సొంతగూడు కల.. చెదురుతోందిలా.. | dream to owne house | Sakshi
Sakshi News home page

సొంతగూడు కల.. చెదురుతోందిలా..

Published Wed, Apr 1 2015 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 PM

సొంతగూడు కల..  చెదురుతోందిలా..

సొంతగూడు కల.. చెదురుతోందిలా..

శివారు ప్రాంతాల్లో స్థల విక్రయాల్లో వెలుగు చూస్తున్న మోసాల పరంపర
ఆస్కారమిస్తున్న నిబంధనల లొసుగులు
భూబకాసురులకు వంతపాడుతున్న అధికారులు
పెరుగుతున్న బాధితుల చిట్టా స్థలం కొనే ముందు అవగాహన అవసరం

 
 గోపాలరావు అనే చిరుద్యోగి ఆనందపురం మండలంలోని ఒక గ్రామంలో  లే అవుట్‌లో ఇంటి స్థలం కొనుగోలు చేశాడు. పలుచోట్ల అప్పులు చేసి రిజిేస్ట్రేషన్ కూడా చేయించుకున్నాడు. ఐదేళ్లు తర్వాత విక్రయించి కుమార్తె వివాహం చేద్దామనుకున్నాడు. మధ్యలో ఒక సారి తన స్థలాన్ని చూడడానికి వెళ్లగా ప్రభుత్వ స్థలమని బోర్డు దర్శనమిచ్చింది.  గోపాలరావు ఆరా తీయగా, గతంలో అది ఎస్సీలకు కేటాయించిన సీలింగ్ భూమి అని తేలింది.
 
ఆనందపురం జంక్షన్‌లో తోపుడు బండి వ్యాపారి, రామారావు ఇక్కడకు సమీపంలో 60 గజాలు స్థలాన్ని కొనుగోలు చేశాడు. అప్పు చేసి ఆరేళ్ల క్రితం చిన్న ఇల్లు నిర్మించాడు. ఆర్ధిక పరిస్థితి బాగోలేక, విక్రయించేశాడు. తీరా రిజిేస్ట్రేషన్  కార్యాలయానికి వెళ్లగా ఆ సర్వే నెంబరు నిషేధిత జాబితాలో ఉందని అధికారులు తెలపడంతో
 నిశ్చేష్టుడయ్యాడు.
 
 అక్కయ్యపాలెంకు చెందిన వెంటకరావు పోర్టులో పనిచేసి రిటైరయ్యారు. ఉన్నదంతా కూడబెట్టి 100 గజాల స్థలం కొంటే పక్కనున్న వ్యక్తి ఇది తాను ఇదివరకే కొనుక్కున్నానంటూ కాగితాలు చూపిస్తున్నాడు. వెంకటరావుకు ఏం చేయాలో పాలుపోలేదు. మోసపోయానని అర్థమైంది.
 
 ఈ ముగ్గురే చాలామందికి నగర శివారులో ఎదురవుతున్న సమస్య ఇది.. శివారు ప్రాంతాలలో నివాస స్థలాలకు విపరీతమైన గిరాకీ ఏర్పడి,ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఇదే అదునుగా కొంత మంది ‘రియల్’ మోసాలకు పాల్పడుతున్నారు. కొంత మంది చిన్న, మధ్య తరగతి కుటుంభాలను టార్గెట్‌గా చేసుకొని చౌకగా స్థలాలు అంటూ విక్రయించిన స్థలాలనే మరలా విక్రయించడం, తప్పుడు రికార్డులను సృష్టించడం, ప్రభుత్వ భూములను లే అవుట్లుగా అభివృద్ధి పరిచి విక్రయిండంతో తెలియని కొంత మంది వాటిని కొనుగోలు చేసి మోసపోతున్నారు. రియల్ మోసాలు వలన పెద్దల మాట ఎలా ఉన్నా మధ్య తరగతి వారి సొంత ఇంటి ఆశలు పేక మేడల్లా కూలి పోతున్నాయి.  వ్యాపారులతో పాటు, బడాబాబులు కూడా ఇలాంటి మోసాలకు పాల్పడుతుండడంతో మధ్య తరగతి కుటుంబీకులు వారితో వేగ లేక కోర్టులు చుట్టూ తిరగలేక మిన్నకుండి పోతున్నారు. నగరంతో పాటు భీమిలి, ఆనందపురం, పెందుర్తి మండలాల్లో ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగు చూసినా అధికారులు మాత్రం తీసుకున్న చర్యలు కానరావడంలేదు.

పోలీసు, రెవిన్యూ, రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బంది సమన్వయంతో పని చేయకపోవడం వలన, మోసగాళ్లు పని మరింత సులభమవుతోంది. నగరం నడిబొడ్డున ఇటీవల ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు స్థలాన్ని తప్పుడు రికార్డులతో స్వాధీనం చేసుకోవడానికి కొంత మంది యత్నించగా, పలుకుబడితో అడ్డుకోగలిగారు. ఒక ఎంపీ పరిస్థితే అలా ఉంటే సామాన్యుడు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గతంలో మధురవాడలో ఇళ్ల స్థలాలు కొనుగోలు వ్యవహారంలో సినీ నటి అనుష్క, నాగార్జున వంటి వారినే బురిడి కొట్టించారు. తప్పుడు డాక్యుమెంట్లుతో వారికి స్థలాలు విక్రయించడంతో వారు కోర్డు కేసులను ఎదుర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు కొకొల్లలు. మోసపోయిన వారు పోలీసులను ఆశ్రయిస్తే సివిల్ కేసులని కొట్టిపారేయడం, రెవెన్యూ అధికారులు సరైన సమాచారం అందించక పోవడంతో బాధితుల పరిస్థితి అయోమయంగా మారుతోంది. రియల్ మోసాలు రోజు రోజుకు పెరుగు పోతుండడంతో అందరినీ విస్మయపరుస్తోంది. రెవెన్యూ అధికారులు రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడంతో, వీరితో పాటు, రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బంది కూడా రియల్ ఇస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో మోసాలకు ఆస్కారం ఏర్పడుతోంది.
  - ఆనందపురం
 
 మోసాలకు ఆస్కారం ఇలా...
 
వ్యవసాయ భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులలోను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోను సమాచారం లభిస్తుంది. అదే నివాస ప్రాంతాలుగా మార్పు చేస్తే ఆ సమాచారం లభ్యం కాదు. దీంతో ఒకే డాక్యుమెంట్‌తో పలువురికి రిజిస్ట్రేషన్లు చేయగలుగుతున్నారు.

వ్యవసాయ భూముల విక్రయాలు విషయంలో పట్టాదారు పాసుపుస్తకాలలో రిజిస్ట్రార్లు విక్రయ సమాచారం పొందుపరుస్తారు. స్థలాలు విక్రయాల విషయంలో హక్కు పత్రాలపై ఎలాంటి నమోదులు ఉండవు.

మీ సేవ కేంద్రాలలో ఈసీ (ఎన్‌కంబెర్స్‌మెంట్ సర్టిఫికేట్)లు 1985 నుంచి జరిగే లావాదేవీలకు మాత్రమే ఆన్‌లైన్‌లో లభ్యమవుతున్నాయి. అంతకు ముందు జరిగే లావాదేవీల కోసం, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పరిశీలన కోసం ధరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అందిస్తున్నారు. దీన్ని కొంత మంది మేనేజ్ చేయడం వలన ఒక్కో సారి నిల్ అని వస్తోంది. దీంతో ఒకే డాక్యుమెంట్‌తో పలుమార్లు రిజిస్టేషన్లు జరిగిపోతున్నాయి.

పలు మీ సేవా కేంద్రాలలో కొందరికి అనుకూలంగా ఆస్థిలకు సంబందించిన వాస్తవ సమాచారాన్ని తొక్కిపెట్టి జారీ చేస్తున్నారు. దీని వలన క్రయవిక్రయాలు బయటపడక రెండో సారి విక్రయాలకు ఆస్కారం ఏర్పడుతోంది.

సీలింగ్ భూములు ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న అసలు హక్కుదారులు పేర్లే ఇంకా రికార్డులలో కొనసాగుతుండడంతో 1బి రికార్డు కాపీ ఆధారంగా అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయడానికి ఆస్కారం ఏర్పడుతోంది.

పాత డాక్యుమెంట్లపై ఫోటోలు ఉండవు. దీన్నీ ఆసరాగా చేసుకొని అమ్మేసిన ఆస్థులనే మరలా నకిలీ వ్యక్తులతో వారిని వారసులుగా చూపించి నేరుగా విక్రయాలు జరుపుతున్నారు.

1బిలో పొరపాటున భూ హక్కుదారుల కాకుండా, వేరే పేర్లు నమోదైతే రియాల్టర్లు దాన్నే ఆసరాగా చేసుకొని, విక్రయం చేసి సొమ్ము చేసుకుంటున్నారు.

పట్టా భూములను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు దాన్ని ఆనుకొని ఉన్న బంజరు భూములను కొనుగోలు చేసి వాటితో కలిపి లే అవుట్లును వేసి విక్రయిస్తున్నారు. పూర్తిస్థాయి సర్వే జరిపితే గానీ పట్టా ఏదో బంజరు భూమి ఏదో తెలియదు. ఈ లోగా కొనుగోలుదారులు మోసపోతున్నారు.

మధురవాడ, ఆనందపురం, భీమిలి, పెందుర్తి ప్రాంతాలలో స్థలాలు కొనుగోలు చేసిన వారు విదేశాలలో స్థిరపడి ఉన్నారు. అలాంటి వారి వివరాలు సేకరించి, నకిలీ డాక్యుమెంట్లులను సృష్టించి విక్రయాలు జరుపుతున్నారు.
 
 తీసుకోవలసిన జాగ్రత్తలు
 

కొనుగోలు చేయబోయే  స్థిరాస్తికి సంబంధించి తొలుత ఈసీ (ఎన్‌కంబర్స్‌మెంట్ సర్టిఫికేట్)ని తీసుకొని డాక్యుమెంట్‌తో సరిపోల్చుకోవాలి.
 వారసత్వ ఆస్థి అయితే ఎస్.ఎఫ్.ఎ (సెటిల్‌మెంట్ ఫెయిర్ అడంగల్) రికార్డుని పరిశీలించిఅసలు హక్కు దారులను రూఢీ చేసుకోవాలి.
కొనుగోలు ఆస్తిఅయితే లింకు డాక్యుమెంట్లు తప్పనిసరి. అవి కూడా ఎస్.ఎఫ్.ఎ రికార్డులో ఉన్న హక్కుదారుడు నుంచి సంక్రమించినట్టు వరుస డాక్యుమెంట్లు ఉన్నాయో లేదో పరిశీలన చేసుకోవాలి.
 అసలు హక్కుదారు మరణిస్తే వారి కుటుంబ వారసత్వ ధ్రువపత్రాన్ని తప్పకుండా పరిశీలించి అధికారులచే నిర్థారించుకోవాలి.
అమ్మకదారు పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉంటే వారి పేరు 1బి రికార్డులలో నమోదయింది లేనిదీ సరిచూసుకోవాలి. లేదంటే బ్యాంకులు రుణాలు అందించడానికి అంగీకరించవు.
 కొనుగోలు చేసిన స్థలాలు తప్పకుండా సర్వే చేయించుకొని కొనుగోలు చేస్తున్న స్థలం డాక్యుమెంట్‌లో ఉన్న సర్వే నెంబర్లలో ఉన్నదీ లేనిదీ నిర్ధారించుకోవాలి. లేదంటే పట్టా భూముల సర్వే నెంబర్లతో ప్రభుత్వ భూములను విక్రయించే అవకాశం ఉంది.
 కొనుగోలు చేస్తున్న ఆస్థి యొక్క సర్వే నెంబర్లు ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములు, కోర్టు వివాదాలు, ప్రభుత్వం వివిధ అవసరాలకు సేకరించిన జాబితాలో ఉందో లేదో రెవిన్యూ అధికారులు సంప్రదించి నిర్ధారించుకోవాలి.
 
ఎనీవేర్ రిజిస్టేషన్లతోనూ ఇబ్బందులు...


కక్షిదారుల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎనీవేర్ రిజిష్ట్రేషన్ వలన కూడా పలు ఇబ్బందులు ఉన్నాయి. ఆస్తులను తమ పరిధిలోని సబ్ రిజిస్ట్టార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే ఉత్తమం. వేరే ప్రాంతలో చేస్తే పెండింగ్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అలాగే రిజిస్ట్రేషన్ ఒక చోట ఆస్తి వెరిఫికేషన్ మరో చోట జరగడం వలన పొరపాటు జరిగే అవకాశం ఉంది. మాతృ కార్యాలయంలోనే పరిశీలన చేసుకోవడానికి అన్ని రికార్డులు అందుబాటులో ఉంటాయి.
 
 ఇలా చేస్తే మంచిది.


 రెవిన్యూ శాఖాధికారులు ఎస్.ఎఫ్.ఎ, నిషేధిత ఆస్తుల జాబితా (22ఎ) సీలింగ్ భూములు, ప్రభుత్వ ఆస్థుల జాబితా, ప్రభుత్వ అవసరాల కోసం సేకరించిన భూములు జాబితాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి.  సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఆస్థుల వివరాలను కక్షిదారులు నేరుగా పరిశీలించుకోవడానికి అవకాశం కల్పించాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement