గిరిజన ప్రాంతంలోని బాక్సైట్ నిక్షేపాల తవ్వకానికి చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అన్నారు.
అరకులోయ : గిరిజన ప్రాంతంలోని బాక్సైట్ నిక్షేపాల తవ్వకానికి చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అన్నారు. సోమవారం అరకులోయకు వచ్చిన ఆయన స్థానిక గ్రీన్‌వ్యాలీ హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు. గతంలో బాక్సైట్ తవ్వకాలకు బీజం వేసింది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. బాక్సైట్‌ను వెలికితీయడం వల్ల గిరిజనుల మనుగడకు విఘాతం కలుగుతుందన్నారు.
మన్యంలో పర్యాటక శాఖ అడుగు పెట్టినప్పుడు ఆయా పంచాయతీలకు వచ్చిన ఆదాయంలో 10 శాతం ఇస్తామని చెప్పి మోసం చేసిం దన్నారు. అదే విధంగా బాక్సైట్ విషయంలో కూడా గిరిజనులను నమ్మించి మోసం చేస్తారని అన్నారు. అందుకే అన్ని మండలాల నుంచి అన్ని పార్టీల మద్దతు కూడగట్టి బాక్సైట్ వ్యతిరేకంగా పోరాటానికి సన్నద్ధమవుతామన్నారు.
ఇలా ఉం డగా అన్ని మండల కేంద్రాల్లో ఆధార్ కేంద్రాలు పునరుద్ధరించాలని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు డిమాండ్ చేశారు. హుకుంపేటలో మినహా మరే ఇతర మండలాల్లో ఆధార్ కేంద్రాలు లేకపోవడంతో మిగిలిన మండలాల వారు అవస్థలు పడుతున్నారన్నారు. సమావేశంలో అరకులోయ ఎంపీపీ కె.అరుణకుమారి, వైఎస్సార్‌సీపీ నాయకులు శెట్టి అప్పాలు,సమర్డి రఘునాథ్, మాజీ జెడ్పీటీసీ శ్రీరాములు, బాబూరావు, దొన్ను, స్వామి,సత్యనందం,రమేష్, పాండురంగస్వామి, భీమరాజు పాల్గొన్నారు.
ఆదివాసీ దినోత్సవం ఏజెన్సీలోనే జరపాలి
పాడేరు : ఈ నెల 9న జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విశాఖ ఏజెన్సీలో ప్రభుత్వం అధికారికంగా జరపాలని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆదివాసీ దినోత్సవాన్ని ప్రస్తుత టీ డీపీ ప్రభుత్వం అధికారికంగా జరపకపోవడం బాధాకరమన్నారు.
భారత రాజ్యాంగంలో ఆదివాసీలకు ప్రత్యేకమైన హక్కులు, చట్టాలు ఉన్నా వాటిని పాలకులు చిత్తశుద్ధితో ఆమలు చేయకపోవడంతో అన్ని రంగాల్లోను అభివృద్ధికి దూరంగానే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలకు సురక్షిత తాగునీరు కరువైందని, విద్య, వైద్య రంగాల్లోను నిర్లక్ష్యం నెలకొందన్నారు. రోడ్లు, రవాణా సౌకర్యాలకు దూరంగానే ఉన్నారని అన్నారు. ఆదివాసీల స్వయంపాలన లక్ష్యంతో ఏర్పడిన పీసా చట్టాన్ని కూడా ఆమలు చేయడం లేదన్నారు.
అందువల్ల ఆదివాసీల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలన్నారు. గిరిజన ప్రజాప్రతినిధులు, గిరిజన ఉద్యోగులు, విద్యార్థులు, మేథావులను భాగస్వామ్యం చేసే విధంగా ఈ సదస్సును పాడేరు లేదా అరకులోయ ప్రాంతాల్లో నిర్వహించి గిరిజన సంక్షేమంపై చంద్రబాబు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.