మంచినీరే..మాకు సమస్య
- కలెక్టర్ ఎదుట వాపోయిన బుచ్చనపాలెంవాసులు
బుచ్చనపాలెం(పొదిలి) : ‘మంచినీరు సరిగ్గా రాకపోవడం ఒక సమస్య కాగా..వచ్చే కొద్దిపాటి నీళ్లూ కలుషితంగా వస్తున్నాయి. ఆ నీటిని తాగి రోగాల పాలవుతున్నాం’ అని మండలంలోని బుచ్చనపాలెం ఎస్సీ, బీసీ కాలనీవాసులు కలెక్టర్ సుజాత శర్మ ఎదుట వాపోయారు. జ్వరపీడితులు ఎక్కువగా ఉన్న ఆ రెండు కాలనీలను గురువారం కలెక్టర్ సందర్శించారు. రోగాలు ప్రబలటానికి తాగునీరే కారణమని పలువురు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. స్టోరేజీ ట్యాంకును పరిశీలించి అక్కడ నీటిలో లార్వా ఉందో లేదో చూడాలని తహశీల్దార్ విద్యాసాగరుడికి కలెక్టర్ సూచించారు. శుభ్రమైన తాగునీరు కాలనీలకు అందించాలని ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాస్‌ను ఆదేశించారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. పది రోజులకు ఒకసారి తాగునీళ్లొస్తున్నాయని, శ్మశాన స్థలం సమస్యగా ఉందని చెప్పారు.
తల్లిని ఇంట్లోకి పంపండయ్యా...
మంచంలో ఉన్న ఓ వృద్ధురాలు తన గోడు వినాలని కలెక్టర్‌ను అర్ధించింది. రెండు చేతులు ఎత్తి దండం పెట్టిన ఆ వృద్ధురాలు తనకు పింఛన్ రావటం లేదని విన్నవించింది. అంత పెద్ద భవనం పక్కన పెట్టుకుని ఆతల్లిని ఆ రేకుల షెడ్‌లో ఎందుకు ఉంచారంటూ కలెక్టర్ ప్రశ్నించారు. వృద్ధురాలికి సంబంధించిన వ్యక్తులను పిలిపించి ముందుగా ఆ తల్లిని ఇంట్లోకి పంపండయ్యా అని చెప్పారు.
పాఠశాల పిల్లలతో మాటా మంతి
ఎస్సీ కాలనీలోని పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. అక్కడ పిల్లలతో మాట్లాడారు. పుస్తకం చూపిస్తూ పిల్లలను పలు ప్రశ్నలు వేశారు. కాలనీల్లోని మరుగుదొడ్ల నిర్మాణంపై మొత్తం నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట కందుకూరు ఆర్డీవో జి.మల్లికార్జున, డీఎల్‌పీవో సుమతికళ, తహ శీల్దార్ పి.విద్యాసాగరుడు, డిప్యూటీ డీఎంఅండ్‌ెహ చ్‌వోలు శ్రవణ్‌బాబు, పద్మజ, జిల్లా క్షయ నివారణ అధికారి టి.రమేష్, డాక్టర్ బ్రహ్మతేజ, వైఎస్సార్ సీపీ నాయకులు కల్లం సుబ్బారెడ్డి, మల్లెల యేబు, జన్మభూమి కమిటీ సభ్యులు వై.వెంకటేశ్వరరెడ్డి, జిలానీ బాష, రసూల్, అవులూరి యల్లమంద పాల్గొన్నారు.