వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్ కార్తికేయ మిశ్రా
కాకినాడ రూరల్: రబీలోశివారు భూములకు నీటిఎద్దడి రాకుండా చూడాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, పశుపోషణ, మత్స్యశాఖ, ఉద్యోనశాఖల ప్రగతిని మంగళవారం కలెక్టరేట్‌లోని కోర్టు హాలులో ఆయన సమీక్షించారు. వరి కోతలకు సిద్ధమవుతున్న తరుణంలో రానున్న 15 రోజులు శివారు భూములకు నీటి పంపిణీ విషయంలో అప్రమత్తత అవసరమని సూచించారు. రెవెన్యూ, వ్యవసాయం, నీటిపారుదలశాఖల అధికారులతో బృందాలు ఏర్పాటు చేసి నీటి సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. డొంకరాయిలోని మినీ విద్యుత్ ప్లాంట్‌ను 10 రోజుల పాటు మూసి వేస్తే రెండు వేల క్యూసెక్కులు అదనపు నీరు వచ్చే అవకాశముందని, ఈ మేరకు ప్రభుత్వంతో చర్చించి చర్యలు చేపడతామని చెప్పారు.
వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ కేవీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో రబీ సీజన్‌లో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు 6,270 క్వింటాళ్లు సబ్సిడీపై పంపిణీ చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ అమలు జరగాలని కలెక్టర్ ఆదేశించారు. యు.కొత్తపల్లి, కాట్రేనికోన, సఖినేటిపల్లి ఫిష్ డ్రైయింగ్ ప్లాట్‌ఫారాల నిర్మాణం వేగంగా చేయాలని ఆదేశించారు. జిల్లాకు నూతనంగా మంజూరైన నాలుగు రైతుబజార్ల ఏర్పాటుకు స్థల సేకరణ చేపట్టాలన్నారు. జేసీ–2 జె. రాధాకృష్ణమూర్తి, ట్రైనీ కలెక్టర్ ఎ.ఆనంద్, ఇరిగేషన్ ఎస్‌ఈ కృష్ణారావు, పశుసంవర్థకశాఖ జేడీ కె. శివాజీ, మత్స్యశాఖ జేడీ జయరావు, మైక్రో ఇరిగేషన్ పీడీ ఎస్.రామమోహన్‌రావు, ఉద్యోగశాఖ ఏడీ గోపీకుమార్ పాల్గొన్నారు.
ఉపాధి పనులకు ప్రతిపాదనలు
ఉపాధి హామీ పథకం కింద 2018–19 సంవత్సరంలో వివిధ శాఖల ద్వారా చేపట్టే పనుల వార్షిక లక్ష్యాల నిర్దేశించడానికి ప్రతిపాదనలు శనివారం నాటికి సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధిహామీ కన్వర్జెన్సీ శాఖ అధికారులతో నేరుగాను, డివిజన్, మండల అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం చేపట్టిన పనుల మస్తర్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడింగ్, అప్‌డేటింగ్ ప్రక్రియను నిర్వహించి మార్చి 31 తరువాత ఏ ఒక్క చెల్లింపూ పెండింగ్ ఉండకుండా చూడాలన్నారు. రానున్న 10 రోజుల్లో వేతన కాంపోనెంట్ అధికంగా వచ్చే పనులనే ప్రాధాన్యంగా చేపట్టాలని ఆదేశించారు.
జిల్లాలో మంజూరైన పంటకుంటలు, వర్మీకంపోస్టు యూనిట్లు, క్రీడా మైదానాల పనులను నెలాఖరులోపు గరిష్ట సంఖ్యలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెల 24న ఉపాధి వేతన చెల్లింపులపై ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తామని, శాఖల వారీ సమగ్ర వివరాలు సమర్పించాలని చెప్పారు. ఉపాధి పనులకు చెల్లింపులు గ్రామపంచా యతీ లేదా కూలీ అకౌంట్‌కే క్రెడిట్ కావాలని, మరే వ్యక్తిగత అకౌంట్‌కు బదిలీ అయినట్లు గుర్తిస్తే బా ధ్యులపై చర్యలు చేపడతామన్నారు. కొత్త నిబం ధన ప్రకారం ఉపాధి పనుల ద్వారా సాధించిన మెటీరియల్ కాంపోనెంట్‌లో 50 శాతం అదే గ్రామపంచాయతీకి, 25 శాతం సంబంధిత నియోజకవర్గంలోనూ, మిగిలిన 25 శాతం కలెక్టర్ సూచనల మేరకు కేటాయించాల్సి ఉందన్నారు. జిల్లాలో చంద్రన్న బీమా పథకం బాండ్‌ల పంపిణీ , స్కాలర్‌షిప్‌ల డేటా ఎంట్రీ ప్రక్రియ శనివారం నాటికి పూర్తిచేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. డీఎఫ్‌ఓ నందిని సలారియా, డ్వామా పీడీ బి.రాజకుమారి పాల్గొన్నారు.
నూరు శాతం బ్యాంకు రుణాలు
స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాల అందజేతలో నూరుశాతం లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ డీఆర్‌డీఏ పీడీ ఎస్.మల్లిబాబును ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి డీఆర్‌డీఏ సీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా మొక్కలు నాటి వాటి పెరుగుదలకు చర్యలు చేపట్టని వారిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. డీఆర్‌డీఏ ఏపీడీలు, సీవోలు పాల్గొన్నారు.
రెవెన్యూ ఉద్యోగులకు ఆరోగ్య పరీక్షలు
రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న 40 సంవత్సరాలు దాటిన ఉద్యోగులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు కలెక్టర్ మిశ్రా మంగళవారం విలేకర్లకు తెలిపారు. ఏపీ వైద్య, ఆరోగ్య కుటుంబసంక్షేమ శాఖ రెవెన్యూ ఉద్యోగులకు మొత్తం సర్వీసులో మూడు పర్యాయాలు మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకునేందుకు జీవో నంబర్ 105ను జారీ చేసినట్టు వివరించారు. ఇదే విషయాన్ని రిఫరల్ ఆసుపత్రి ప్రతినిధులతో చర్చించాలని జేసీ మల్లికార్జునను ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో సూచించిన ప్యాకేజీ ప్రకారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు కాకినాడలోని అపోలో, సేఫ్ ఎమర్జన్సీ, సంజీవి ఆర్థోపెడిక్, సూర్యగ్లోబల్, పాండురంగ ప్రజావైద్యశాల, రాజానగరం జీఎస్‌ఎల్ మెడికల్ కళాశాల, రాజమహేంద్రవరం కిమ్స్ బొల్లినేని హాస్పిటల్, అమలాపురంలోని కిమ్స్ మెడికల్ కాలేజీలో రెవెన్యూ ఉద్యోగులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవచ్చని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమాన్ని బుధవారం లాంఛనంగా ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. జీవిత భాగస్వామితో కలసి రిఫరల్ ఆసుపత్రిల్లో తమ ఉద్యోగి ఐడీ చూపించి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవచ్చన్నా రు. ఆరోగ్య పరీక్ష చేయించుకొనే తేదీన ఉద్యోగికి స్పెషల్ కాజువల్ లీవ్ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయమై కలెక్టర్‌కు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అ సోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పితాని త్రినాథరావు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment