శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ-14కు సంబంధించి ఎస్‌జీటీ, పండిట్ పోస్టులలో నియామకాలను జూన్ నెలలో చేపట్టాలని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై అర్హత సాధించిన అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనపై నీళ్లు చల్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అసలు విషయాన్ని దాచిపెట్టి వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని అభ్యర్థులను ఆదేశించింది. మార్చి 18లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. అభ్యర్థులంతా వెబ్ ఆప్షన్లు పూర్తి చేసి పోస్టింగుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 1వ తేదీ నాటికి భర్తీ పూర్తి చేయాల్సి ఉంది.
అప్పటికే ఆర్థికశాఖ వేసవి సెలవుల్లో వీరికి జీతాలు చెల్లించడం వలన భారం పడుతుందని లెక్కలు కట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లు, దీనిపై ఆలోచనలు జరిపి వచ్చే విద్యా సంవత్సరంలో నియామకాలు చేపట్టాలని సూచించినట్లు తెలియవచ్చింది. ప్రభుత్వం నిధులను ఆదా చేయాలని యోచించి ఆర్థిక శాఖ సూచనలకు తలొగ్గినట్లు భోగట్టా. ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త వహించి వికలాంగ ధ్రువపత్రాల పరిశీలన పూర్తి కాలేదని సాకును చూపించింది. సాక్షి అసలు విషయాన్ని వెలుగులోకి తేవడంతో అభ్యర్థులు ఆందోళనబాట పట్టారు.
వారిని సముదాయించేందుకు గాను వెబ్ ఆప్షన్లు తీసుకుంటున్నట్లు డ్రామాను నడిపారు. ఆప్షన్లు ఇవ్వడం పూర్తయి సుమారు 15 రోజులు కావస్తుండగా ఇప్పటికీ పోస్టింగ్‌లు ఇవ్వలేదు. అభ్యర్థులు మరోసారి ఆందోళన బాట పట్టకుండా ఉండేందుకు గాను వారిని జడిపించే దోరణిని ప్రదర్శించాలని జిల్లాస్థాయి అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఉద్యోగంలోకి రాకముందే ఆందోళనలు చేస్తుండడాన్ని కఠినంగా పరిగణిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉద్యోగుల ద్వారా ప్రచారం చేయించారు.
దీంతో అభ్యర్థులు ఆందోళనలో పాల్గొనేందుకు వెనుకంజ వేయడంతో ప్రభుత్వం జరిపిన వ్యూహ రచన ఫలించినట్లయింది. ఇదిలా ఉంటే జూన్‌లో కూడా కొన్ని జిల్లాల్లో నియామకాలు జరిగే అవకాశాలు తక్కువ. ఇటీవల జరిపిన రేషనలైజేషన్‌లో మిగులు ఉపాధ్యాయులుగా ఉన్న వారిని ముందుగా సర్దుబాటు చేసి అటు తరువాతే డీఎస్సీ నియామకాలు చేపట్టాలని రాష్ట్ర అధికారులు జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశించారు. జిల్లాలో మిగులు ఉపాధ్యాయులు లేకపోవడంతో సమస్య తలెత్తదు. ఇటువంటి పరిస్థితుల్లో జూన్ మొదటి వారంలో జరిగే బడి పిలుస్తోంది కార్యక్రమంలో డీఎస్సీ-14 అభ్యర్థులు భర్తీలు పూర్తి చేసుకొని పాల్గొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
డీఎస్సీ నియామకాలు?
Published Tue, Mar 29 2016 11:54 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement