ దేవాలయం గర్భగుడిలోనికి, మండపంలోనికి ప్రవేశించిన డ్రైనేజీ నీరు
సాక్షి, యానాం (తూర్పు గోదావరి): యానాంలోని ప్రఖ్యాత పిళ్లయ్యార్ స్వామి(లక్ష్మీగణపతి) ఆలయంలోనికి డ్రైనేజీ నీరు ప్రవేశించడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా మంగళవారం ఉదయం నుంచి కురుస్తున్న భారీవర్షానికి దేవాలయంకు చేర్చి ఉన్న డ్రైనేజీ పొంగి పొర్లడంతో ఆ నీరు కాస్తా దేవాయంలోనికి ప్రవహించింది. దీంతో పూజలు కోసం వచ్చిన భక్తులు అవస్థలు పడ్డారు. ప్రధానంగా పవిత్రమైన గర్భగుడిలోనికి సైతం నీరు ప్రవహించడంతో అక్కడే ఉన్న భక్తులు లోపలికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా మండపంలోనికి భారీగా డ్రైనేజీ నీరు చేరింది.
డ్రైనేజీని శుభ్రపరచకపోవడంతో
ముఖ్యంగా పిల్లారాయవీధిలోని డ్రైనేజీని శుభ్రపరచకపోవడంతో ఈ సమస్య తలెత్తుతుందని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ డ్రైనేజీ ఆక్రమణకు గురైందని, మురుగునీరు శివారుకు వెళ్లలేని పరిస్ధితి నెలకొని ఉందని అంటున్నారు. దీనికి తోడు డ్రైనేజీలో వ్యర్థాలు విపరీతంగా పెరిగిపోయినప్పటికీ సంబంధిత మున్సిపాలిటీ యంత్రాంగం వారంలో ఒకటి రెండు సార్లు మించి స్కిల్ట్‌ను తీయడం లేదని దీంతో ఎక్కడ వ్యర్థాలు అక్కడ అడ్డుగా ఉండిపోవడంతో శివారుకు మురుగునీరు ప్రవహించక వర్షం వస్తే పిల్లారాయవీధి మొత్తం మునిగిపోతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పిల్లారాయవీధిలో వర్షం వస్తే అవస్థే
పిల్లారాయవీధి లోనే ముఖ్యమైన ప్రభుత్వ జూనియర్, డిగ్రీకళాశాల, హైస్కూల్, బ్యాంకులు, పోలీస్‌స్టేషన్, వివిధ వ్యాపారసముదాయాలు ఎక్కువగా ఉండటంతో ఈ వీధిగుండా ప్రయాణించే వారు ఎక్కువగా ఉంటారు. వర్షం వస్తే ఈ వీధిలోని ప్రధానంగా కాలేజీ వద్ద నీరు నిలువ ఉండిపోతుంది. ప్రభుత్వం స్పందించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీని శాశ్వతప్రాతిపదికన నిర్మించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా పిల్లారాయ దేవాలయం వద్ద డ్రైనేజీ నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment